గజ్వేల్ లోని కొత్త ఇంట్లో సంక్రాంతి సంబరాలు చేసుకోనున్న కేసీఆర్!!

సంక్రాంతి పండుగను తన సొంత నియోజక వర్గం గజ్వేల్ పరిధిలోని ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలోని కొత్త ఇంట్లో జరుపుకోనున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. కొత్తగా చేపట్టిన ఇంటి నిర్మాణాన్ని ఎట్టి పరిస్థితుల్లో అప్పటికి పూర్తి చేయాలని సంబంధిత పనులు చేపట్టిన నిర్మాణ సంస్థను ఆదేశించినట్టు తెలుస్తోంది. సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవల్లి ఫామ్ హౌజ్ లో పదేళ్ల క్రిందట కొన్న భూముల్లో అప్పట్లోనే జి ప్లస్ టూ ఇంటిని నిర్మించుకున్న విషయం తెలిసిందే. దానికంటే అధునాతన సౌకర్యాలతో ఇప్పుడు నైరుతిమూలలో కొత్త ఇంటిని నిర్మిస్తున్నారు. పాత ఇంటికి లిఫ్టు లేకపోవడంతో కొత్త ఇంటికి దానిని ఏర్పాటు చేస్తున్నారు.  

2019, డిసెంబర్ 13 వ తేదీ నుంచి గురుమూఢమి ప్రారంభం అయింది. దాంతో రాబోయే కొద్ది రోజుల వరకు మంచి ముహూర్తాలు లేవని ఉద్దేశంతో గురుమూఢమికి ముందే గత నెలలోనే సీఎం కేసీఆర్ శాస్త్రోక్తంగా వాస్తు పూజలు నిర్వహించి లాంఛనంగా గృహ ప్రవేశం చేశారు. ఇంటి నిర్మాణం పూర్తి కాలేదని ముఖ్యమైన పనులు కొన్ని మిగిలిపోయాయని అప్పట్లోనే కథనాలొచ్చాయి. ఇంటి నిర్మాణం త్వరగా పూర్తి కావాలనే ఉద్దేశంతో అప్పటి నుంచి సీఎం కేసీఆర్ తరచూ ఎర్రవెల్లి వెళ్లి నిర్మాణ పనులను పర్యవేక్షిస్తూ వస్తున్నారు. జనవరి 10వ తేదీతో గురుమూఢమి వెళ్లిపోతుంది. ఆ తర్వాత అన్నీ మంచి రోజులే.. దాంతో కొత్త ఇంటికి సంబంధించిన అన్ని పనులు ఈ నెల 11 వ తేదీ లోగా పూర్తి కావాల్సిందేనని తాను సంక్రాంతి పండుగను అక్కడే జరుపుకుంటానని నిర్మాణ సంస్థకు సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. రాత్రి పగలు అనే తేడా లేకుండా 200 మందికి పైగా కార్మికులు ఎర్రవెళ్లిలోనే ఆయన కొత్త ఇంటి నిర్మాణానికి తుది మెరుగులు దిద్దే పనిలో నిమగ్నమైనట్లు సమాచారం.