ఓటుకు నోటు కేసు.. మళ్ళీ తెరమీదకు?

 

ఓటుకు నోటు కేసు.. అందరికీ గుర్తుండే ఉంటుంది. అప్పట్లో సంచలనం సృష్టించింది. రేవంత్ రెడ్డి అరెస్ట్, బెయిల్.. చంద్రబాబు పేరు.. ఇలా మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లో బాగానే హాట్ టాపిక్ అయింది. అయితే ఇన్నిరోజులు సైలెంట్ గా ఉన్న ఈ కేసు మళ్ళీ తెరమీదకు రాబోతున్నట్టు తెలుస్తోంది. దానికి కారణం తెలంగాణ రాజకీయాలట. తెలంగాణలో ప్రస్తుతం ముందస్తు వేడి మొదలైంది. అధికారం మళ్ళీ తమదే అనే నమ్మకంతో ముందస్తుకు సిద్దమైన కేసీఆర్ కు.. మహాకూటమి రూపంలో బలమైన ప్రత్యర్థి తయారైంది. భారీ సంఖ్యలో నాయకులతో నిండిపోయిన కాంగ్రెస్ కు కేడర్ కూడా బలంగానే ఉంది. ఇప్పుడు ఈ బలానికి.. నాయకులు అంతగా లేకపోయినా, కేడర్ బాగానే ఉన్న టీడీపీ బలం తోడైంది. అదీగాక ఏపీ సీఎం చంద్రబాబు కూడా తెలంగాణ మీద దృష్టి పెట్టారు. కేసీఆర్ ని గద్దె దించాలని, టీడీపీని వీడిన వారిని తిరిగి పార్టీలోకి తీసుకొచ్చి పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలని వ్యూహాలు రచిస్తున్నారు. ఇదే ఇప్పుడు కేసీఆర్ కు మింగుడుపడని విషయం. ఇన్నాళ్లు తమ గెలుపుని కాంగ్రెస్ ఆపలేదు, మళ్ళీ అధికారం మాదే అని కేసీఆర్ ధీమాగా ఉన్నారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ కు టీడీపీ తోడై.. అధికారం దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది. చంద్రబాబు వ్యూహాలు రచించడంలో దిట్ట. అందుకే ఇప్పుడు చంద్రబాబు దృష్టిని మరల్చేందుకు ఈ ఓటుకు నోటు కేసును తెరమీదకు తీసుకువస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.

 

 

అప్పట్లో స్టీఫెన్సన్ కు 50 లక్షలు ఇచ్చి మరో 4.5 కోట్లు ఇస్తామని రేవంత్ రెడ్డి చెప్పిన వీడియో బయటికొచ్చింది. అయితే మిగిలిన 4.5 కోట్ల రూపాయలు ఎక్కడ నుంచి వచ్చాయి?.. ఎక్కడ ఉన్నాయో తేల్చాల్సిందిగా తెలంగాణకు చెందిన పోలీసు ఉన్నతాధికారులు ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ (ఈడీ)తో పాటు కేంద్ర సంస్థలను కోరుతూ లేఖ రాసినట్లు సమాచారం. నిజంగా లేఖ రాశారా?.. ఒకవేళ రాసినా.. ఆ 4.5 కోట్లు అనేది కేవలం ఒప్పందం. దానికి సంబంధించిన లావాదేవీ జరగలేదు. తెరపైన కనిపించిన 50 లక్షల గురించి ఆల్రెడీ కోర్టులో విచారణ జరుగుతుంది. మరి అసలు లావాదేవినే జరగని ఆ 4.5 కోట్లు గురించి సిబిఐ, ఈడీ లాంటి విభాగాలు రంగంలోకి దిగుతాయా ? అంటే అనుమానమే. అసలు కొందరైతే ఓటుకు నోటు కేసు మళ్ళీ తెరమీదకు రావడమే అనుమానం అంటున్నారు. కేసీఆర్ ముందస్తు అంటూ 105 అభ్యర్థులను ప్రకటించారు. ఓ వైపు అసంతృప్తులను బుజ్జగిస్తూ, మరోవైపు గెలుపు కోసం వ్యూహాలు రచిస్తూ బిజీగా ఉన్నారు. అదీగాక ఇప్పటికే జగ్గారెడ్డి అరెస్ట్, రేవంత్ రెడ్డికి నోటీసులు తెరాస కక్ష్య సాధింపు రాజకీయాలంటూ ఆరోపణలు వస్తున్నాయి. మరి ఇలాంటి సమయంలో మళ్ళీ ఓటుకు నోటు కేసు తోడుతుందా? కష్టమే. అసలే ముందస్తు, గెలుపు, అసంతృప్తులు, బుజ్జగింపులు వంటి వాటితో బిజీగా ఉన్నారు.

కొందరేమో ఇదంతా కేంద్రం, తెరాస వెనుక ఉండి నడిపిస్తుంది అంటున్నారు. అయితే కొందరు దీన్ని కూడా కొట్టేస్తున్నారు. అసలే కేంద్రం రాఫెల్ డీల్ వివాదంతో తలలుపట్టుకుంటుంది. ఇలాంటి సమయంలో బలమైన నేత, వ్యూహాలతో దిట్ట అయిన చంద్రబాబుని టచ్ చేసే సాహసం బీజేపీ చేయదనే అంటున్నారు. మరి ఓటుకు నోటు కేసు నిజంగానే తెరమీదకు వస్తుందా? ఇది తెరాస ప్లానా? లేక బీజేపీ వెనకుండి నడిపిస్తుందా? అసలు ఇవన్నీ ఫేక్ కోర్ట్ విచారణలో ఉన్న కేసుని మళ్ళీ తెరమీదకు తీసుకురావడం ఏంటి అంటారా? ఏంటో ఇవన్నీ ఆ పై వాడికే తెలియాలి.