ఏ పార్టీకి ఓటేసినా బీజేపీకే పడుతోంది!!

 

మొదటి దశలోనే ఏపీలో పోలింగ్ ముగిసింది. అయితే ఆ సమయంలో ఒక పార్టీకి ఓటేస్తే మరో పార్టీకి ఓటు పడుతుందంటూ సీఎం చంద్రబాబు అనుమానం వ్యక్తం చేశారు. ఇప్పుడు మూడోదశ పోలింగ్ లోనూ పలువురు నేతలు అలాంటి అనుమానాలే వ్యక్తం చేస్తున్నారు.

నేడు దేశవ్యాప్తంగా లోక్ సభ మూడో దశ ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం ఏడు దశల పోలింగ్‌లో భాగం మూడో దశలో అత్యధికంగా 116 నియోజకవర్గాల్లో నేడు పోలింగ్‌ జరగనుంది. దేశంలోని 13 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో 116 నియోజకవర్గాల జరుగుతున్న ఈ ఎన్నికల్లో 1,640 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. గుజరాత్ 26 స్థానాలు, కేరళ 20, గోవా 2, కర్ణాటక 14, మహారాష్ట్ర 14, ఒడిషా 6, పశ్చిమ బెంగాల్ 5, అసోం 4, బీహార్ 5, చత్తీస్ గడ్ 7, జమ్మూ కాశ్మీర్ 1 స్థానాల్లో ఎన్నికలు జరుగుతుండగా, డయ్యూడామన్, దాద్రా నగర్ హవేలీ వంటి కేంద్ర పాలిత ప్రాంతాల్లో చెరో నియోజకవర్గంలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు.

గోవాలో ఈవీఎంలలో తలెత్తిన సమస్యతో వేరే పార్టీలకు వేసిన ఓట్లు కూడా బీజేపీకే పడుతున్నాయని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. ఇది నిజంగా సాంకేతిక సమస్యనా? లేక ఉద్దేశపూర్వకంగానే ఇలా చేస్తున్నారా? అని ప్రశ్నించారు.

కేరళలో ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారని తిరువనంతపురం కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఆరోపించారు. కాంగ్రెస్‌కు ఓటు వేసినా బీజేపీకే పోల్ అవుతున్నాయని ఆరోపించారు.