TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జగన్ జాతకం చెప్పిన కేసీఆర్..

Published on: Fri Jul 28, 2017 11:11AM

 

ఏపీ రాజకీయ పరిస్థితులపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. మొదటి నుంచి జగన్‌ వైపు కొంచెం మొగ్గుచూపించే కేసీఆర్‌... మరోసారి వైసీపీకి అనుకూలమైన వ్యాఖ్యలు చేశారు. 2014 సాధారణ ఎన్నికల ఫలితాలకు ముందు కూడా ఏపీలో వైసీపీనే అధికారంలోకి వస్తుందంటూ... జగన్‌‌పై తనకున్న మక్కువను చాటుకున్న కేసీఆర్‌... ఈసారి కూడా అలాంటి కామెంట్సే చేశారు. ఏపీలో ప్రస్తుతం వైఎస్సార్‌సీపీకి కొంచె ఎడ్జ్‌ ఉందని చెప్పుకొచ్చారు. ఓ సర్వే మిత్రుడు చెప్పిన వివరాల మేరకు వైసీపీకి 45శాతం ఓట్లు వస్తాయని తెలిసిందన్నారు. అధికార టీడీపీకి 43శాతం, అలాగే బీజేపీకి 2.6శాతం ఓట్లు వస్తాయని ఆ సర్వేలో తేలిందన్నారు.

 

ఇక వచ్చే ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తాడని భావిస్తున్న పవన్‌ కల్యాణ్‌కి అంత సీన్‌ లేదని, జనసేన ప్రభావం ఏపీలో ఉండబోదని కేసీఆర్‌ తేల్చిచెప్పేశారు. జనసేనకు ఒకటి... ఒకటిన్నర శాతం కంటే ఎక్కువ ఓట్లు రావన్నారు. పవన్‌ చేతులూపితే ఓట్లు రాలవన్న కేసీఆర్‌... చిరంజీవి ప్రజారాజ్యం విషమంలో ఏం జరిగిందో... అలాగే జనసేన పరిస్థితి కూడా ఉంటుందంటున్నారు. ఏ పార్టీకైనా బేస్‌ ఉండాలన్న కేసీఆర్‌... ఆ పరిస్థితి జనసేనకు లేదన్నారు. ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్‌ ఉన్నచిరంజీవి లాంటి వ్యక్తే పార్టీని నడపలేక... కట్టెలమోపులాగా బరువు దించుకున్నారని... ఓ లక్ష్యం లేకపోతే ఎవరికైనా ఇలాగే జరుగుతుందన్నారు. తాను ఓ లక్ష్యంతో పద్నాలుగేళ్లు పార్టీని నడుపుతూ... ఉద్యమం చేయబట్టే నిలబడగలిగానని కేసీఆర్‌ చెప్పుకొచ్చారు.

 

ఇక ఏపీలో కుల రాజకీయాలపైనా కేసీఆర్‌ కీలక వ్యా‌ఖ్యలు చేశారు. తెలంగాణతో పోల్చితే ఆంధ్రప్రదేశ్‌లో కుల రాజకీయాలే ప్రధాన పాత్ర పోషిస్తాయన్నారు. తెలంగాణలో కుల రాజకీయాలు లేవన్న కేసీఆర్‌.... ప్రజా సమస్యలు, అంశాలవారీగానే ఎన్నికలు జరుగుతాయన్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఢోకా లేదన్నారు.