బీజేపీని పట్టించుకోకండన్న కేసీఆర్...టార్గెట్ అవుతారా ?

 

తెలంగాణలో పాగా వేసేందుకు బీజేపీ గట్టి ప్రయత్నాలే చేస్తోంది. అందుకు అనుగుణంగా ఏకంగా ఆ పార్టీ నెంబర్ 2 రంగంలోకి దిగి మరీ ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఇతర పార్టీ నేతలను చేర్చుకుని బలపడాలని చూస్తుంది. అందులో భాగంగానే ఆ పార్టీ ఆ నేత బీజేపీలో చేరుతున్నారు అని ఈ నేత చేరుతున్నారని ప్రచారం చేయడం మొదలు పెట్టారు. అయితే ఆ పార్టీ ప్రధాన టార్గెట్ టీఆర్ఎస్, ఎటూ కాంగ్రెస్ బలహీన పడింది కాబట్టి అ పార్టీ నేతలను కాకుండా టీఆర్ఎస్ నేతల మీద ఫోకస్ చేసింది. 

ఈ నేపధ్యంలో కేసీఆర్ చేశారని చెబుతున్న కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. బీజేపీ చేసే పాలిటిక్స్ కి భయపడవద్దని, బీజేపీ మాయ మాటలకి ఎవరు లొంగవద్దని కేసీఆర్ శ్రేనులకి సందేశం చేరవేశారట. ఆరు నెలలు అరిచి, అరిచి అలిసిపోతారని అలాంటోళ్ళను చూసి భయపడకండని అన్నారట. ఎన్నికలకి ఇంకా నాలుగున్నరేళ్ల సమయం ఉందని ఇప్పుడెన్ని రాజాకీయాలు చేసినా ఉపయోగం లేదని చెప్పారట. 

నాలుగు సీట్లు వస్తే వాటిని చూసి ఎగిరెగిరి పడుతున్నారని, వాళ్ళని పట్టించుకోవలసిన అవసరమే లేదని చెప్పుకొచ్చారట. మరి ఆయన మాటలను సీరియస్ గా తీసుకున్నారో ఏమో కానీ కరీంనగర్ జిల్లా మీద ప‌ట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్న బండి సంజ‌య్ కు  ప్రాధాన్య‌త ద‌క్క‌కుండా చేయాల‌ని ప్ర‌య‌త్నిస్తోంది. నిజానికి ఈ స్థానం తమదే అనే ఊపులో ఉండేవారు తెరాస నాయకులు. 

కానీ అది గెలవక పోయే సరికి, ఇప్పుడు బీజేపీ ఎంపీ గెలిచినా ఆయనకు ప్రాధాన్యత లేకుండా చేస్తున్నారట. నిజానికి ఆయ‌న ఎంపీ కాబ‌ట్టి, స్థానికంగా జ‌రిగే అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కూ, ప్రారంభోత్స‌వాల‌కూ ప్రోటోకాల్ ప్ర‌కారం ఆయ‌న్ని ఆహ్వానించాల్సి ఉంటుంది. కానీ అదేమీ చేయని సర్కార్ ఆయన్ను అవమానించేలా పలు కార్యక్రమాలలో వ్యవహరించింది. ఈ విష‌యాన్ని చాలా సీరియ‌స్ గా తీసుకున్న ఆయ‌న ఇప్పుటికే ఫిర్యాదు చేశారని అంటున్నారు. ఇది ఒక ఉదాహరణ మాత్రమే, ఇలాంటి పనికిరాని కొర్రీలు పెట్టుకుని కేసీఆర్ అనవసరంగా బీజేపీతో తలనొప్పులు తెచ్చుకుంటున్నారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.