TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రామ్ నాథ్ కోవిండ్ వీడ్కోలు విందు.. కేసీఆర్, మమతలకు అందని ఆహ్వానం

Published on: Sat Jul 23, 2022 1:20PM

రాజకీయ ప్రత్యర్థులను కేంద్రం, ప్రధాని శత్రువులుగా పరిగణిస్తున్నారన్న విమర్శలకు ఊతం కలిగేలా మరో ఉదంతమిది.రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆదివారం (జులై24)న పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో ఆయన గౌరవార్ధం ప్రధాని మోడీ విందు ఏర్పాటు చేశారు. ఆయన పదవీ విరమణ విందు కార్యక్రమానికి రామ్ నాథ్ కోవింద్ దంపతులు,  కాబోయే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరయ్యారు.

వారితోపాటు లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రముఖులు, పద్మ అవార్డుల గ్రహీతలు, గిరిజన నాయకులు పాల్గొన్నారు. ప్రతిపక్ష  కాంగ్రెస్‌ నుంచి సీనియర్‌ నేతలు గులాం నబీ ఆజాద్‌, అధీర్‌ రంజన్‌ చౌదరి హాజరయ్యారు. కాగా.. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు నేరుగా ఆహ్వాన కార్డులు పంపడానికి సమయం లేకపోవడంతో.. ఢిల్లీలోని ఆ రాష్ట్ర భవన్‌ల రెసిడెంట్‌ కమిషనర్లకు వాటిని అందజేశారు.

ఈ విషయాన్ని  ప్రధాని కార్యాలయం  వెల్లడించింది. వారు హోంశాఖ కార్యాలయం నుంచి నేరుగా కార్డులను తీసుకొని తమ సీఎంలు, డిప్యూటీ సీఎంలకు పంపించాలని సూచించింది. ఇంత వరకూ బాగానే ఉంది. అయితే రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆహ్వానం పంపే విషయంలోనే మోడీ సర్కార్ (కేంద్ర ప్రభుత్వం) తన వైఖరిని బయటపెట్టుకుంది. కనీస మర్యాదను మంటగలిపింది. తమ విధానాలను వ్యతిరేకించే ముఖ్యమంత్రులకు ఆహ్వానాలు పంపలేదు.  

బీజేపీ, ఎన్డీఏ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ముకు మద్దతు తెలిపిన ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా సీఎంలనూ మాత్రమే ప్రధానమంత్రి కార్యాలయం ఆహ్వానితుల జాబితాలో చేర్చింది. తెలంగాణ సీఎంకు ఆహ్వానం అందలేదు. అలాగే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకీ ఆహ్వానం లేదు. దీనిపై విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రాజకీయాలకు అతీతంగా జరగాల్సిన రాష్ట్రపతి వీడ్కోలు విందులో కూడా కేంద్రం వివక్ష చూపడాన్ని తీవ్రంగా గర్హిస్తున్నాయి.