కేసీఆర్-మోదీ మిలాఖత్!.. ఈటల బర్‌బాత్..!
Published on: Sun Sep 5, 2021 1:23PM
టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ. తెలంగాణలో ట్రయాంగిల్ వార్. ప్రగతిభవన్ కోసం మూడు పార్టీల కుమ్ములాట. హోరాహోరీగా వార్. తగ్గేదే లే అంటూ కేసీఆర్‌పై యుద్ధానికి దిగుతున్నాయి ప్రతిపక్షాలు. ఈసారి గులాబీ దండుకు కాషాయదళం గట్టి షాక్ ఇస్తుందనే పొలిటికల్ వెదర్ క్రియేట్ అయింది. దుబ్బాక, జీహెచ్ఎమ్‌సీ జోరుతో మాంచి ఊపు మీదుంది. ఈటల చేరిక.. హుజురాబాద్‌లో కాకతో.. ఇక తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగురుతుందని అనుకున్నారు. ఇక రేవంత్‌రెడ్డి దూకుడుతో కాంగ్రెస్ లో జోష్ పెరిగింది. బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రతో.. బీజేపీ బండిని ముందుకు లాగించేస్తున్నారు. హుజురాబాద్‌ను కొల్లగొట్టి.. ఈటలను అసెంబ్లీకి పంపించి.. కేసీఆర్‌పై తొడగొట్టాలని తెగ ఆరాటపడుతున్నారు.
కట్‌చేస్తే.. కేసీఆర్ కదిపిన ఒక్క పావుతో సీన్ మొత్తం రివర్స్ అయింది. అనుకున్నదొక్కటి అయినది ఇంకొక్కటి అన్నట్లుగా మారిపోయింది. తెలంగాణ బీజేపీ ఇంత గట్టిగా ట్రై చేస్తుంటే.. సింపుల్‌గా సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లి.. ప్రధాని మోదీని, కేంద్రహోంమంత్రి అమిత్‌షా ను కలిశారు. దీంతో సీన్ మొత్తం మారిపోయింది. ఇంతకీ ఢిల్లీలో ఏం జరిగింది? ఈటల ఆగం అయినట్టేనా? ఢిల్లీ రాజకీయం ఇలానే ఉంటుందా? భవిష్యత్ అవసరాల కోసం ప్రస్తుత రాజకీయ ప్రయోజనాలను వదులుకుంటున్నారా? ఆ పొలిటికల్ గేమ్‌లో ఈటల రాజేందర్ బలి పశువుగా మారనున్నారా? అంటే పరిస్థితులు అలానే ఉన్నాయంటున్నారు విశ్లేషకులు.
హుజురాబాద్‌లో ఈటల-బీజేపీ ఫుల్ జోష్ మీదున్నారు. ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ జరిగితే కమలం పార్టీదే గెలుపని అంటున్నారు. అయితే, ఆ ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ అనే దగ్గరే కేసీఆర్ తనదైన మార్క్ రాజకీయం ప్రదర్శించారని అనుమానిస్తున్నారు. ఢిల్లీ వెళ్లిన కేసీఆర్ శనివారం ఉదయం ప్రధాని మోదీని కలిశారు.. ఆ తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యారు. సాయంత్రం ఎన్నికల కమిషన్ నుంచి బెంగాల్, ఒడిషాలో జరగాల్సిన ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. హుజురాబాద్ బై పోల్ మాత్రం వాయిదా పడింది. సీఈసీ ఇచ్చిన బై ఎలక్షన్ జాబితాలో హుజురాబాద్ లేకపోవడం వెనుక కీలక రాజకీయం నడిచిందని అంటున్నారు. కేంద్రం తలుచుకుంటే.. హుజురాబాద్‌కు ఎన్నిక వచ్చుండేది. కేంద్రం అలా తలుచుకోకుండా చేయడంలో కేసీఆర్ సక్సెస్ అయ్యారని అంటున్నారు.
సెప్టెంబర్‌లోనే హుజురాబాద్ ఉప ఎన్నిక అని మొదటి నుంచీ ప్రచారం జరిగింది. ఎన్నికలకు సమయం లేనందనే ఆందోళనతోనే సీఎం కేసీఆర్ ఎలాంటి కసరత్తు లేకుండా హడావుడిగా దళితబంధుకు శ్రీకారం చుట్టేశారు. సెప్టెంబర్‌లోనే ఎన్నికలనే లీకులతోనే కేండిడేట్‌ను కూడా ప్రకటించేశారు. కానీ, ఈ నెలలోనే ఎలక్షన్ జరిగితే ఈటలకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ సర్వేలు తేల్చడంతో.. వెంటనే వ్యూహం మార్చేసి.. ఢిల్లీ వెళ్లేసి.. కేంద్ర పెద్దలను కలిచేసి.. తనదైన స్టైల్‌లో మేటర్ డీల్ చేశారని చెబుతున్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ ఫుల్ జోష్ మీదుంది. రేవంత్‌రెడ్డి దూకుడు ప్రగతిభవన్‌కు దడపుట్టిస్తోంది. ప్రజల్లో రేవంత్ క్రేజ్ మామూలుగా లేదు. రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్ పునర్‌వైభవం దిశగా అడుగులేస్తోంది. ఈ పరిణామం టీఆర్ఎస్ కంటే బీజేపీ ఎదుగుదలకు తీవ్ర విఘాతం అంటున్నారు. కాంగ్రెస్ ఎంత బలపడితే బీజేపీగా అంత నష్టపోతుంది. తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేఖ పవనాలు వీస్తుండటం.. ఆ పార్టీని కలవరపాటుకు గురి చేస్తోంది. బీజేపీ ఏకైక లక్ష్యం.. కాంగ్రెస్ ముక్త్ భారత్.. కాబట్టి ఆ అసలైన టార్గెట్ రీచ్ అవడానికి.. కొన్ని సందర్భాల్లో కాంప్రమైజ్ కాకతప్పని పరిస్థితి. అందుకే, తెలంగాణలో రేవంత్‌రెడ్డి నాయకత్వంలో మళ్లీ ఎమర్జ్ అవుతున్న కాంగ్రెస్‌ను తొక్కేయాలనేది ఢిల్లీ నాయకత్వం వ్యూహం. వారికి కేసీఆర్ కంటే కాంగ్రెస్సే ప్రధాన శత్రువు. కేంద్రానికి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కేసీఆర్ బీజేపీకి మద్దతు ఇస్తారు. కాంగ్రెస్ అలా కాదు. అందుకే, జాతీయ నాయకత్వానికి కేసీఆర్ కంటే రేవంత్‌రెడ్డినే ఎక్కువ టార్గెట్. ఇలాంటి రాజకీయ అవసరాలన్నిటినీ మోదీ, అమిత్‌షాల దృష్టికి తీసుకొచ్చారట కేసీఆర్. భవిష్యత్తులో తనను తమకు ఇష్టం వచ్చినట్టు వాడేసుకోవచ్చని.. ఇప్పటికి మాత్రం ఈటలను తనకు వదిలేయమని చెప్పినట్టు సమాచారం.
తనకు బీజేపీతో వైరం లేకున్నా.. ఈటల రాజేందర్‌తో ఉన్న వ్యక్తిగత వైషమ్యాల దృష్ట్యా ఆయన్ను ఓడించి తీరాల్సిన తప్పనిసరి పరిస్థితులను మోదీ, అమిత్‌షాలకు వివరించారట కేసీఆర్. ఇద్దరం కలిసి కాంగ్రెస్‌ను ఖతం చేద్దాం.. అందుకు ఈటల గెలుపును బీజీపీ వదులుకోవాలని.. హుజురాబాద్ ఉప ఎన్నిక ఇప్పట్లో జరగకుండా సాధ్యమైనంత ఆలస్యం చేయాలనే.. క్విడ్ ప్రోకో డీల్‌కు బీజేపీ-టీఆర్ఎస్ వచ్చిందని చెబుతున్నారు. అందుకే, మోదీ అమిత్‌షాలతో మీటింగ్ తర్వాత వచ్చిన ఈసీ ప్రకటనలో హుజురాబాద్ లేకుండా పోయిందని.. ఆఖరి నిమిషంలో అది జాబితా నుంచి మాయమైపోయిందనేది ఢిల్లీ వర్గాల సమాచారం. ఎన్నిక ఎంత ఆలస్యమైతే ఈటలకు అంత మైనస్.. కారుకు అంత ప్లస్ అనే కేసీఆర్ అంచనా నిజమవుతుందో.. లేక, పెద్దలు ఎలా తలచినా ఓటర్లు మాత్రం బీజేపీనే గెలిపించి ఈటలను అక్కున చేర్చుకుంటారో చూడాలి.


