రిజర్వేషన్ బిల్లులో సవరణలు..తెలంగాణ తీర్మానం ఉండాలి

 

అగ్రవర్ణ పేదలకు 10శాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టింది. ఈ మేరకు 124వ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం లోక్‌సభ ముందుకు తీసుకువచ్చింది. బిల్లుపై చర్చించిన అనంతరం ఉభయ సభలు 2/3 వంతు మెజార్టీతో ఆమోదం తెలపాల్సి ఉంటుంది. లోక్‌సభలో బీజేపీకి స్పష్టమైన మెజారిటీ ఉన్నందున బిల్లు సునాయాసంగా ఆమోదం పొందవచ్చు. అసలు పరీక్ష రాజ్యసభలో ఎదురుకానుంది. ఎగువ సభలో అధికార పక్షానికి సరిపడ బలం లేనందున విపక్షాలు పలు సవరణలు డిమాండ్‌ అవకాశం ఉంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పట్టిన బిల్లుపై టీఆర్‌ఎస్‌ ఎంపీలు ఏవిధంగా వ్యవహరించాలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ వారికి దిశానిర్ధేశం చేశారు. ఈ బిల్లులో సవరణలు కోరాలని తెరాస ఎంపీలను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. గతంలో తెలంగాణలో ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు, ఎస్టీలకు 10శాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. ఈ తీర్మానాన్ని పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాల్సి ఉంది. తాజాగా కేంద్రం రిజర్వేషన్ల పెంపు అంశాన్ని చేపట్టినందున ఈ బిల్లులో తెలంగాణలో రిజర్వేషన్ల పెంపు అంశాన్ని కూడా చేర్చాలని కోరాల్సిందిగా సీఎం సూచించారు.