మోదీ, చంద్రబాబుల కంటే ముందే కేసీఆర్ రెడీ అయిపోతున్నారా?

గత ఎన్నికలు 2014లో జరిగాయి. మళ్లీ ఎన్నికలు ఎప్పుడు? 2019లో! పార్లమెంట్, తెలంగాణ, ఏపీ అసెంబ్లీలకి ఒకేసారి ఎన్నికలు రావటం గత కొన్ని దఫాలుగా జరుగుతూ వస్తోంది. అయితే, ఈసారి మాత్రం పరిస్థితి సస్పెన్స్ థ్రిల్లర్ గా మారిపోయింది. ఎలక్షన్స్ రేపో, మాపో అన్నట్టు వుంటోంది కేసీఆర్, మోదీల వ్యవహార శైలి! చంద్రబాబు ఎట్టి పరిస్థితుల్లోనూ 2019 ఎండా కాలంలోనే ఎన్నికలు అంటుంటే… ప్రధాని, తెలంగాణ సీఎంలు మాత్రం ముందస్తుకు సంకేతాలు ఇస్తూ మీడియాలో కలకలం రేపుతున్నారు. కాకపోతే, ఇంత వరకూ అదికారిక స్టేట్మెంట్లు మాత్రం రాలేదు!

 

 

దేశం మొత్తం మోదీ జరపాలని భావిస్తోన్న జమిలి ఎన్నికలు, పార్లమెంట్ ముందస్తు ఎన్నికలు పక్కన పెడితే తెలంగాణ అసెంబ్లీకి మాత్రం ముందస్తు కంటే ముందస్తు ఎన్నికలు తేవాలని కేసీఆర్ ఆలోచిస్తున్నారా? అవుననే అంటున్నారు గులాబీ నేతలు! తాజాగా ప్రగతి భవన్ నుంచి వెళ్లిన ఫోన్ల సంగతి పెద్ద చర్చగా మారింది. ప్రస్తుతం టీఆర్ఎస్ కి దాదాపు తొంభై మంది ఎమ్మెల్యేలు వున్నారు. కొందరు కార్ గుర్తుపై గెలిచిన వారు, మరి కొందరు జంప్ జిలానీలు. వీరంతా వచ్చే ఎన్నికల్లో సహజంగానే టీఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్నారు. కానీ, అందులో కొంత మందికి మొండి చేయి తప్పదని వార్త వస్తోంది. అదే కొంత మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల వెన్నులో వణకు పుట్టిస్తోంది.

 

టికెట్ వస్తుందా లేదా అన్న అనుమానంలో వున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకి కేసీఆర్ తాజాగా ఫోన్లు చేయటం మరింత టెన్షన్ పుట్టిస్తోందట. కొందరికి స్వయంగా గులాబీ బాస్ ఫోన్ చేసి ఎన్నికలకు సిద్ధం అవ్వండని చెప్పారట. ముందుగా వచ్చినా, టైముకే వచ్చినా, జమిలి ఎన్నికలైనా… అన్నిటికీ రెడీగా వుండాలని సీఎం చెప్పారట. అభివృద్ధి కార్యక్రమాలు చకచకా పూర్తి చేసి, ఎన్నికలకి నిధులు సమకూర్చుకుని పోరు సన్నద్ధం కావాలిన ఫోన్ కాల్స్ సారాంశమట!

 

 

కేసీఆర్ ఫోన్ చేసి మళ్లీ ఎన్నికలకి సిద్ధం అవ్వమన్న వారు హ్యాపీనే! ఫోన్లు రాని వారి పరిస్థితే అయోమయంగా మారింది. తమకు బాస్ ఫోన్ చేయలేదంటే మళ్లీ టికెట్ ఇచ్చే ఆలోచన లేదేమోనని వారు భయపడుతున్నారట. ఒకవేళ అదే జరిగితే ఏం చేయాలన్నది ప్రస్తుత అధికార పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేల మనోవేదన! సహజంగానే వారు రెబెల్స్ గా బరిలోకి దిగే అవకాశాలుంటాయి. ఒకరిద్దరూ కేసీఆర్ నచ్చజెబితే ఊరుకుంటారుగానీ… సాధారణంగా ఇతర పార్టీల్లోకి జంపు చేసి అయినా పోటీలో వుంటారు. ఎందుకంటే, సాధారణ ఎన్నికలు అయిదేళ్ల దాకా మళ్లీ రావు. అందుకే, పార్టీలు, కండువాలు మార్చేసైనా సమరానికి సై అంటారు! మొత్తం మీద కేసీఆర్ పార్లమెంట్ కంటే కూడా ముందుగానే ఎన్నికలకు తెర తీస్తే పార్టీ ఫిరాయింపుల పర్వం కూడా మొదలవ్వచ్చు! అసతంతృప్తులు, రెబెల్స్ ని ఎంత మందిని తెలంగాణ ప్రతిపక్షం … కాంగ్రెస్ క్యాష్ చేసుకుంటోందో చూడాలి. అలాగే, తెలంగాణలో పర్యటనకు సిద్ధమైన అమిత్ షా కూడా ఎంత మందికి కాషాయ కండువాలు కప్పుతారో? ఏది ఏమైనా… తెలంగాణలో ఆషాధ మహంకాళీ జాతర పూర్తవ్వగానే ఎన్నికల జాతర మొదలయ్యేలా కనిపిస్తోంది!