TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కేసీఆర్ నేషనల్ టూర్ నేటి నుంచి.. జాతీయ రాజకీయాల దిశగా తొలి అడుగు?

Published on: Fri May 20, 2022 8:27AM

కేసీఆర్ జాతీయ రాజకీయాలలో ప్రవేశం దిశగా దూకుడు పెంచారు. ఇందులో భాగంగా ఆయన శుక్రవారం నుంజీ దేశ వ్యాప్త పర్యటన చేపట్టనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన పలు  రాజకీయ సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే రాజకీయ, అర్థిక,  మీడియా రంగాలకు చెందిన ప్రముఖులతో సమావేశం అవుతారు. దేశం కోసం ప్రాణాలర్పించిన అమర సైనిక కుటుంబాలకు,  వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కేంద్రాన్ని నిగ్గదీసి సంచలనం సృష్టించిన   రైతు ఉద్యమంలో అసువులు బాసిన రైతుల కుటుంబాలను పరామర్శిస్తారు.  

వారికి ఆర్థిక సహాయం అందిస్తారు. ఇందుకోసం ఆయన శుక్రవారమే తన పర్యటన ప్రారంభిస్తున్నారు. ముందుగా ఢిల్లీ వెళ్లి అక్కడ వివిధ రాజకీయ పార్టీల నేతలతో సిఎం సమావేశం అవుతారు. అలాగే మరింత పదునుగా మోడీ ఆర్థిక విధానాలను ఎండగట్టేందుకు ప్రముఖ ఆర్థికవేత్తలతో భేటీ కానున్నారు. ఆర్థిక రంగ నిపుణులతో భేటీ సందర్భంగా  దేశ ఆర్థిక పరిస్థితులపై చర్చిస్తారు. మోడీ లోపభూయిష్ట ఆర్థిక విధానాలపై దేశ ప్రజలకు వివరించేందుకు అవసరమైన ఇన్ పుట్స్ ఈ సందర్భంగా వారి నుంచి స్వీకరిస్తారు. అలాగే  ప్రముఖ జాతీయ మీడియా సంస్థల జర్నలిస్టు ప్రముఖులతో సిఎం కెసిఆర్ సమావేశమౌతారు.  

శుక్రవారం నుంచి ఆదివారం అంటే మే 22 వరకూ ఆయన హస్తినలోనే మకాం వేస్తారు. మే 22 మధ్యాహ్నం కేసీఆర్ ఢిల్లీనుంచి చంఢీఘర్  వెళతారు. గతంలో ప్రకటించిన విధంగా  జాతీయ రైతు ఉద్యమంలో అసువులు బాసిన సుమారు 600 రైతు కుటుంబాలను సిఎం కెసిఆర్ పరామర్శించి ఒక్కో కుటుంబానికీ మూడు లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తారు.   ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో కేసీఆర్ తో పాటు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సిఎం భగవంత్ మాన్ సింగ్ లు కూడా పాల్గొననున్నారు.

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన రైతు ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన  పంజాబ్, హర్యాన, ఉత్తర్ ప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాలకు చెందిన రైతుల కుటుంబాలకు   కేసీఆర్ ఆర్థిక సహాయం అందిస్తారు. ఆ తరువాత మే 2న ఆయన బెంగళూరు చేరుకుంటారు.  మాజీ భారత ప్రధాని దేవగౌడ, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామితో సమావేశమౌతారు. 

బెంగుళూరు నుంచి మే 27 తేదీన రాలేగావ్ సిద్ది పర్యటనను  చేపట్టనున్నారు. అక్కడ ప్రముఖ సమాజిక ఉద్యమకారుడు అన్నా హజారేతో సిఎం కెసిఆర్ భేటీ అవుతారు.  అటునుంచి  సాయిబాబా దర్శనం కోసం సిఎం కెసిఆర్ షిరిడీ వెళతారు. అక్కడనుంచి పర్యటనలను ముగించుకుని తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు.   ఒకటి రెండు రోజుల విశ్రాంతి తరువాత  మే 29 లేదా 30 న బెంగాల్, బీహార్ రాష్ట్రాల పర్యటనకు సిఎం కెసిఆర్ బయలుదేరుతారు.  

గాల్వాన్ లోయలో వీరమరణం పొందిన భారత సైనిక కుటుంబాలను సిఎం పరామర్శిస్తారు. గతంలో తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన విధంగా వారి కుటుంబాలను సిఎం కెసిఆర్ ఆదుకోనున్నారు. మొత్తం మీద జాతీయ రాజకీయాలలో తన ఎంట్రీ గ్రాండ్ గా ఉండేందుకు కేసీఆర్ ఒక ప్రణాళిక మేరకు ముందుకు నడుస్తున్నారని పరిశీలకులు అంటున్నారు. గతంలో బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ ప్రతిపాదనతో హస్తిన వెళ్లినప్పుడు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కేసీఆర్ తో భేటీకి కూడా సుముఖత చూపలేదు. అయితే ఇప్పుడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేక ఆందోళనలో అసువులు బాసిన రైతు కుటుంబాల పరామర్శ కార్యక్రమంలో కేజ్రీవాల్ కేసీఆర్ తో కలిసి పాల్గొనడం విశేషమని అంటున్నారు.

తన జాతీయ అజెండా కు జాతీయ స్థాయిలో మద్దతు కూడగట్టడమే కాకుండా, కేంద్రం నిధులు నేరుగా పంచాయతీలకే అంటూ రాష్ట్రాల హక్కులను కాలరాస్తున్న కేంద్రం విధానాలకు వ్యతిరేకంగా కూడా జాతీయ స్థాయిలో మద్దతు కూడగట్టే లక్ష్యంతోనే కేసీఆర్ నేషనల్ టూర్ తలపెట్టారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.