ఆ కుర్చీలో కూర్చునేది ఎవరో?

 

పదవి ఇస్తామంటే ఏ రాజకీయ నాయకుడు మాత్రం కాదనుకుంటాడు. కానీ ఓ పదవిని మాత్రం టీఆర్ఎస్ నేతలు వద్దంటే వద్దు అంటున్నారు. ఓ సెంటిమెంట్ వల్ల నేతలు ఆ పదవి వద్దు అంటున్నారంటే అతిశయోక్తి కాదు. అదే స్పీకర్ పదవి. స్పీకర్ పదవి అనేది ఎమ్మెల్యేలకు పెద్ద ప్రమోషన్.. కాని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాత్రం స్పీకర్ పదవి మాకొద్దు బాబోయ్ అంటున్నారు. స్పీకర్ సీట్లో కూర్చున్న వాళ్ళు ఆ తరవాతి ఎన్నికల్లో ఓడిపోతారనే సెంటిమెంటే దీనికి కారణం. మరోవైపు రేపటి నుంచి నాలుగు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ శాసనసభ ప్రొటెం స్పీకర్‌గా మజ్లిస్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్‌ ఈరోజు సాయంత్రం 5 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నారు. రాజ్‌భవన్‌లో ఆయనచే గవర్నర్ నరసింహన్ ప్రమాణం చేయించనున్నారు.
 
అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యేలు రేపు ప్రమాణస్వీకారం చేయనున్నారు. 18న స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌ల ఎన్నిక జరుగనుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర రెండో శాసనసభాపతి ఎవరనే ఉత్కంఠకు నేడు తెరపడనుంది. స్పీకర్ అభ్యర్థి ఎంపిక కోసం వివిధ కోణాల్లో విశ్లేషించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇవాళ అభ్యర్థిని ఖరారు చేయనున్నారు. సీనియారిటీ, సభ నిర్వహణ సామర్థ్యం, సామాజిక వర్గాల కోణాల్లో కసరత్తు జరిగింది. దాదాపు అరడజను మంది పేర్లు పరిశీలనకు వచ్చాయి.  పోచారం శ్రీనివాసరెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, పద్మాదేవేందర్‌రెడ్డి, ఈటల రాజేందర్‌లలో ఒకరికి సభాపతి పీఠం దక్కే అవకాశం కనిపిస్తోంది.  కేసీఆర్‌ స్వయంగా వీరితో మాట్లాడారు. ఈ రోజు స్పీకర్ అభ్యర్థిని ప్రకటించే అవకాశముంది.