చంద్రబాబుకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం: కేసీఆర్

 

తెలంగాణలో ప్రజకూటమి అంచనాలను తారుమారు చేస్తూ టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. ఈ సందర్భంగా తెలంగాణ భవన్‌లో విలేకరుల సమావేశంలో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ మాట్లాడారు. ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీకి లభించిన విజయం పూర్తిగా తెలంగాణ ప్రజల విజయమని అభివర్ణించారు. ప్రచారంలో కాళేశ్వర కావాలా? శనేశ్వరం కావాలా అని అడిగామని, ప్రజలు కాళేశ్వరమే కావాలని తీర్పునిచ్చారని అన్నారు. ముఖ్యంగా రైతులు, మహిళలు, పేదలు, వెనుకబడిన వర్గాలు, దళితులు, కులాలకు మతాలకు అతీతంగా సకల జనులు నిండుగా దీవించి అందించిన విజయమని అన్నారు. కార్యకర్తలెవరూ విజయంతో గర్వించాల్సిన అవసరం లేదని, అంతిమ తీర్పు ప్రజలే కాబట్టి కర్తవ్య నిష్ఠతో బాధ్యతను నిర్వహించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్ అభివృద్ధిలో ఒక బాట వేసిందని, ఇక ఆ బాటను చేరాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

కోటి ఎకరాలు పచ్చబడాలి అన్న తమ లక్ష్యాన్ని కచ్చితంగా చేరతామని అన్నారు. లక్ష ఎకరాలకు నీరందించడమే కర్తవ్యంగా ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. రైతుల కోసం కచ్చితంగా పనిచేస్తామని, వారికి ఏ బాధలు లేకుండా చేస్తామని ప్రకటించారు. గిరిజనులు, గిరిజనేతరులు పోడు భూముల కోసం పడుతున్న బాధలను తొందరలోనే పరిష్కారం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇందుకు తానే వ్యక్తిగతంగా చొరవ తీసుకుంటానని ప్రకటించారు. కుల వృత్తులు మరింత అభివృద్ధి పడేలా చేస్తామని హామీ ఇచ్చారు. నిరుద్యోగులకు, యువతకు ఉద్యోగాలు కల్పించి నిరుద్యోగతను అధిగమిస్తామని తెలిపారు. ఉద్యోగ ఖాళీలను అత్యంత వేగంగా భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వేతర రంగాల్లో కూడా విరివిగా దొరికేలా చూస్తామని అన్నారు.

విజయం ఎంత ఘనంగా ఉందో బాధ్యత కూడా అంతే బరువుగా ఉందని అన్నారు. ఇప్పటికే కంటి వెలుగు కార్యక్షేత్రంలో ఉందని, అలాగే ఇప్పుడు ఈఎన్‌టి, డెంటల్ పరీక్షలను చేసి ఆరోగ్య తెలంగాణను నిర్మిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలో ఉన్న అన్ని రకాల మైనారిటీలకు మరింత సంక్షేమాలను అందిస్తామని భరోసా ఇచ్చారు. వీరితో పాటు దళితులు, గిరిజనుల బాధలకు భరతవాక్యం పాడతామని, ఇందుకోసం ఏం చేయాలనే అంశంపై ఆలోచించి కచ్చితమైన లక్ష్యాలతో ముందుకు సాగుతామని అన్నారు. బీసీలతో పాటు రెడ్డి, బ్రాహ్మణ, వైశ్య వర్గాలకు కూడా గురుకులాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రజా సమస్యలే కేంద్ర బిందువుగా, పరిష్కారం ఇతివృత్తంగా, పేదరిక నిర్మూలనే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతామని కేసీఆర్ స్పష్టం చేశారు.

దేశ రాజకీయాల్లో కూడా పాత్ర పోషించాల్సిన బాధ్యత మనపై ఉంది అన్నారు. ప్రేక్షక పాత్ర పోషించం. చైతన్యం కల్గినది తెలంగాణ గడ్డ. తానేంటో నిరూపించుకున్న భూమి తెలంగాణ. 116 సభల్లో నేను పాల్గొన్నా. ప్రతి సమావేశంలో నేను ప్రజలకు విజ్ఞప్తి చేశాను. పార్టీలు, నాయకులు కాదు. ప్రజలే గెలవాలని అన్నాను అని గుర్తు చేశారు. ఈ రోజు ప్రజలే గెలిచారు. ఎవరు ఏమన్నా, ఎన్ని విమర్శలు చేసినా మేం పట్టించుకోలేదు అన్నారు. జాతీయ రాజకీయాల్లో ప్రధాన పాత్ర పోషిస్తాం. ఈ దేశానికి ఓ దిక్సూచి తెలంగాణ. జాతీయ రాజకీయాలకు ఓ కొత్త నిర్వచనం ఇస్తాం అన్నారు. 'దేశంలో పెద్ద గందరగోళం ఉంది. నూరు శాతం బీజేపీయేతర, కాంగ్రెసేతర పరిపాలన రావాలి. మాకు ఎవరూ బాస్‌లు లేరు. మేం ఎవరికీ ఏజెంట్లం కాం. ప్రజలకే ఏజెంట్లం. ప్రజలే మమ్మల్ని ఏజెంట్లుగా నియమించారు. వారి కోసమే మేం పనిచేస్తాం. మేమెవరికీ గులాంగిరీ చేయం. ప్రజల ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తూ.. జాతీయ రాజకీయాలను కచ్చితంగా ప్రభావితం చేస్తాం’ అని కేసీఆర్‌ స్పష్టం చేశారు.

అదే విధంగా ఈ సమావేశంలో కేసీఆర్, చంద్రబాబు మీద తనదైన శైలిలో సెటైర్లు వేశారు. చంద్రబాబు ఇక్కడకు వచ్చినప్పడు తాము అక్కడకు వెళ్లమా అని ప్రశ్నించారు. చంద్రబాబు తెలంగాణకు వచ్చి పనిచేశారని.. మరి తాము కూడా ఆంధ్రాకు వెళ్లి పనిచేయాలా వద్దా అని అన్నారు. బర్త్‌‌డే గిఫ్ట్ ఇచ్చినప్పుడు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వమా? అని అన్నారు. దేశ రాజకీయాల్లో పనిచేసే క్రమంలో ఏపీకి కూడా వెళ్లబోతున్నానన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి తనకు లక్ష ఫోన్ కాల్స్ వచ్చాయని.. ఏపీ రాజకీయాల్లో తాను కూడా కలగజేసుకోవాల్సిందిగా అక్కడి ప్రజలు కోరుతున్నారన్నారు. చంద్రబాబు గురించి విజయవాడ వెళ్లి మొత్తం చెబుతానన్నారు. తమ గిఫ్ట్ ప్రభావం ఎంతుంటుందో త్వరలో అందరూ చూస్తారన్నారు.