గ్రేట్ ‘క్రేజీ’వాల్
Published on: Wed Feb 2, 2022 5:16PM
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్.. చీపురు గుర్తుతో పార్టీ పెట్టి.. ఆ తర్వాత.. ఎన్నికల్లో గెలుచి.. ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాద్యతుల చేపట్టిన నాటి నుంచి నేటి వరకు ఆయన తీసుకున్న నిర్ణయాలు.. ఆయన చేపట్టిన పనులు అన్నీ సంచలనాలే. ఐఆర్ఎస్ ఉద్యోగాన్ని వదిలి.. పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన ఈ సార్... తన విధి, విధానాలతో ఒక్క రూపాయి కూడా అప్పు లేని రాష్ట్రంగా ఢిల్లీకీ గుర్తింపు తీసుకు వచ్చారీ కేజ్రీవాల్. అయితే కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకునే సమయానికి ఢిల్లీ.. అప్పుల కుప్పగా ఉందన్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతాన్ని అప్పుల ఊబి నుంచి బయటకు తీసుకు వచ్చి.. తన సమర్థతను చాటుకున్నారీ ఢిల్లీ ముఖ్యమంత్రి.
ఢిల్లీలోని ప్రజలందరికీ అన్ని వ్యాధులకూ వైద్య సేవలందించడంతోపాటు 200 యూనిట్ల వరకు విద్యుత్ బిల్లు ఉచితంగా అందిస్తుందీ కేజ్రీవాల్ సర్కార్. అంతేకాదు.. అన్ని ప్రభుత్వ పాఠశాలలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతుందీ ప్రభుత్వం. సదరు పాఠశాలలు ఇప్పుడు కార్పొరేట్ పాఠశాలలను దీటుగా పని చేస్తున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్‌లో చాప చుట్టేసి అటకెక్కించిన ఆనంద వేదిక (Happiness Curriculum) ఢిల్లీలో మాత్రం అద్భుతంగా నడుస్తోంది.
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి మనీష్ సిసోడియాలు తరచూ ఏదో ఒక పాఠశాలను సందర్శిస్తూ ఉంటారు. ఆ క్రమంలో ప్రధానోపాధ్యాయుడికి ఎదురుగా ఉన్న కుర్చిలో మాత్రమే వారు కూర్చుంటారు. అంతేకాదు.. ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలలకు ప్రధానోపాధ్యాయునితో పాటుగా ఎస్టేట్ మేనేజర్ పేరుతో మరో ప్రధానోపాధ్యాయుడిని కేజ్రీవాల్ ప్రభుత్వం నియమించింది. వీరు పాఠశాలకు అవసరమయ్యే వసతులు, నిర్వహణతోపాటు పాఠశాలల మరమ్మతులను వీరు పర్యవేక్షిస్తుంటారు. అయితే పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మాత్రం అకడమిక్ బాధ్యతలు మాత్రమే నిర్వర్తించాల్సి ఉంటుంది.
అయితే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. దేశంలోని కొన్ని రాష్ట్రాలు అప్పులు చేసి మరీ సంక్షేమ పథకాల పేరిట ప్రజలకు పప్పు బెల్లాలు పంచుతోందని ఆయన ఆరోపించారు. ఇది చెడ్డ రాజకీయాలకు నిదర్శనమని ఆయన స్పష్టం చేశారు. అయితే చక్కని అవగాహనతో, సమర్థతతో, దార్శనికతతో ఢిల్లీ ప్రజలను పాలన అందిస్తున్న కేజ్రివాల్‌కు దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తాయి.


