జైలుకు పంపిస్తాన‌న్న సంజ‌యే జైలుకు.. కేసీఆర్‌పై ర‌గిలిపోతున్న ఆ ఇద్ద‌రు..

posted on: Jan 4, 2022 3:35PM

ఒక‌ప్పటి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఇప్పుడు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి అయ్యారు. ఈ రాజకీయ‌ ప‌రిణామానికి కార‌ణం కేసీఆరే అని స్వ‌యంగా రేవంతే చెప్పారు. ఎమ్మెల్సీ స్టీఫెన్‌స‌న్ కేసులో త‌న‌ను అరెస్ట్ చేసి జైల్లో పెట్ట‌డాన్ని రేవంత్‌రెడ్డి జీర్ణించుకోలేక‌పోయారు. అప్ప‌టి నుంచి కేసీఆర్ ప‌త‌న‌మే త‌న ల‌క్ష్యంగా దూసుకుపోతున్నారు. టీడీపీని వీడినా.. కాంగ్రెస్‌లో చేరినా.. పీసీసీ ప‌గ్గాలు చేప‌ట్టినా.. ఇదంతా ఏ అధికారం కోస‌మో కాదని.. త‌న‌ను జైలుకు పంపించిన కేసీఆర్‌ను ఒక్క‌సారైనా జైల్లో పెట్ట‌డ‌మే టార్గెట్‌గా రేవంత్‌రెడ్డి రాజ‌కీయంగా ఎదుగుతున్నార‌ని అంటారు. 

సేమ్ టూ సేమ్ కాక‌పోయినా.. కొంచెం అటూఇటూగా రేవంత్‌రెడ్డిలాంటి ప‌రిణామ‌మే బండి సంజ‌య్ విష‌యంలోనూ జ‌రిగింద‌ని చెబుతున్నారు. క‌రీంన‌గ‌ర్‌లో కార్పొరేట‌ర్‌గా ఉన్న‌ప్పుడు బండి సంజ‌య్ ఎవ‌రో ప‌క్క జిల్లా వారికి కూడా తెలీదు. ఎమ్మెల్యేగా ఓడిపోవ‌డంతో ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు. ఆ త‌ర్వాత‌ ఏకంగా ఎంపీగా గెలవ‌డం సంచ‌ల‌నం. ఆ వెంట‌నే రాష్ట్ర అధ్య‌క్షుడి కిరీటం ద‌క్క‌డం మ‌రింత అనూహ్యం. ఇక అప్ప‌టి నుంచీ బండి సంజ‌య్ త‌గ్గేదేలే అంటూ కేసీఆర్‌పై విరుచుకుప‌డుతున్నారు. బీజేపీ కార్య‌క‌ర్త‌పై పోలీస్‌ లాఠీ ప‌డితే.. వెంట‌నే ఆక్క‌డ వాలిపోతున్నారు. కేడ‌ర్‌కు అండ‌గా నిలుస్తున్నారు. పార్టీలో ఫైర్‌బ్రాండ్ లీడ‌ర్‌గా మారారు. ప్ర‌జాస‌మ‌స్య‌ల‌పై, ప్ర‌భుత్వ విధానాల‌పై ఎప్ప‌టిక‌ప్పుడు పోరాడుతూ దూకుడు పాలిటిక్స్ చేస్తున్నారు. 

ఈ క్ర‌మంలో సీఎం కేసీఆర్‌కు అనేక‌సార్లు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు బండి సంజ‌య్‌. కేసీఆర్ కుటుంబ అవినీతి చిట్టా మొత్తం లాగుతున్నాం. త్వ‌ర‌లోనే కేసీఆర్ జైలుకు వెళ్ల‌డం ఖాయం.. అంటూ ఇప్ప‌టికే ఏ వంద‌సార్లైనా అనుంటారు. ప‌దే ప‌దే జైలుకు పంపిస్తామ‌ని అన‌డ‌మే కానీ.. ఆ సాక్షాలు బ‌య‌ట‌పెట్టడం లేదు.. సీబీఐ కేసులు పెట్ట‌డం లేదంటూ.. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి బండి సంజ‌య్‌ను ప‌లుమార్లు రెచ్చ‌గొట్టారు కూడా. కేసీఆర్‌ను జైలుకు పంపే వ‌ర‌కూ వ‌ద‌ల‌బోమంటూ బండి.. గేర్లు మార్చి స్పీడ్‌ పెంచుతూనే ఉండేది.  

క‌ట్‌చేస్తే, బండి సంజ‌య్ డైలాగ్ ఆయ‌న‌కే రివ‌ర్స్ అయ్యేలా చేశారు కేసీఆర్‌. త‌న‌ను జైలుకు పంప‌డం కాదు.. ముందు నిన్ను లోప‌లేస్తా చూడు అనుకున్న‌ట్టున్నారు.. ఒక్క దీక్ష‌తో.. ఒక్క‌ కేసుతో.. బండిని నేరుగా జైలుకు త‌ర‌లించారు. పోలీసుల విధుల‌కు ఆటంకం క‌లిగించారంటూ.. నాన్‌బెయిల‌బుల్ కేసు పెట్టడం.. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించ‌డం.. సంజ‌య్ జైల్లో మ‌గ్గ‌డం చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయి. ఇన్నాళ్లూ కేసీఆర్‌ను జైల్లో పెడ‌తామ‌న్న బండి సంజ‌య్ వ్యాఖ్య‌లు.. ఆయ‌న‌కే రివ‌ర్స్ కొట్టి.. ఇప్పుడు ఆయ‌నే జైల్లో ఉండాల్సిన దుస్థితి. ఇదంతా కేసీఆర్ గీసిన స్కెచ్. 

అచ్చం ఏపీలో మాదిరే రాజ‌కీయ ప‌రిణామాలు తెలంగాణ‌లోనూ జ‌రుగుతున్నాయ‌ని అంటున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌తిప‌క్ష నేత‌ల‌పై ఇలానే కేసులు పెట్టి.. జైల్లో పెట్టే కుట్ర‌లు పెద్ద ఎత్తున జ‌రుగుతున్నాయి. ఎంపీ ర‌ఘురామ‌లాంటి వారిపై క‌స్ట‌డీలో థ‌ర్డ్‌డిగ్రీ కూడా ప్ర‌యోగించార‌ని అంటారు. అలానే.. గ‌తంలో రేవంత్‌రెడ్డిని జైల్లో పెట్ట‌డం.. ఇప్పుడు బండి సంజ‌య్‌ను జైలుకు త‌ర‌లించ‌డం.. క‌క్షపూరిత రాజ‌కీయాల‌కు నిద‌ర్శ‌నమ‌ని మండిప‌డుతున్నారు. తీన్మార్ మ‌ల్ల‌న్న‌లాంటి చిన్నాచిత‌క నాయ‌కుల‌నే కాదు.. తాము త‌లుచుకుంటే బండి సంజ‌య్ లాంటి బ‌డా లీడ‌ర్లు సైతం జైలు ఊచ‌లు లెక్క‌బెట్టాల్సిందేన‌ని హెచ్చ‌రిక చేసేందుకే ఇంత‌టి సాహ‌సానికి తెగించార‌ని అంటున్నారు. ఈ ప‌రిణామం కేసీఆర్‌కు మ‌రోర‌కంగా పెద్ద మైన‌స్ అని భావిస్తున్నారు. 

ఆనాడు రేవంత్‌రెడ్డి విష‌యంలో చేసిన త‌ప్పే.. ఇప్పుడు బండి సంజ‌య్ కేసులోనూ చేశార‌ని.. అది అటూఇటూ తిరిగి కేసీఆర్‌కే స‌వాల్ విసురుతుంద‌ని అంటున్నారు. రేవంత్‌ను జైల్లో వేసినందుకు.. ప‌ట్టుద‌ల‌తో పీసీసీ చీఫ్ స్థాయి వ‌ర‌కూ ఎదిగి.. ప్ర‌గ‌తిభ‌వ‌న్‌పై దండెత్తుతున్నారు. అలానే, బండి సంజ‌య్ సైతం ఇక‌పై కేసీఆర్‌తో వైరాన్ని ప‌ర్స‌న‌ల్‌గా తీసుకుంటార‌ని.. మ‌రింత ప‌దునుగా దాడి చేస్తార‌ని అంచ‌నా వేస్తున్నారు. ఇలా, కేసీఆర్ పాలిట మొన‌గాళ్ల‌లా మారిన రేవంత్‌రెడ్డి, బండి సంజ‌య్ ఇద్ద‌రూ ఆయ‌న వ‌ల్ల జైలు బాధితులుగా మార‌డం.. దెబ్బ‌తిన్న పులిలా.. పంజా విసిరి దాడి చేసేందుకు సిద్ధం కావ‌డం.. వారిద్ద‌రినీ ఏక‌కాలంలో ఎదుర్కోవ‌డం.. ఇలా కేసీఆర్‌కు ముందుందంతా క‌ష్ట‌కాల‌మే అంటున్నారు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...