ఏపీకి వందకు వంద శాతం వెళ్తా: కేసీఆర్

 

శాసనసభ పక్ష నాయకునిగా టీఆర్ఎస్ పార్టీ నేతలు కేసీఆర్‌ను ఏకపక్షంగా ఎన్నుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాను చేయాల్సిన పనిచేయకుండా అధికారాలు పెట్టుకొని రాష్ట్రాలపై పెత్తనం చేస్తోందని, ఇదే అభిప్రాయం చాలా రాష్ట్రాలు, పార్టీల్లో ఉందని విమర్శించారు. రూరల్‌, అర్బన్‌ డెవలప్‌మెంట్‌, వైద్యం, విద్య కేంద్రం తన దగ్గర ఉంచుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. దేశానికి కొత్త ఆర్థిక విధానం, కొత్త వ్యవసాయం విధానం అవసరమని, మూస వ్యవసాయ విధానం పోవాలని ఆయన అభిప్రాయపడ్డారు.

కాంగ్రెస్‌ జాతీయ పార్టీ అని చెప్పుకుంటుంది.. కానీ రాష్ట్రానికో పాలసీ ఉంటుందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌, బీజేపీది పచ్చి రాజకీయ అవకాశం వాదమని ఆరో్పించారు. బీజేపీ, కాంగ్రెస్‌ లకు తేడా లేదని.. దొందూ దొందేనని ఎద్దేవా చేశారు. కొత్త మోడల్ దేశానికి అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఆ ప్రయత్నం దేశ రైతాంగం తరపున తాను చేస్తానని అన్నారు. వీలైనంత త్వరగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామన్నారు. జర్నలిస్టులకు అన్ని రకాలుగా మేలు చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు.

తెలంగాణ కోసం కొట్లాడిన పార్టీగా టీఆర్‌ఎస్‌ను ప్రజలు ఆదరించారని కేసీఆర్ అన్నారు. నాలుగేళ్ల పాలన మమ్మల్ని తిరిగి గెలిపించిందని అన్నారు. చేసిన పని సిన్సియర్‌గా చేశామని, దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు తీసుకొచ్చామన్నారు. రాష్ట్రంలో కోటి మందికి కంటి వెలుగు పరీక్షలు నిర్వహించామని చెప్పారు. ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకుంటుదన్న భావన ప్రజల్లో వచ్చిందని, పేదలకు కేసీఆర్‌ కిట్‌, కళ్యాణలక్ష్మి పథకాలు ఎంతో ఉపయోగపడ్డాయని కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణలో బాల్య వివాహాలు జరగడం లేదన్నారు. అన్ని వర్గాల ప్రజల్లో సమానమైన ఆదరణ కనిపించిందని కేసీఆర్ అన్నారు.

మేనిఫెస్టోలో ప్రకటించిన అంశాలను వందకు వంద శాతం అమలుపరిచిన ప్రభుత్వం టీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని కేసీఆర్ పేర్కొన్నారు. ఈ విషయంలో తాము ఎవరితోనైనా, ఏ ఛాలెంజ్‌కైనా సిద్ధమేనని సవాల్ విసిరారు. తాము ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఏం చేస్తామని చెప్పామో వంద శాతం అది చేశామని, మేనిఫెస్టోలో లేని ప్రజలకు ఉపయోగపడే 76 అంశాలను కూడా అమలుపరిచిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు. బీడీ కార్మికుల పెన్షన్ తమ మేనిఫెస్టోలో లేదని, కానీ మంజూరు చేశామని తెలిపారు. ఎన్నికల ముందు రైతుబంధు చెప్పలేదని.. ఆయినా చేశామన్నారు. కొంతమంది కావాలనే ఇంటికో ఉద్యోగం ఇస్తామని తాము చెప్పినట్లు ప్రచారం చేశారని.. తాను కానీ, తమ పార్టీ కానీ ఆ మాట అనలేదని కేసీఆర్ చెప్పారు. ఉద్యోగాలు కల్పిస్తామని మాత్రమే చెప్పామని, ఆంధ్రా వాళ్లు వెళ్లిపోతే వచ్చే ఖాళీలు మనకొస్తాయని చెప్పామని కేసీఆర్ తెలిపారు.

కోర్టు ఆదేశాల ప్రకారం పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తాం. రానున్న పంచాయతీ ఎన్నికలకు సమాయత్తం కావాలని ఎమ్మెల్యేలకు సూచించాం అని తెలిపారు. ఫెడరల్‌ ఫ్రంట్ వస్తే దేశవ్యాప్తంగా రైతుబంధు పథకాన్ని అమలు చేస్తాం అన్నారు. దీనికోసం మూడున్నర లక్షల కోట్లు ఖర్చవుతుంది. తాము వచ్చాక కచ్చితంగా చేస్తాం అని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో 29.9శాతం ఆర్థికవృద్ధి ఉంది. దేశంలో ఏ రాష్ట్రమూ తెలంగాణకు దరిదాపుల్లో లేదు. రూ.70వేల కోట్లతో రాష్ట్రంలోని ప్రాజెక్టులు పూర్తవుతాయి. అప్పులు చేశామని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. పూర్తి అవగాహనతోనే ప్రాజెక్టులకు ఖర్చు చేస్తున్నాం అని స్పష్టం చేశారు. తమకంటే ముందు 60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్‌, టీడీపీలు ఎన్ని ఉద్యోగాలిచ్చాయి? నిరుద్యోగులను మోసం చేసి కనీసం ఐదులక్షల ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేకపోయారు అని విమర్శించారు. ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయో.. వాటిని త్వరలోనే భర్తీ చేస్తాం అని స్పష్టం చేశారు.

ఏపీ ప్రత్యేక హోదాపై చంద్రబాబుకే క్లారిటీ లేదని కేసీఆర్‌ విమర్శించారు. ప్రత్యేక హోదాతో వచ్చేది ఏముందని పెద్ద పెద్ద డైలాగులు కొట్టారని, హోదా విషయంలో బాబు మూర్ఖంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. ప్రత్యేక హోదా అడిగేవాళ్లు మూర్ఖులని చంద్రబాబు అన్నారని, ఇప్పుడు ఆయనే హోదా అడుగుతున్నారని వ్యాఖ్యానించారు. ఆంధ్రాకు రమ్మని తనను పిలుస్తున్నారని.. వందలు, వేల సంఖ్యలో ఆహ్వానాలు అందుతున్నాయని అన్నారు. త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌కు వందకు వంద శాతం వెళ్తానని కేసీఆర్ స్పష్టం చేశారు.