TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మార్పు కోసం మరో ఉద్యమం-బీజేపీని ఏకిపారేసిన కేసీఆర్

Published on: Tue Feb 1, 2022 7:17PM

ముఖ్యమంత్రి కేసీఆర్ కడుపు రగిలింది. మాట పదునెక్కింది. గొంతులో ఆక్రోశం పెల్లుబికింది. 75 ఏళ్ల స్వాతంత్ర్య భారతదేశానికి ఇంకా ఈ దుర్గతి ఎందుకు పట్టిందంటూ నరేంద్ర మోడీని, బీజేపీని టార్గెట్ చేస్తూ విజృంభించి మాట్లాడారు. కొండొకచో ఆయన విశృంఖలమైన తిట్లను కూడా ఆపుకోలేకపోయారు. దేశంలో, రాష్ట్రంలో బీజేపీ నేతలు చేస్తున్నవి దొంగ డ్రామాలంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆయన బీజేపీ వైఖరి గురించి, నరేంద్ర మోడీ శైలి గురించి మాట్లాడుతున్న సమయంలో మొహంలో హావభావాలను కూడా ఆపుకునే ప్రయత్నం చేయకపోవడం విశేషం.  దేశానికి పట్టిన ఈ దరిద్రం  పోవాలంటే, గుణాత్మకమైన మార్పు రావాలని, అందుకోసం ఈ దేశ యువత నడుం కట్టాల్సిన అవసరం ఉందని, మార్పుకు అనువైన సమయం ఇదేనని హిందీ, ఇంగ్లిష్ భాషల్లో కూడా తన వైఖరి వెల్లడించి, బీజేపై పోరాటాన్ని జాతి అవసరంగా  పేర్కొన్నారు.

నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ పై తన వైఖరిని కూలకంషంగా కుండబద్దలు కొట్టారు. బడ్జెట్ పాఠంలో సీతారామన్ భగవద్గీత శ్లోకాన్ని ఉటంకించడం అధర్మమంటూ మొదలుపెట్టిన కేసీఆర్... తన ప్రెస్ మీట్ లో కేంద్ర ప్రభుత్వం డొల్లతనాన్ని ఫిగర్లతో సహా పేర్కొన్నారు. బడ్జెట్ కేటాయింపులే గాక ప్రభుత్వం దగ్గర సామాజిక వర్గాల లెక్కలు కూడా తప్పేనన్నారు. దేశంలో ఎస్సీ, ఎస్టీలు, మైనారిటీలు 12,800 కోట్లుగా ఉన్నారని చెప్పారని కానీ 38 నుంచి 40 వేల కోట్లుగా ఉన్నట్లు చెప్పారు. అలాగే బడ్జెట్ లో కూడా వ్యవసాయానికి సబ్సిడీ తగ్గించి రైతు లోకానికి తీవ్రమైన అన్యాయం చేశారన్నారు. తెలంగాణలో తాము ఉచిత కరెంట్ ఇస్తుంటే ఎఫ్.ఆర్.బి.ఎం పరిమితుల పేరుతో మోటార్లకు మీటర్లు పెట్టి చార్జీలు వసూలు చేసే కుయుక్తులు పన్నుతున్నారని బీజేపీ పాలసీపై మండిపడ్డారు. ఈ బడ్జెట్ లో ఏ ఒక్క వర్గానికి కూడా మేలు చేసే పాలసీ ప్రకటించకపోవడం బీజేపీ నేతల చేతగానితనానికి, దొంగ డ్రామాలకు నిదర్శనమన్నారు. హెల్త్ సెక్టార్ కు ఒక్క రూపాయి కూడా పెంచకపోగా తగ్గించడం దారుణమన్నారు. పాండమిక్ సీజన్ లో హెల్త్ ను నిర్లక్ష్యం చేశారంటే మోడీకి ఉన్న ముందు చూపేంటో తెలిసిపోతుందన్నారు.

దేశంలో 15 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, తామిక్కడ ఇప్పటికే లక్షా 35 వేల  ఉద్యోగాలు ఇచ్చామని, త్వరలో మరో దాదాపు 40 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వేస్తామన్నారు. బడ్జెట్ లో ప్రస్తావించిన నదుల అనుసంధానాన్ని ఓ పెద్ద జోక్  గా అభివర్ణించారు. గోదావరి జలాల అంశంపై ఇప్పటికే ట్రిబ్యునల్ తీర్పు ఉండగా...గోదావరి-కృష్ణాను ఎలా అనుసంధానం చేస్తారో చెప్పాలని మోడీకి సవాల్ విసిరారు. గోదావరి జలాల కేటాయింపులు తేల్చాలని తామే ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసినా, ఆ అంశాన్నిపట్టించుకోని మోడీ.. ఇప్పుడు నదుల అనుసంధానం ఎలా చేస్తారు, ఎలా కేటాయిస్తారు.. ట్రిబ్యునల్ తీర్పు అంటే సుప్రీంకోర్టు తీర్పుతో సమానమని అలాంటిది నీళ్లు కేటాయించే అధికారం మీకు ఎక్కడిది అంటూ మోడీ సర్కారు అవివేకాన్ని ఎండగట్టారు.

ఇక సెంట్రల్ వాటర్ కమిషన్ లెక్కల ప్రకారమే దేశంలో 65 వేల టీఎంసీల నీటి వనరులున్నాయని, కానీ వాడుకుంటున్నది మాత్రం 30-35 వేల టీఎంసీలు మాత్రమేనన్నారు. మోడీ 8 ఏళ్ల పాలనలో జలాల వినియోగం గురించి ఒక్క పాలసీ కూడా తీసుకురాని మోడీ ఇప్పుడు జలశక్తి మిషన్ అంటూ బడ్జెట్ లో చెప్పడం పచ్చి  అబద్ధమన్నారు. మిషన్ భగీరథ కింద తామే 40వేల కోట్లు కేటాయించి జలయజ్ఞం చేస్తే మోడీ 60 వేల కోట్లు యావత్ దేశానికి ఏమూలకు సరిపోతాయని పాయింటవుట్ చేశారు.  అంతేగాక మోడీ  వ్యవహార శైలిని పర్సనల్ గా కూడా కేసీఆర్ ఎండగట్టారు. హైదరాబాద్  లో ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ మెకానిజం కోసం చీఫ్ జస్టిస్ రమణను ఒప్పించి ఓ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తే అహ్మదాబాద్ లో దానికి శిఖండిని ఏర్పాటు చేశారని తీవ్రంగా విమర్శించారు. తెలంగాణ ఏర్పాటు నుంచి కూడా మోడీ తమకు అన్యాయమే  చేస్తున్నాడని, అయినా ఘర్షణ పడకుండా వ్యవహారాలన్నీ చక్కబెట్టుకుంటూవస్తున్నామన్నారు. ఏడు మండలాలను ఆంధ్రాలో కలిపింది మోడీయేనని, పవర్ ప్లాంటును పోగొట్టుకున్నామని ఆక్రోశం వెళ్లగక్కారు.

అందుకే ఇలాంటి ముందుచూపు లేని బీజేపీ పాలనకు చరమగీతం పాడేందుకు జాతీయ స్థాయిలో ఉద్యమిస్తామని, అందుకోసం తాను ముందుండి పోరాడతానన్నారు. 75  ఏళ్ల స్వతంత్ర భారతావనికి కాంగ్రెస్,బీజేపీలు ఏమీ చేయలేకపోయాయని ఇప్పటికీ ఆకలి సూచీలో దేశం పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్ ల కన్నా అధ్వానంగా ఉండడానికి ముందుచూపు లేని విధానాలే కారణమన్నారు. సకల వనరులూ ఉన్న దేశాన్ని అత్యంత దయనీయంగా మారుస్తున్నారంటూ బీజేపీ  నేతలపై విరుచుకుపడ్డారు. సాధించుకున్న తెలంగాణలో తామెంత అభివృద్ధి  చేశాము, వలసలు  ఆగిపోయి తెలంగాణకే  పనుల కోసం ఇతర రాష్ట్రాలప్రజలు  వస్తున్న  వైనాన్ని కళ్లకు కట్టారు. తెలంగాణ సాధించుకున్న అనుభవంతో, అదే విజన్ తో ఈ దేశాన్ని కూడా బాగు చేసుకుంటామన్నారు. ఈ దేశానికి తాను కూడా ఓ సిపాయినే అన్నారు. మోడీ సర్కారు దుర్మార్గాలను ఈ దేశం, ఈ దేశ యువత ఇకపై భరించబోవన్నారు. అందుకే యువకులు బీజేపీ విధానాలపై పోరాడాలని పిలుపునిచ్చారు. దేశంలోని అందరు నేతలతో తాము సంప్రదింపులు జరుపుతున్నామని, కలిసి వచ్చే పార్టీలను కలుపుకొని దేశ రాజకీయ, సామాజిక ముఖ చిత్రాన్ని మార్చేందుకు  కృషి చేస్తామన్నారు.

ఇక కేసీఆర్ రాజ్యాంగాన్ని కూడా  మార్చాలనడం సంచలనం రేపుతోంది. ఇప్పటికే దాదాపు  90 సార్లు రాజ్యాంగాన్ని మార్చుకున్నామని, కానీ మారిన పరిస్థితులకు అనుగుణంగా ఇక సవరించడం కాకుండా కొత్త రాజ్యాంగాన్ని రాసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దీనిపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలన్నారు. త్వరలోనే  హైదరాబాద్ లో రిటైర్డ్ ఐఏఎస్ అధికారులతో ఓ సమావేశం ఏర్పాటు చేస్తున్నానని, దీనిద్వారా పోరాటానికి ఓ తుది రూపు వస్తుందంటూ ప్రత్యామ్నాయ రాజకీయాలకు హైదరాబాద్  కేంద్రంగా మారబోతోందని పరోక్షంగా చెప్పారు కేసీఆర్.  

మొత్తానికి ఇటీవలి కాలంలో కేసీఆర్ నిర్వహించిన ప్రెస్ మీట్లలో ఇదే అత్యంత సంచలనాత్మకంగా ఉందంటున్నారు పరిశీలకులు. మోడీని లెక్కలతో సహా ఎండగట్టడానికి బాగా హోం  వర్క్ చేసుకొని  వచ్చాడన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. కేసీఆర్ తాజా ప్రెస్ మీట్ తో బీజేపీ నేతలపై దేశవ్యాప్త పోరాటాన్ని ప్రకటించినట్లయింది.