TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బీజేపీ ముక్త భారత్.. కేసీఆర్ కొత్త నినాదం ..అందుకేనా?

Published on: Mon Jan 10, 2022 5:52PM

కాంగ్రెస్ ముక్త భారత్ లక్ష్యంగా బీజేపీ, ముఖ్యంగా మోడీ, షా జోడీ చాలా కాలంగా శ్రమిస్తోంది. ఆ ప్రయత్నాలు ఎంతవరకు ఫలించాయి.. ఏమిటీ అనేది  కొంతవరకు కళ్ళముందు కనిపిస్తూనే వుంది ..అయినా అది వేరే చర్చ. అయితే, ఇప్పుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీ, మోడీ ముక్త భారత్ నిందాన్ని పైకి తీసుకొచ్చారు. నిజానికి చాలా కాలంగా కేసీఆర్, రాష్ట్రంలో అధికారాన్ని నిలుపుకునేందుకు, కేటీఆర్’ను ముఖ్యమంత్రిని చేసేందుకు జాతీయ రాజకీయాలను పావుగా ఉపయోగించుకుంటున్నారు. గతంలో 2018 ఎన్నికలకు ముందు ఫెడరల్ ఫ్రంట్ అంటూ హడావిడి చేశారు. ఇప్పుడు వరసగా ఎదురు దెబ్బలు తగులుతున్న నేపధ్యంలో మళ్ళీ  ఫెడరల్ ఫ్రంట్’ ను పైకి తెచ్చే ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే ఇంతవరకు ఆశించిన స్పందన రాలేదు.కొద్ది రోజుల క్రితం చెన్నై వెళ్లి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్’తో మంతనాలు జరిపారు. ఇప్పటికీ కాంగ్రెస్ సారధ్యంలో యూపీఎలో భాగస్వామిగా ఉన్న డీఎంకే అధినేత సింపుల్’గా సారీ చెప్పి, కేసీఆర్ ఫ్యామిలీకి మంచి విందు ఇచ్చి, వట్టి చేతులతో సగౌరవంగా వెనక్కి పంపించారు.  

అదలా, ఉంటే ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు సిపిఐ, సిపిఎం జాతీయ నాయకులతో  ముఖ్యమంత్రి కేసీఆర్’తో భేటీ అయ్యారు. మూడు రోజుల పాటు హైదరాబాద్;లో జరిగిన   సీపీఎం జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు హైదరబాద్ వచ్చిన సిపిఎం అగ్ర నేత కేరళ సీఎం పినరయి విజయన్‌, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిని, మరో అగ్రనేత ప్రకాష్ కారత్ తో పాటుగా ఇతర నేతలను,  సీఎం కేసీఆర్ ప్రగతిభవన్‌కు ఆహ్వానింఛి విందు ఇచ్చారు. అంతవరకు ఓకే..గతంలోనూ ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు,, కేంద్ర మంత్రులు రాష్ట్రానికి వచ్చినప్పుడు, ముఖ్యమంత్రి వారికి విందు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. 

అయితే. లెఫ్ట్ నేతలకు కేసీఆర్ విందు ఇవ్వడంతో పాటుగా రాజకీయ విందును కూడ వడ్డించారు. సుమారు గంటన్నరకు పైగా ఏచూరి, విజయన్ , కారత్ ఇతర నాయకులతో చర్చలు సాగించారు. ఈ సందర్భంగా, దేశంలో బీజేపీని ఎలా నిలువరించాలనే అంశంపైనే కేసీఆర్, కమ్యూనిస్టు నాయకులూ సమాలోచనలు చేసినట్లు సమాచారం.బీజేపే ముక్త భారత్ లక్ష్యంగా కలిసి పనిచేయాలని ఇరు పార్టీలు సూత్ర ప్రాయంగా ఏకాభిప్రాయానికి వచ్చినట్లు గులాబీ పార్టీలో గుసగుసలు విపిపిస్తున్నాయి. సిపిఎం నేతలతో చర్చలు ముగిసిన అనంతరం ముఖ్యమంత్రి సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి, డి.రాజా, రాష్ట్ర సిపిఐ నాయకులు చాడా వెంకట రెడ్డి ఇతరులతోనూ విడిగా చర్చలు జరిపారు. ఇప్పుడు కేసీఆర్ ముందున్నది, బీజేపీ భయం, రాష్ట్రంలో అధికారం నిలుపుకోవడమే  కాబట్టి, వారితో కూడా అదే చర్చించి ఉంటారని వేరే చెప్పనక్కర్లేదు. 

నిజానికి, కేసీఆర్ జాతీయ రాజకీయాలు, ఫెడరల్  ఫ్రంట్ ఏర్పాటు, బీజేపీ ముక్త భారత్ అంటున్నా,ఆయన ప్రధాన లక్ష్యం మాత్రం రాష్ట్రంలో మూడవసారి అధికారంలోకి రావడమే అనేది అందరికి తెలిసిన బహిరంగ రహస్యం. అందుకే, కేసీఆర్  కామ్రేడ్ల’తో కాళ్ళ బేరానికి వచ్చారని, విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, కేసీఆర్ ఒకటి తలిస్తే ఏచూరి ఇంకొకటి తలిచారు. ఇప్పటికిప్పుఫు బీజేపీ వ్యతిరేక/ ప్రత్యాన్మాయ కూటమి ఏర్పాటు చేయవలసిన అవసరం లేదని, లోక్ సభ సార్వత్రిక ఎన్నికల తర్వాతనే ఫ్రంట్ గురింఛి ఆలోచన ఉంటుందని తేల్చి చెప్పారు. గతంలోనూ అలాగే జరిగిందని ఇప్పుడైనా అదే జరుగుతుందని తేల్చి చెప్పారు. అంటే, లోక్ సభ ఎన్నికలకంటే సంవత్సరం ముందు, 2023లో  జరిగే  అసెంబ్లీ ఎన్నికల్లో తెరాసతో పొత్తుకు సిపిఎం సిద్ధంగా లేదని ఏచూరి చెప్పకనే చెప్పారు. మరో వంక సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కేసీఆర్ బీజేపీని సూటిగా వ్యతిరేకించడం లేదన్నారు. కొన్ని విషయాల్లో మాత్రమే వ్యతిరేకిస్తోందని అన్నారు. బీజేపీ పట్ల కేసీఆర్ అనుసరిస్తున్న సాఫ్ట్ కార్నర్కు తాము వ్యతిరేకమని తమ్మినేని స్పష్టం చేశారు. 

రాష్ట్రంలో బీజేపీ, టీఆర్‌ఎస్ మధ్య పెద్ద యుద్ధమే నడుస్తోంది. టీఆర్ఎస్‌తో ఢీ అంటే ఢీ అనే రీతిలో కమలం పార్టీ దూకుడు ప్రదర్శిస్తోంది. ఈ నేపథ్యంలోనే కాషాయదళాన్ని నిలువరించేందుకు కొత్త ఎత్తులు, పొత్తులతో కేసీఆర్ ముందుకు వెళ్లాలని భావిస్తున్నారు. అందులోభాగంగా కమ్యూనిస్టు పార్టీలకు స్నేహ హస్తం అందించేందుకు గులాబీ బాస్ రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. గతంలోనూ కమ్యూనిస్టులతో కలిసి టీఆర్‌ఎస్ పనిచేసింది. రాబోయే రోజుల్లో జాతీయ స్థాయిలో బీజేపీపై పోరాటానికి కమ్యూనిస్టు పార్టీలు తోడైతే తమకు అదనపు బలవుతుందని కేసీఆర్ ఆలోచనగా తెలుస్తోంది. 
అయితే, తెరాస ఆమాటకొస్తే ప్రాంతీయ పార్టీలకు సైధాంతిక నిబద్దత లేదని, ఉండదని,  సిపిఎంకు తెలుసు.ఆ పార్టీ నాయకులకు తెలుసు. తెలియడం కాదు, అఖిల భారత మహాసభల్లో ప్రాంతీయ పార్టీల స్వభావంపై ఆమోదించినతీర్మానంలోనే, ప్రాంతీయ పార్టీలు వ్యక్తి అధారిత పార్టీలు కాబట్టి, ఆ పార్టీలకు వ్యక్తి నిబద్ధత, వ్యక్తి /నాయకుడి అవసరాల నిబద్దతే కానీ, ప్రజల అవసరాలు, దేశం అవసరాల పట్ల నిబద్దత ఉండదని, సిపిఎం తీర్మానమే చేసిందని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. సో .. ఇక్కడ కూడా వ్రతం చెడ్డా (సీపీఎం తెలంగాణ ఏర్పాటునే వ్యతిరేకించింది) ఫలితం మాత్రం లేదని, పరిశీలకులు అంటున్నారు.