కేసీఆర్,గవర్నర్.. విందులే.. విందులు
Published on: Thu Dec 31, 2015 11:37AM
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ గత వారం రోజుల నుండి విందులలో పాల్గొంటూ తెగ బిజీగా ఉన్నారు. ఒకప్పుడు విందులంటే డుమ్మా కొట్టే కేసీఆర్.. ఇప్పుడు తెగ విందులలో పాల్గొంటున్నారు. ఈ నెల 23 నుండి 27 వరకూ నిర్వహించిన ఆయుత చండీయాగంలో గవర్నర్ నరసింహన్ కూడా హాజరయ్యారు. దాదాపు చండీయాగం పూర్యయే వరకూ గవర్నర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక కార్యక్రమంలో విందు సంగతి సరేసరి. అలా యాగం పూర్తయిందో లేదో.. తర్వాత శీతాకాల విడిది కోసం హైదరాబాద్ కు వచ్చిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గౌరవార్థం గవర్నర్ నరసింహన్ 29న రాజ్ భవన్ లో విందును ఏర్పాటు చేశారు. గవర్నర్ ఇచ్చిన ఈ విందు కార్యక్రమానికి రాష్ట్రపతితో పాటు ఇద్దరు తెలుగు రాష్ట్రాల సీఎంలు పాల్గొన్నారు. ఇక తర్వాతి రోజు 30న రాష్ట్రపతి నిలయంలో ప్రణబ్ ఎట్ హోం పేరిట విందును ఏర్పాటు చేశారు. ఈ విందులో కూడా మళ్లీ రాష్ట్రపతి.. గవర్నర్.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి హాజరయ్యారు. ఇక రేపు కొత్త సంవత్సరం కాబట్టి ఎలాగూ ప్రముఖుల్ని కలవడం.. విందులో పాల్గొనడం ఉంటుంది. మొత్తానికి కేసీఆర్..గవర్నర్ ఇద్దరూ ఏడాది మొత్తం మీద పాల్గొనాల్సిన విందులన్నీ కలపీ.. ఏడాది చివరిలో పాల్గొన్నట్టున్నారు.


