చినజీయర్‌తో గ్యాప్.. కేసీఆర్ అసహనం.. అది నిజమే!?
Published on: Tue Mar 22, 2022 3:35PM
కేసీఆర్‌కు చినజీయర్ స్వామికి మధ్య గ్యాప్ బాగా పెరిగిపోయిందని అంతా అంటున్నారు. సమతామూర్తి విగ్రహ ఆవిష్కరణ నుంచే వారి మధ్య విభేదాలు పెరిగాయి. శిలఫలకంపై తన పేరు లేనందుకో.. మోదీని, అమిత్‌షాను తెగ పొగిడేసినందుకో.. కారణం ఏంటో తెలీదు కానీ చిన్నజీయర్ స్వామిని కేసీఆర్ పూర్తిగా పక్కన పెట్టేశారు. ఒకప్పుడు కలిసినప్పుడల్లా స్వాములోరి కాళ్లపై పడే కేసీఆరే.. ఇప్పుడు ఆయన కాళ్లను పట్టుకొని లాగేసే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. 20 ఏళ్ల క్రితం సమ్మక్క-సారలమ్మలపై చినజీయర్ చేసిన వ్యాఖ్యలు లేటెస్ట్‌గా వైరల్ అవడానికి కేసీఆర్ టీమే కారణం అనే అనుమానం. ఇక, యాదాద్రి పునర్‌నిర్మాణంలో అంతా తానై వ్యవహరించిన జీయర్ స్వామి లేకుండానే ఆలయం ప్రారంభోత్సవ క్రతువు కొనసాగుతుండటంతో.. స్వామీజీని కేసీఆర్ టార్గెట్ చేశారని ఇట్టే తెలిసిపోతోంది.
ఇదే విషయంపై చినజీయర్‌ను విలేకర్లు ప్రశ్నిస్తే.. తమకు ఎవరితోనూ గ్యాప్ లేదని.. మేం భిక్ష సాధువులమని.. పిలిస్తే వెళ్తాం.. లేదంటే చూసి ఆనందిస్తాం.. అంటూ చాలా సాత్వికంగా సమాధానం చెప్పారు. కేసీఆర్‌తో తనకేంటనే ధోరణిలో.. ఆయన్ను చాలా లైట్ తీసుకుంటున్నట్టు చినజీయర్ స్వామి వ్యాఖ్యలు ఉన్నాయి.
కట్ చేస్తే.. సేమ్ క్వశ్చన్ సీఎం కేసీఆర్‌ను కూడా అడిగారు మీడియా ప్రతినిధులు. ఆ ప్రశ్న వినగానే కేసీఆర్ మాత్రం అసహనం, ఆవేశానికి లోనయ్యారు. గ్యాపా? ఏం గ్యాప్? మీకెవరు చెప్పారు? మీరే అనుకుంటే సరిపోతుందా? మీరే ఏదేదో అనుకొని నన్ను అడిగితే ఎలా? అంటూ విసుక్కున్నారు. అంతేగానీ, గ్యాప్ ఉందని కానీ, లేదని కానీ.. చెప్పడానికి కూడా ఇష్ట పడలేదు. అంటే, చినజీయర్ స్వామి తనను కేర్ చేయకపోవడం.. బీజేపీ-మోదీకి దగ్గరయ్యారని కేసీఆర్ భావించడం.. అందుకే స్వామీజీని టార్గెట్ చేసి, పూర్తిగా పక్కన పెట్టేశారంటూ జరుగుతున్న ప్రచారం నిజమే అనిపించేలా ఉంది కేసీఆర్ రియాక్షన్. ముఖ్యమంత్రే స్వామిని సైడ్ చేసినా.. చినజీయర్ సైతం ఎక్కడా తగ్గేదేలే అంటూ ఢీ అంటే ఢీ అనేలానే మాట్లాడటం మరింత ఆసక్తికరం.


