TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కెసీఆర్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురు... కమిషన్ చైర్మన్ మార్చాలని ప్రభుత్వానికి ఆదేశం

Published on: Tue Jul 16, 2024 3:47PM

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఛత్తీస్ గఢ్ నుంచి విద్యుత్ కొనుగోళ్లు, యాదాద్రి, భద్రాద్రి పవర్ ప్లాంట్ల నిర్మాణం అంశాల్లో జరిగిన అవకతవకలపై విచారించేందుకు తెలంగాణ ప్రభుత్వం జస్టిస్ నరసిహారెడ్డి ఛైర్మన్ గా కమిషన్ ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ కమిషన్ ను రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టును కేసీఆర్ ఆశ్రయించారు. 
కేసీఆర్ పిటిషన్ ను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. కేసీఆర్ పిటిషన్ ను ధర్మాసనం డిస్మిస్ చేసింది. కమిషన్ విచారణ కొనసాగించాలని తెలిపింది. కొత్తగా నోటిఫికేషన్ జారీ చేయాల్సిన అవసరం లేదని చెప్పింది. దీనిని జ్యుడీషియల్ ఎంక్వైరీ అనకుండా... ఎంక్వైరీ కమిషన్ గా వ్యవహరించాలని తెలిపింది.
మరోవైపు, కమిషన్ ఛైర్మన్ గా నరసింహారెడ్డి స్థానంలో మరొకరిని నియమించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో, కమిషన్ ఛైర్మన్ ను మారుస్తామని సుప్రీంకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. రిటైర్డ్ జడ్జిలతో తాము సంప్రదింపులు జరుపుతున్నామని, కొత్త ఛైర్మన్ పేరును తెలిపేందుకు సమయం కావాలని... సోమవారం కొత్త ఛైర్మన్ పేరును తెలియజేస్తామని కోర్టుకు తెలిపింది. ఇప్పటికే హైకోర్టులో కెసీఆర్ కు చుక్కెదురైంది. కమిషన్ రద్దు చేయాలని కెసీఆర్ వేసిన పిటిషన్  కొట్టి వేసింది.