కేసీఆర్ టార్గెట్ ఆ ముగ్గురేనా?

 

కేసీఆర్ ఆలోచనలు, వ్యూహాలు అంత త్వరగా అర్థంకావు.. అదేవిధంగా ఆయన కొన్ని సందర్భాల్లో తీసుకొనే దూకుడు నిర్ణయాలు ప్రత్యర్థి పార్టీలకే కాదు సొంత పార్టీ నేతలని కూడా షాక్ కి గురి చేస్తాయి.. అలాంటిదే ముందస్తు, అసెంబ్లీ రద్దు.. ముందస్తు ఉంటుందా లేదా అని అందరూ తలలు పట్టుకుంటుండగా అసెంబ్లీ రద్దు చేసారు.. అంతేనా తొలి విడతగా ఏకంగా 105 మంది అభ్యర్థులను ప్రకటించారు.. ఓ వైపు మిగతా పార్టీలు పొత్తులు, సీట్ల పంపకం, అభ్యర్థుల ఎంపిక అంటూ తర్జన భర్జన పడుతుంటే.. కేసీఆర్ మాత్రం మెజారిటీ స్థానాలు ఎలా గెలవాలి? ప్రధాన ప్రత్యర్థులను ఎలా ఓడించాలి? అంటూ వ్యూహాలు రచించే పనిలో పడిపోయారు.. కేసీఆర్ ముఖ్యంగా ముగ్గురు కాంగ్రెస్ నేతలని టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది.. ఆ ముగ్గురు ఎవరో కాదు జానారెడ్డి, డికె అరుణ, రేవంత్ రెడ్డి.

 


నల్గొండ జిల్లా కాంగ్రెస్‌కు కంచుకోట.. కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలతోపాటు జానారెడ్డిలాంటి ముఖ్యనేతలు నల్గొండ నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు.. దీంతో కేసీఆర్ నల్గొండలో కాంగ్రెస్ కంచుకోటను కదిలించాలని చూస్తున్నారట.. ముఖ్యంగా జానారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నాగార్జున సాగర్ నియోజకవర్గంలో తెరాస జెండా ఎగరేయాలని ప్రయత్నిస్తున్నారట.. మరి కేసీఆర్ వ్యూహాలు ఫలించి జానారెడ్డికి ఝలక్ తగులుతుందో లేదో చూడాలి.. నల్గొండతో పాటు మహబూబ్‌నగర్ మీద కూడా కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది.. మహబూబ్‌నగర్ లో ఇద్దరు ఫైర్ బ్రాండ్లు ఉన్నారు.. ఒకరు డి.కె అరుణ, మరొకరు రేవంత్ రెడ్డి.. అరుణ, రేవంత్ ఇద్దరూ మొదటి నుండి కేసీఆర్ మీద తీవ్ర విమర్శలు చేస్తూ కేసీఆర్ ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.. అందుకే కేసీఆర్ వీరిద్దరిని ఎలాగైనా ఓడించాలని కంకణం కట్టుకున్నట్టు తెలుస్తోంది.. అరుణ గద్వాల్ నుండి ప్రాతినిధ్యం వహిస్తుండగా, రేవంత్ కొడంగల్ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.. వీరిద్దరి దూకుడికి కళ్లెం వేయాలని కేసీఆర్ భావిస్తున్నారు.. మరి కేసీఆర్ టార్గెట్ గా పెట్టుకున్న ఈ ముగ్గురు నేతలు కేసీఆర్ వ్యూహాలు అధిగమించి విజయాన్ని అందుకుంటారో లేదో చూడాలి.