TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మోడీ మీద కేసీఆర్ పొగడ్తల వర్షం

Published on: Wed Dec 10, 2014 11:12AM

 

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ది చాలా పెద్ద మనసు.. ఎవర్నయినా తిట్టే విషయంలో ఎంత ధారాళంగా తిడతారో, పొగిడే విషయంలో కూడా అంత బాగా పొగుడుతారు. గతంలో తిట్టిన వారిని పొగిడే విషయంలో కూడా ఆయన ఎంతమాత్రం వెనుకడుగు వేయరని రాజకీయ పరిశీకులు అంటూ వుంటారు. నిన్న మొన్నటి వరకూ మోడీని మోడీ,.. గీడీ.. సన్నాసి అని తిట్టిన కేసీఆర్ ఇప్పుడు మోడీ మీద పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. మొన్నామధ్య ఢిల్లీలో ముఖ్యమంత్రుల సమావేశం జరిగినప్పుడు అందులో పాల్గొన్న కేసీఆర్ మోడీతో ఎంత సన్నిహితంగా మెలిగారో అందరం చూసి తరించాం. ఈ సందర్భంగా దిగిన గ్రూప్ ఫొటోలో కూడా మోడీ, కేసీఆర్ అతుక్కున్నట్టుగా నిలబడ్డారు. తెలియనివాళ్ళెవరైనా చూశారంటే, కేసీఆర్ - నరేంద్ర మోడీ ఇద్దరూ అతుక్కునిగానీ పుట్టారేమోనని అనుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకోగానీ కేసీఆర్ ఈ మధ్య నరేంద్ర మోడీ మీద అభిమానాన్ని ప్రదర్శిస్తున్నారు. ఆయన్ని పల్లెత్తు మాట కూడా అనడం లేదు. రాష్ట్రంలో బీజేపీ వారితో కూడా చాలా మర్యాదగా వ్యవహరిస్తున్నారు. సర్లెండి.. కేసీఆర్ ఏమి చేసినా, ఎలా ప్రవర్తించినా అది బంగారు తెలంగాణ కోసమే అనుకోండీ.. అది వేరే సంగతి.

 

తాజాగా కేసీఆర్ గతంలో తిట్టిన నోటితోనే నరేంద్ర మోడీ మీద పొగడ్తల వర్షం కురిపించారు. ఈ శుభ సందర్భం మంగళవారం నాడు జరిగిన అఖిలపక్ష సమావేశం‌లో వచ్చింది. ఈ సమావేశం అలా ప్రారంభమైందో లేదో కేసీఆర్ ఇలా మోడీని పొగడ్డం మొదలుపెట్టారట. ఇటీవల తాను ప్రణాళికా సంఘానికి సంబంధించిన సమావేశానికి ఢిల్లీ వెళ్ళినప్పుడు మోడీ పనితీరును చాలా బాగా గమనించానని, ఆయన అద్భుతంగా పనిచేస్తున్నారని, మోడీ తన పనితీరుతో ప్రపంచ ఖ్యాతిని పొందుతున్నారని పొగిడారట. అక్కడితో ఆగారా.. లేదు.. రాష్ట్రంలో ప్రభుత్వం చేపడుతున్న అనేక పథకాలకు మోడీ సంపూర్ణ సహకారం అందిస్తున్నారని, మొత్తం 66 పథకాలకు నిధులు ఇచ్చే విషయంలో మోడీ ఎంతో చొరవ చూపి తెలంగాణ రాష్ట్రానికి మేలు చేస్తున్నారని చెప్పారట. ఇలా మోడీ పొగడ్తల పరంపర నాన్‌స్టాప్‌గా ఓ పావుగంట సేపు కొనసాగిందట. మోడీ అంటే గిట్టని కొంతమంది సభ్యులు మమ్మల్ని పిల్చిన పనేంటో చెప్పండి సార్ అని అనేసరికి కేసీఆర్ పొగడ్తల ప్రపంచం నుంచి బయటపడ్డారట.