హుజుర్‌నగర్ టీఆర్ఎస్ అభ్యర్థి ఖరారు.. కవిత కాదు!!

 

నల్లగొండ జిల్లా హుజుర్‌నగర్‌ అసెంబ్లీ స్థానానికి అక్టోబర్‌ 21న ఉప ఎన్నిక జరగనుంది. మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు.. దేశవ్యాప్తంగా పలు స్థానాల్లో అక్టోబర్‌ 21న ఉప ఎన్నికలు జరగనున్నాయని తాజాగా కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ సునీల్‌ ఆరోరా ప్రకటించారు. అలా ఉప ఎన్నికల ప్రకటన వచ్చిందో లేదో అధికార పార్టీ టీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించింది. హుజుర్‌నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి టీఆర్ఎస్ అభ్యర్థిగా శానంపూడి సైదిరెడ్డి పేరును టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించారు. కాగా.. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో శానంపూడి సైదిరెడ్డి హుజుర్‌నగర్‌ నుంచి టీఆర్‌ఎస్‌ తరపున పోటీ చేసి ఓటమి పాలైన సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో ఆయనకే మరోసారి కేసీఆర్ అవకాశమిచ్చారు. నిజానికి ఉప ఎన్నిక పోరులో కవిత బరిలోకి దిగుతారని ప్రచారం జరిగింది. 2019 లోక్ సభ ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసి కవిత ఓడిపోయిన సంగతి తెలిసిందే. దీంతో కవిత హుజుర్ నగర్ ఉపఎన్నిక బరిలో దిగుతారని భావించారంతా. కానీ కేసీఆర్ ఎందుకనో సైదిరెడ్డికే మరోసారి అవకాశమిచ్చారు. 
 
2018 అసెంబ్లీ ఎన్నికల్లో హుజుర్‌నగర్‌ అసెంబ్లీ స్థానానికి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందగా.. ఆ తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో నల్లగొండ ఎంపీ స్థానానికి పోటీ చేసి విజయం సాధించారు. దీంతో ఆయన ఎమ్మెల్యేగా రాజీనామా చేయడంతో.. ఉప ఎన్నిక జరుగుతుంది.