మళ్లీ ఢిల్లీకి కేసీఆర్ డుమ్మా.. అంతా పీకే డ్రామా!?
Published on: Mon Mar 21, 2022 5:51PM
మళ్లీ తూచ్. కేసీఆర్ ఢిల్లీ వెళ్లట్లేదు. మంత్రులు, ఎంపీలు మాత్రమే హస్తిన పయనమవుతున్నారు. సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్తారంటూ మూడు రోజుల ముందేగానే వార్తలు వచ్చాయి. ప్రధాని మోదీ అపాయింట్‌మెంట్ కోసం ట్రై చేస్తున్నారంటూ ప్రచారం జరిగింది. శనివారం ఫాంహౌజ్‌లో మంత్రులతో మీటింగ్ పెట్టి.. ఢిల్లీపై ఎలా దండెత్తాలో కసరత్తు చేశారు. సోమవారం టీఆర్ఎస్ఎల్పీ మీటింగ్.. అది ముగిశాక నేరుగా ప్రత్యేక విమానంలో మంత్రులతో కలిసి కేసీఆర్ ఢిల్లీ ప్రయాణం. ఇదీ షెడ్యూల్. కానీ... అలా జరగలేదు. కేసీఆర్ హస్తిన వెళ్లట్లేదు. కేవలం తన మంత్రుల బృందాన్ని మాత్రమే హస్తిన పంపిస్తున్నారు. మోదీని కలిసేది లేదు.. ఢిల్లీలో ధర్నాలు, పోరాటాలు ఇప్పట్లో లేవు. మరెందుకు అలా లీకులు ఇచ్చారు? ఎందుకంత బిల్డప్ ఇచ్చారు? అనేది ఆసక్తికరం.
ఇదంతా ప్రశాంత్ కిశోర్ మాస్టర్ ప్లాన్ అంటున్నారు. ఇలా లీకులు ఇవ్వడం పీకే స్టైల్ పాలిటిక్స్. ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్టు చెప్పడం..చేయటం ప్రశాంత్ కిశోర్ ఇస్టైల్. అవును, ఢిల్లీపై కేసీఆర్ దండయాత్ర అంటూ ఇలా బిల్డప్ ఇచ్చిందంతా పీకే డైరెక్షన్‌లోనే అంటున్నారు. శనివారం నాటి ఫాం హౌజ్ మంత్రుల మీటింగ్ కంటే ముందే.. ప్రశాంత్ కిశోర్ అక్కడికి వచ్చి వెళ్లారని.. పీకేతో చర్చ తర్వాతే.. కేసీఆర్ మినిస్టర్లను పిలిపించి మాట్లాడారని.. ఆ తర్వాత ఢిల్లీ-మోదీ-కేంద్రం-కేసీఆర్ ఫైట్ ఇలా వరుసగా వార్తలు వచ్చాయని తెలుస్తోంది.
ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్యం కాస్త ఇబ్బందిగా ఉంది. ఈ పరిస్థితుల్లో ఇప్పటికిప్పుడు ఆయన ఢిల్లీ వెళ్లడం, పోరాడటం.. అంత సీన్ లేనే లేదు. అయినా, కేసీఆర్ హస్తిన వెళ్తారంటూ రాంగ్ ఇన్ఫర్మేషన్ కావాలనే ఇచ్చారు. రైతులు-వరి కొనుగోలు సెంటిమెంట్ రాజేసి.. విషయానికి మరింత హైప్ తీసుకొచ్చేందుకే అలా చేశారని అంటున్నారు. మోదీ అపాయింట్‌మెంట్ కోసం ట్రై చేయకుండానే.. మోదీని కలుస్తారంటూ ప్రచారం చేశారు. ఇక, ఢిల్లీ వెళ్లాల్సిన టైమ్ రాగానే.. తూచ్ అంటూ సైడ్ అయిపోయారు. కేవలం మంత్రులు, ఎంపీలను మాత్రమే హస్తిన పంపిస్తున్నారు. ఇదంతా ప్రశాంత్ కిశోర్ స్ట్రాటజీ. కేసీఆర్ పీకే ఆడించినట్టు ఆడుతున్న ముఖ్యమంత్రి...అంటున్నారు.


