ప్రజారోగ్యం పట్టని కేసీఆర్ సర్కార్!
Published on: Wed Jun 22, 2022 6:26AM
ప్రజల సంక్షేమాన్ని, ఆరోగ్యాన్ని పట్టించులేనపుడు ఎంతటి నాయకుడయినా ప్రజల ముందు నిలవలేరు. రాష్ట్రం వచ్చినప్పటి నుంచి కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటయినప్పటి నుంచీ కేవలం తనకు పరిస్థితులు అనుకూలించేలా రాజకీయాలు చేయడం తప్ప ప్రజల ఆరోగ్యాన్ని ప్రభుత్వం ఎన్నడూ పట్టించుకోలేదని బిజెపీ నేత విజయశాంతి మండిపడ్డారు. వర్షాకాలం వచ్చి గ్రామాల్లో పరిస్థితులు అధ్వాన్నంగా వున్నాగాని వాటిని పట్టించుకోవడం లేదని, ప్రజలు నానా ఇబ్బందులూ ఎదుర్కొంటున్నారని ఆమె సోషల్ మీడియా వేదికగా టీఆర్ఎస్‌పై విమర్శల వర్షం కురిపించారు . వర్షాకాలం ఆరంభమయినా గ్రామాల్లో పారిశుధ్యం మెరుగునకు నోచుకోలేదని అన్నారు. అంతేగాక ఆస్పత్రు ల్లో వివిధ పోస్టుల భర్తీపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బిజెపి నేత విజయశాంతి ఆరోపించారు.
పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి ముగిసినా శివారు ప్రాంతాల పరిస్థితి మారలేదు. హాస్పిటల్స్‌లో డాక్టర్లు, సిబ్బంది కొరత వేధిస్తోంది. ఏళ్ల కేళ్లుగా వైద్యుల పోస్టులు భర్తీ చేయకపోవడంతో జనం ఇబ్బంది పడుతున్నారన్నారు. ఒక్క ఆదిలాబాద్ జిల్లాలో గత ఏడాది డయేరియా కేసులు 16,089 నమోదు కాగా, ఈ ఏడాది ఇప్పటి వరకు 6,452 కేసులు నమోదయ్యా యి. గతేడాది మలేరియా రెండు, డెంగీ 231 కేసులు నమోదు కాగా ఈ ఏడాది ఇప్పటి వరకే 38 కేసులు రికార్డ్ అయ్యాయి.
ఆదిలాబాద్ జిల్లాలో 22 పీహెచ్సీలు, ఏరియా హాస్పిటల్, ఐదు అర్బన్ హెల్త్ సెంటర్లు, 126 సబ్ సెంటర్లు ఉండగా... పీహెచ్సీల్లో 13 డాక్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అర్బన్ సెంటర్లలో ఏడు డాక్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నయి. ఫార్మసిస్ట్ పోస్టులు ఆరు, ల్యాబ్ టెక్నిషియన్ పోస్టులు ఐదు, మిగతావి 94 పోస్టులు ఖాళీగా ఉన్నయి. ఈ ఒక్క జిల్లానే కాదు, రాష్ట్రం మొత్తం ఇదే పరిస్థితి ఉంది.
గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేక ప్రణాళిక వంటి కార్యక్రమాలు ఇంకా మొదలుకాలేదు. కేసీఆర్ సర్కార్ ఇవన్నీ గాలికొదిలేసి చోద్యం చూస్తోంది. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కేసీఆర్ సర్కార్‌కు తెలంగాణ ప్రజానీకం కచ్చితంగా తగిన శాస్తి చేస్తుంది అని విజయశాంతి పేర్కొన్నారు.


