కేసీఆర్ 'మూడు'.. మళ్లీ మొదటికే..!
Published on: Sat Feb 26, 2022 2:03PM
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్ళీ ఢిల్లీ వెళుతున్నారు. ఎందుకు, ఏమిటీ అనేది అందరికీ తెలిసిన విషయమే. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి వ్యతిరేకంగా జాతీయస్థాయిలో ప్రాంతీయ పార్టీల కూటమి ఏర్పాటు చేసేందుకు, శత విధాల ప్రయత్నిస్తున్న ఆయన అదే పని మీద, రేపో మాపో ఢిల్లీ వెళతారని సీఎంవో వర్గాల సమాచారంగా తెలుస్తోంది. అయితే, ఢిల్లీలో ఆయన ఎవరిని కలుస్తారు, ఆయన్ని ఎవరు కలుస్తారు, అనే విషయంలో ఇంతవరకు అయితే స్పష్టత లేదు. ఒకటి రెండు రోజుల్లో షెడ్యూల్ వెల్లడిస్తామని సీఎంవో వర్గాల సమాచారంగా ప్రచారం జరుగుతోంది.
అదలా ఉంటే జాతేయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటుకు సంబంధించి, ఇతర ప్రాంతీయ పార్టీల నుంచి, కేసీఆర్ ఆశించిన స్థాయిలో స్పందన రావడం లేదని, బీజేపీ వ్యతిరేక కూటమికి ఓకేఅన్నా, కాంగ్రెస్ లేని ఫ్రంట్ అంటేనే కాదంటున్నారు. అందుకే. ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనకు సంబదించి వెనకా ముందు అడుతున్నారని పార్టీ వర్గాల్లో వినవస్తోంది.ఇప్పటి వరకు ముఖ్యమంత్రి థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు విషయంగా చేసిన యాత్రలు, జరిపిన చర్చలు ఏవీ సక్సెస్ కాలేదు. ముందుగు పడలేదు.అంతే కాకుండా, ఇటీవల ముంబై పర్యటన సందర్భంగా, శివసేన నాయకుడు సంజయ్ రౌత్, నోటితో పొగడి నొసటితో వెక్కిరించినట్లుగా, కేసీఆర్ గొప్పోడు అంటూనే, కాంగ్రెస్ చేయి వదిలేది లేదని స్పష్టం చేశారు. మరో వంక ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అయితే వస్తే ఆయన వచ్చి కాంగ్రెస్ కూటమిలో చేరాలే కానీ, ఎన్సీపీ, కాంగ్రెస్ లేని కూటమిలో చేరదని తెగేసి చెప్పారు.
మరోవంక కేసీఆర్ ఎత్తుగడలను పసిగట్టిన ఉత్తరాది ప్రాంతీయ పార్టీలు కూడా, కేసీఆర్’తో చేతులు కలిపేందుకు సిద్దంగా లేవని తెలుస్తోంది. ఈ నేపధ్యంలోనే, కేసీఆర్ ఢిల్లీ వెళ్ళినా పెద్దగా ప్రయోజనం ఉండదని, అందుకే ఏదో వంకన ఢిల్లీ యాత్రను, అసెంబ్లీ సమావేశాలు, పార్లమెంట్ సమావేశాల వంకన సాధ్యమైనంత వరకు వాయిదా వేసే ఆలోచనలోనే కేసీఆర్ ఉన్నట్లు, తెలుస్తుంది. అందుకే, గురువారమే ఆనుకున్న ముఖ్యమంత్రి ఢిల్లీ యాత్ర రద్దయినట్లు తెలుస్తోంది. అదలా ఉంటే, ఒక వేళ ఈలోగా ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళినా, ఒకరి రెండు రోజులు గడిపి,మార్చి3న మొదలయ్యే అసెంబ్లీ సమావేశాల వంకన వెనక్కి వస్తారని, అంటున్నారు. ఇక ఆపైన అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగానే పార్లమెంట్ సమావేశాలు మొదలవుతాయి. అలాగే. మార్చి 10 ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చేస్తాయి.. ఫలితాలను బట్టి పొలిటికల్ నెరటీవ్’ ఎలా మారుతుందో .. ఏమవుతుందో ఎవరికీ తెలియదు. ఏతా వాతా తెలుస్తున్నదేమంటే, కేసీఆర్’ ఢిల్లీ యాత్ర ఎలాఉన్నా, మూడో కూటమి ముడిపడేది కాదని మాత్రం స్పష్టమవుతోందని అంటున్నారు.


