TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నమ్మకం లేదు యువరానర్.. ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్ వాదనలు

Published on: Tue Apr 14, 2026 11:23AM

ఢిల్లీ మద్యం విధానం కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మపై తనకు ఇసుమంతైనా నమ్మకం లేదని, ఆమె నేతృత్వంలోని బెంచ్ ముందు తనకు న్యాయం జరుగుతుందన్న ఆశ లేదని  కుండబద్దలు కొట్టారు. ఈ మేరకు సదరు న్యాయమూర్తి ఈ కేసు విచారణ నుంచి తప్పుకోవాలని (రెక్యుసల్) కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై కేజ్రీవాల్ స్వయంగా కోర్టులో తన వాదనలు వినిపించారు.

 గతంలో ఈ కేసును విచారించిన ట్రయల్ కోర్టు సుదీర్ఘంగా మూడు నెలల పాటు పరిశీలించి, అది తప్పుడు కేసు అని తేల్చిచెప్పిందని ఈ సందర్భంగా కేజ్రీవాల్ గుర్తు చేశారు. అయితే..  సీబీఐ హైకోర్టును ఆశ్రయించగానే కేవలం తొలి రోజే ఆ తీర్పును పక్కనపెట్టేలా జస్టిస్ స్వర్ణకాంత శర్మ వ్యవహరించారని   ఆరోపించారు. కేవలం మూడు విచారణలతోనే నిందితులందరినీ అవినీతిపరులుగా ముద్ర వేయడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమన్నారు.

న్యాయమూర్తి గతంలో ఏబీవీపీ వంటి సంస్థలు నిర్వహించిన కార్యక్రమాలకు హాజరైన విషయాన్ని కేజ్రీవాల్ తన వాదనల్లో ప్రధానంగా ప్రస్తావించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ భావజాలంతో సంబంధం ఉన్న వారికి తమ వంటి ప్రత్యర్థుల కేసుల్లో నిష్పాక్షికంగా తీర్పు ఇచ్చే అవకాశం ఉండదన్న అనుమానాన్ని ఆయన  వ్యక్తం చేశారు. ముఖ్యంగా ప్రతిపక్ష నాయకులపై ఉన్న కేసులను మాత్రమే అత్యంత వేగంగా విచారిస్తూ, దర్యాప్తు సంస్థల వాదనలతో ఏకీభవించడం పక్షపాత వైఖరిని సూచిస్తోందన్నారు. 

మరోవైపు..  కేజ్రీవాల్ వ్యాఖ్యలను సీబీఐ తరఫు న్యాయవాది తుషార్ మెహతా తీవ్రంగా వ్యతిరేకించారు. రాజకీయ కారణాలను సాకుగా చూపి న్యాయమూర్తులను తప్పుకోవాలని కోరడం సరికాదన్నారు.  ఇటువంటి ధోరణి న్యాయవ్యవస్థకు గొడ్డలిపెట్టన్నారు. ప్రతి ఒక్కరూ తమకు నచ్చని జడ్జిలపై ఇలాంటి ఆరోపణలు చేస్తే విచారణలు సాధ్యం కావని  పేర్కొన్నారు.

ప్రస్తుతం ఈ పరిణామం ఢిల్లీ రాజకీయాల్లోనే కాకుండా న్యాయ వర్గాల్లోనూ తీవ్ర చర్చకు దారితీసింది. న్యాయమూర్తి స్వయంగా ఈ విచారణ నుంచి తప్పుకుంటారా లేక కేజ్రీవాల్ అభ్యర్థనను తోసిపుచ్చుతారా అనేది ఉత్కంఠగా మారింది. ఒకవేళ విచారణాధికారి మారితే కేసు మలుపు తిరిగే అవకాశం ఉందని న్యాయనిపుణులు భావిస్తున్నారు. రానున్న రోజుల్లో ఈ పిటిషన్‌పై కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపైనే కేజ్రీవాల్ భవిష్యత్తు ఆధారపడి ఉంది.