కేంద్రంపై ఉవ్వెత్తున దండయాత్ర.. కేసీఆర్ యాక్షన్ ప్లాన్..
Published on: Sat Mar 19, 2022 7:54PM
కేసీఆర్ తగ్గేదేలే అంటున్నారు. ప్రశాంత్ కిశోర్ సలహాలో లేక, సొంత ఎజెండానో.. కారణం ఏదైనా కేంద్రంపై పోరాటాన్ని మరింత ఉధృతం చేయనున్నారు. ఇన్నాళ్లూ ఇద్దరు ముగ్గురు మంత్రులను వెంటేసుకొని.. ఢిల్లీకి నిచ్చెనేసిన గులాబీ బాస్.. ఇకపై తనతో పాటు గులాబీ దళాన్ని హస్తినపై దండయాత్రకు సిద్ధం చేస్తున్నారు. అందుకు తగిన విధివిధానాలు, కార్యచరణపై కసరత్తు చేసేందుకు ఈ నెల 21, సోమవారం ఉదయం తెలంగాణ భవన్ లో టిఆర్ఎస్ పార్టీ శాసనసభ పక్ష సమావేశం జరపాలని కేసీఆర్ నిర్ణయించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, జడ్పీ చైర్మన్లు, డిసిసిబి, డిసిఎంఎస్ ల అధ్యక్షులు, రైతుబంధు సమితుల జిల్లా అధ్యక్షులు తప్పనిసరిగా హాజరుకావాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
తెలంగాణలో యాసంగి వరి ధాన్యాన్ని కేంద్రప్రభుత్వం ఖచ్చితంగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా, ఆందోళన, నిరసన కార్యక్రమాలకు ఈ సమావేశంలో రూపకల్పన చేయనున్నారు సీఎం కేసీఆర్. ఇక సమావేశం అనంతరం మంత్రుల బృందంతో కలిసి ముఖ్యమంత్రి అదే రోజు ఢిల్లీ వెళ్లనున్నారు. ధాన్యం కొనుగోళ్ళ మీద కేంద్ర మంత్రులను, అవసరమైతే ప్రధానిని కలిసి డిమాండ్ చేయనున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో జరిగే ఆందోళన కార్యక్రమాలకు అనుగుణంగా లోక్ సభలో, రాజ్యసభలో టిఆర్ఎస్ ఎంపీలు నిరసన కార్యక్రమాలు చేపడతారు. పంజాబ్ రాష్ట్రానికి చెందిన వరి ధాన్యాన్ని 100 శాతం కేంద్ర ప్రభుత్వం సేకరిస్తున్నందున, తెలంగాణ వరి ధాన్యాన్ని కూడా పంజాబ్ తరహాలో 100 శాతం ఎఫ్ సిఐ సేకరించాలని డిమాండ్ చేయనున్నారు. వరి ధాన్యం కొనుగోలుపై ఈసారి ఉధృతమైన పోరాటాలకు టిఆర్ఎస్ పార్టీని సిద్ధం చేస్తున్నారు కేసీఆర్.


