కేంద్రానికి ఏపీ జీహుజూర్!.. జగనన్న ఇజ్జత్ తీసిన కేసీఆర్!
Published on: Sun Feb 13, 2022 5:37PM
కేంద్రం ఏం చెబితే ఏపీ అది చేస్తోందంటూ జగనన్న ఇజ్జత్ తీసేశారు తెలంగాణ సీఎం కేసీఆర్. వైసీపీ ప్రభుత్వం ఎంతగా రైతు వ్యతిరేక, వ్యవసాయ వ్యతిరేక ప్రభుత్వమో లెక్కలతో సహా తేల్చి చెప్పారు. కేంద్రం, పీఎం మోదీపై విమర్శల్లో భాగంగా ఏపీ సీఎం జగన్ బండారం బయటపెట్టారాయన.
విద్యుత్ సంస్కరణల డ్రాఫ్ట్ బిల్లును కేంద్రం అన్ని రాష్ట్రాల సీఎంలకు పంపిందని.. ఆ ప్రతిపాదనలను తిరస్కరిస్తూ తానే నేరుగా పీఎం మోదీకి లేఖ రాశానని చెప్పారు. తాము ఇంత బలంగా వ్యవసాయ మీటర్లను వ్యతిరేకిస్తుంటే.. పక్క రాష్ట్రం ఏపీ సీఎం జగన్ మాత్రం అప్పుడే అమలు చేస్తోందని తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో 25వేల వ్యవసాయ కనెక్షన్లకు కొత్త మీటర్లు ఫిట్ చేశారని అన్నారు. మీటర్లు పెడుతున్న రాష్ట్రాలకు 0.5 శాతం ఎఫ్‌ఆర్‌బీఎం అదనంగా ఇస్తామంటున్నారని, మీటర్లు పెట్టమనకుండానే ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పెట్టారా? అని ప్రశ్నించారు.
రాజ్యాంగాన్ని ఉల్లంఘించి మోదీ ప్రభుత్వం దుర్గార్మం చేస్తోందని, కొత్త వ్యవసాయ కనెక్షన్లు పెట్టవద్దని చెప్పారన్నారు. ఏడాదిలో అన్ని కనెక్షన్లకు మీటర్లు పెట్టాలని చెప్పారన్నారు. విద్యుత్ సంస్కరణలపైనా అబద్ధాలే చెబుతున్నారని, పార్లమెంట్ లో ఆమోదం పొందకముందే బిల్లును అమలు చేస్తున్నారని కేసీఆర్ మండిపడ్డారు.


