జీవన్‌రెడ్డికి కేసీఆర్ గాలం వేశారా?

 

టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ అరటిపండు తొక్క విసిరారంటే ఎలాంటి వారైనా జర్రుమని జారి పడాల్సిందే. అవసరమైన సందర్భంలో ఎలాంటి రాజకీయ ట్రిక్కు ప్రదర్శించడానికైనా కేసీఆర్‌కి కేసీఆర్‌రే సాటి. ఆ విషయం అనేక సందర్భాలలో రుజువైంది. ఇప్పుడు కేసీఆర్ అసెంబ్లీ సాక్షితో మరోసారి రాజకీయ ట్రిక్కు ప్రదర్శించారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీల్లో బలమైన నాయకులు వున్నారు. వారు కేసీఆర్ ప్రభుత్వ తీరును ఎండగట్టడంలో ఉద్ధండ పిండాల్లా వున్నారు. తెలుగుదేశం పార్టీలో రేవంత్ రెడ్డి ఎలాంటి వారో.. కాంగ్రెస్ పార్టీలో జీవన్ రెడ్డి అలాంటి వారు. గతంలో ఆయన కరీంగనగర్ పార్లమెంట్‌ ఉప ఎన్నికలలో కేసీఆర్‌ మీదే పోటీ చేసి గట్టి పోటీ ఇచ్చిన నాయకుడు. ప్రస్తుతం కరీంనగర్ జిల్లా నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫును అసెంబ్లీలో ప్రతినిధిగా వున్న ఏకైక ఎమ్మెల్యే. ఇప్పుడు కేసీఆర్ తన రాజకీయ చతురత జీవన్ రెడ్డి మీద ప్రయోగించారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. దీనికి తాజాగా అసెంబ్లీలో జరిగిన ఒక సంఘటనను ఉదహరిస్తున్నారు.

 

మంగళవారం నాడు తెలంగాణ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు రుణాలు ఇచ్చే విషయంలో బ్యాంకులు అవలంబిస్తున్న క్లిష్టమైన విధానాల గురించి జీవన్ రెడ్డి మాట్లాడారు. ఈ విషయంలో ఆయన ప్రభుత్వం మీద అనేక ప్రశ్నలు సంధించారు. దీనిమీద స్పందించిన సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, తన సహజ శైలిలో కాకుండా చాలా ఆచితూచి మాట్లాడారు. బ్యాంకుల వ్యవహారశైలి మీద జీవన్ రెడ్డి బాగా మాట్లాడారని, ఆయనతో తాను ఏకీభవిస్తున్నానని అన్నారు. అసలు కేసీఆర్ నుంచి ఇంత కూల్‌గా సమాధానం వస్తుందని ఊహించని సభ్యులు ఒకింత ఆశ్చర్యపోయారు. పైగా గతంలో తనతో పోటాపోటీగా నిలిచిన జీవన్ రెడ్డికి కేసీఆర్ అంత కూల్‌గా సమాధానం ఇవ్వడం కూడా సభ్యులను ఆశ్చర్యపరిచింది. ఈ ఆశ్చర్యం కొద్ద క్షణాల తర్వాత గాల్లో కలసిపోయేదే. కానీ, ఆ తర్వాత కేసీఆర్ కాంగ్రెస్ సభ్యులు కూర్చునే గ్యాలరీ వైపు వెళ్ళి, జీవన్ రెడ్డి పక్కనే కూర్చుని ఆయనతో కొద్దిసేపు ముచ్చటించడం ఆ ఆశ్చర్యాన్ని వేలరెట్లు చేసింది.

 

కేసీఆర్ జీవనరెడ్డి విషయంలో వ్యవహరించిన ఈ తీరు ఆయన్ని టీఆర్ఎస్‌లోకి లాక్కునే ‘ఆకర్ష’ పథకంలో భాగమేనని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. కరీంనగర్ జిల్లాలో బలమైన కాంగ్రెస్ నాయకుడు, అసెంబ్లీలో మంచి వాగ్ధాటి వున్న జీవన్‌‌రెడ్డిని తన పార్టీలోకి లాక్కుంటే అసెంబ్లీలో, బయట తనకు ఇబ్బందిగా నిలిచే ఒక బలమైన నాయకుడి బెడద తనకు ఉండదని కేసీఆర్ భావిస్తూ వుండొచ్చని పరిశీలకులు అంటున్నారు. మరి కేసీఆర్ వేసిన రాజకీయ పాచిక జీవన్ రెడ్డి మీద పారుతుందో లేదో వేచి చూడాలి.