TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జగన్ కాళ్ల దగ్గర లక్ష్మీ పార్వతి

Published on: Mon Nov 5, 2018 9:28AM

 

రాహుల్ గాంధీ, ఏపీ సీఎం చంద్రబాబు భేటీతో చంద్రబాబుపై ప్రారంభమైన విమర్శల పర్వం కొనసాగుతోంది. దీనిపై కాంగ్రెస్ కు టీడీపీని తాకట్టు పెట్టారంటే వైసీపీ నేత లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ ఘాట్ లోని ఎన్టీఆర్ సమాధి వద్ద నిరసన తెలిపారు. అంతేకాదు వైసీపీ, జనసేన, టీఆర్ఎస్, బీజేపీ వంటి పార్టీలన్నీ చంద్రబాబుపై విమర్శల వర్షం కురిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దీనికి సమాధానమిస్తూ ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ప్రజలకు బహిరంగ లేఖ రాశారు.ఇటీవల విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ తో టిడిపి పొత్తు పెట్టుకుంటే అని విలేకర్లు అడిగిన ప్రశ్నకు.. "అలా ఎప్పటికీ జరగదని,ఒకవేళ అలా జరిగితే తాను ఉరి వేసుకుంటానని" సంచలన వ్యాఖ్యలు చేసిన కేఈ తాజగా రాహుల్ చంద్రబాబు భేటీని సమర్థించారు..దీనిపై విపక్షాల విమర్శలను తిప్పికొడుతూ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు.

 

 

రాజ్యాంగ పరిరక్షణ కోసం చంద్రబాబు చేస్తున్న కృషిని ప్రజలు అర్థం చేసుకోవాలని ఆయన తన లేఖలో కోరారు. అంతేకాకుండా లేఖలో ప్రతిపక్షాలపై పలు ప్రశ్నలను సంధించారు.''రాహుల్‌ని చంద్రబాబు కలిస్తే తప్పేంటి? విభజన చట్టంలోని హామీలను విస్మరించి మనల్ని మోసం చేసిన వారిపై తిరగబడి మన హక్కులను కాపాడుకోవాలని అనుకోవడం తప్పా?...ఎన్టీఆర్ కుమార్తె పురందేశ్వరి కాంగ్రెస్‌లో చేరి మంత్రి పదవి తీసుకున్నప్పుడు ఎన్టీఆర్ ఆత్మ క్షోభించలేదా? పార్టీ మారి బీజేపీలో చేరినపుడు బాధపడలేదా?..  లక్ష్మీ పార్వతి జగన్ కాళ్ల దగ్గర కూర్చుంటే ఎన్టీఆర్ ఆత్మ బాధపడలేదా? ఒక్క టీడీపీ మాత్రం కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటే ఎన్టీఆర్ ఆత్మ ఘోషిస్తుందా?’’ అని లేఖలో కేఈ ప్రశ్నల వర్షం కురిపించారు.బీజేపీ చేతిలో వైసీపీ కీలుబొమ్మగా మారిందని కేఈ దుయ్యబట్టారు.