TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అవునంటే కాదనిలే.. కేసీఆర్ మాటలకు అర్ధాలే వేరులే

Published on: Mon Apr 18, 2022 11:12AM

ఔనంటే కాదనిలే...కాదంటే ఔననిలే అంటూ అలనాటి మిస్సమ్మ చిత్రంలో ఓ పాట ఉంది. అది కేవలం సినిమా పాటే...కానీ ఆ పాటలోని తొలి  పంక్తులు మాత్రం తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుగారికి అతికినట్లు సరిపోతాయి. ఆయన ఏ విషయం చెప్పినా...ఆచరణలో 
అందుకు పూర్తి విరుద్ధంగా జరుగుతోంది. దళితులకు మూడెకరాల నుంచి...ఇంటికో ఉద్యోగం, ఉద్యోగ ఖాళీల భర్తి, నిరుద్యోగ భృతి ఇలా ఏ విషయం తీసుకున్నా ఆయన మాటలకూ చేతలకూ పొంతన కనిపించదు. ఇప్పుడు తాజాగా యాద్రాద్రిలో దుకాణాల విషయంలోనూ అదే జరిగింది.    రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి, అపర తిరుమల రీతిలో యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం చేపట్టి పూర్తి చేశారు. కొత్త ఆలయం పూర్తై...భక్తులు ఆలయ సందర్శనకు రావడం ప్రారంభించిన తరువాత ఒక్కటొక్కటిగా జరుగుతున్న పరిణామాలు, కొండపై భక్తులకు అవసరమైన సౌకర్యాలు లేకపోవడంతో ప్రజాగ్రహం వ్యక్తమౌతున్నది. ముఖ్యంగా ఆలయ 
పునర్నిర్మాణ పనుల తనిఖీకి కేసీఆర్ వచ్చిన సమయాలలో కేసీఆర్ చేసిన ప్రకటనలు, ఇచ్చిన హామీలకు పూర్తి విరుద్ధంగా ఇప్పుడు కొండపై వ్యవహారాలు సాగుతున్నాయని స్థానికుల నుంచీ, భక్తుల నుంచీ విమర్శలు వినవస్తున్నాయి. ముఖ్యంగా యాదగిరి గుట్టపై ఒక్క దుకాణం కూడా ఉండదంటూ గతంలో కేసీఆర్ చేసిన ప్రకటనను విరుద్ధంగా కొండపై దుకాణాలు వెలిశాయి.

వాటి కోసం అధికారులు అధికారికంగా టెండర్లను సైతం ఆహ్వానించారు. దీనిపై నిరుద్యోగుల జేఏసీ ప్రతినిథులు వినూత్నంగా తన నిరసననూ, వ్యతిరేకతనూ అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్రం రూపంలో సమర్పించారు. అంతే కాకుండా సర్కార్ మొండి వైఖరికి నిరసనగా ఇదే వినతి పత్రాన్ని దున్నపోతులకు సమర్పించారు. వాగ్దానల విషయంలో కేసీఆర్ కు పెద్దగా పట్టింపు ఉండదన్న నానుడి ఉంది. వాగ్దాన భంగాలపై ప్రజల ఆగ్రహం వ్యక్తమయ్యేలోగా మరో కొత్త వాగ్దానంతో వారి దృష్టి మళ్లించే నైపుణ్యం కేసీఆర్ ప్రత్యేకత అని ఆయన రాజకీయ ప్రత్యర్థులు వ్యంగ్య బాణాలు సంధిస్తుంటారు. ఇప్పుడు యాదగిరి గుట్టపై దుకాణాల విషయంలో అది మరో సారి రుజువైంది. గత ఏడాది అక్టోబర్ 19న కేసీఆర్ యాదగిరి గుట్ట సందర్శించిన సందర్భంలో ఆయన కొండపై దుకాణాలు ఉండవని విస్పష్టంగా ప్రకటన చేశారు.

కొండపై దుకాణాలు కోల్పోయిన వారికి నష్టపరిహారం ఇస్తామని, దుకాణాలపైనే ఆధారపడేవారికి టెంపుల్ సిటీలో దుకాణాలు కేటాయిస్తామనీ వాగ్దానం చేశారు. అయితే ఇప్పుడు అధికారులు ఏకంగా బహిరంగ టెండర్లు పిలిచి మరీ దుకాణాలు కేటాయిస్తున్నారు.   యాదగిరిగుట్టపైన, కొండ కింద, పుష్కరిణి ప్రాంతంలోదుకాణాలు లేదా వ్యాపార కేంద్రాలను నిర్వహించుకునేందుకు దేవస్థానం అధికారులు టెండర్లుబహిరంగంగా పిలిచారు.  టెండర్ల కోసం పత్రికా ముఖంగా ఆహ్వానం పలికిన దేవస్థానం అధికారులు. టెండర్లు పిలవకముందే యాదగిరిగుట్ట కొండపైన దుకాణాలు తెరిపించేశారు. అంటే గుట్టపై ఒక్కదుకాణం కూడా ఉండదన్న కేసీఆర్  మాటలకు అర్ధం ఇదన్న మాట.