తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి అంగుళానికి నీళ్లు.. కేసీఆర్ శుభవార్త

 

ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన మంగళవారం తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరిగింది. దాదాపు ఆరు గంటలపాటు సుదీర్ఘంగా జరిగిన భేటీలో పలు అంశాలపై చర్చించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసీఆర్‌ ఆ వివరాలను వెల్లడించారు. ఏపీ ప్రభుత్వం ముందుకొచ్చి హైదరాబాద్‌లో ఏపీకి కేటాయించిన భవనాలను తెలంగాణకు అప్పగించాలని నిర్ణయించిందని గుర్తు చేశారు. మహారాష్ట్రతో స్నేహపూర్వక సంబంధాల ఫలితంగానే ప్రపంచమే అబ్బురపడే విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ దశకు వచ్చిందని తెలిపారు. ‘‘కాళేశ్వరం ప్రపంచంలోనే అతిపెద్ద బహుళదశ సాగునీటి ప్రాజెక్టు. దీని ద్వారా 45 లక్షల ఎకరాలకు సాగునీరు.. రాష్ట్రంలోని 80 శాతం ప్రజలకు తాగునీరు అందుతుంది. పారిశ్రామిక అవసరాలకూ నీరందుతుంది. రాష్ట్రం సొంత నిధులతో పాటు బ్యాంకుల సహకారంతో ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నాం. తెలంగాణలో ప్రాజెక్టుల కోసం అహోరాత్రులు శ్రమించా. పాలమూరు ఎత్తిపోతల పథకాన్నీ పరుగులు పెట్టిస్తాం’’అన్నారు.

ఏపీ నూతన సీఎం యువకుడని, మెట్ట ప్రాంతాలు సహా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు నీళ్లు అందించాలనే పట్టుదలతో ఉన్నారని తెలిపారు. ‘‘ఇటీవల విజయవాడ వెళ్లినప్పుడు ఇదే అంశంపై నేను ఏపీ సీఎం, ఆర్థిక శాఖ అధికారులతో సమావేశమయ్యా. ఈనెల 27, 28 తేదీల్లో ఆ రాష్ట్ర ఇరిగేషన్‌ మంత్రి సహా ఏపీ ప్రభుత్వ ప్రతినిధులు హైదరాబాద్‌కు వస్తున్నారు. హైదరాబాద్‌లో ఒకరోజు సమావేశం జరగనుంది. తదుపరి విజయవాడలో జరిగే సమావేశానికి మేమంతా అక్కడికి వెళతాం. ఇరు రాష్ట్రాల ప్రతినిధులం క్షేత్రస్థాయి పర్యటనకు వెళతాం. సంయుక్తంగా నీళ్లను వాడుకోవడానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తాం’’ అని వెల్లడించారు.
 
తెలుగు ప్రజానీకానికి గోదావరిలో 1,480 టీఎంసీలు; కృష్ణాలో 811 టీఎంసీల కేటాయింపులు ఉన్నాయని, ఇవికాక, ఏటా దాదాపు 3000 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని తెలిపారు. ‘‘రెండు రాష్ట్రాలూ కలిపి సుమారు 5,000 టీఎంసీలు వాడుకోవడానికి అవకాశం ఉంది. అపార్థాలు, కయ్యం పెట్టుకోవడం వల్ల గతంలో తెలుగు ప్రజలు నష్టపోయారు. ఇప్పుడు ఉభయుల కృషితో ఈ నీటిని రెండు రాష్ట్రాల్లోని ప్రతి అంగుళానికీ తీసుకెళ్లాలని నిర్ణయించాం’’ అని కేసీఆర్‌ చెప్పారు. కేంద్రం పరిష్కరించే దుర్గతి ఉండకూడదని ఇరువురు ముఖ్యమంత్రులం ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.

కాగా ‘‘ప్రభుత్వ ఉద్యోగులు పీఆర్సీ కోసం ఎదురు చూస్తున్నారు. రాబోయే కొద్ది రోజుల్లో నిర్ణయం తీసుకుంటాం. ఉద్యోగ సంఘాలతో చర్చిస్తాం. పీఆర్సీ పెంచి, రిటైర్మెంట్‌ వయసు పెంచి.. ఒకే ప్యాకేజీ కింద నిర్ణయిస్తాం’’ అని ప్రకటించారు. నూతన పంచాయతీరాజ్‌ చట్టాన్ని చాలా పటిష్ఠంగా అమలు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు.