కేసీఆర్, కేటీఆర్ లకు ఓటమి భయం పట్టుకుందా?

 

లోపల భయపడిపోతూ పైకి మనం ఎంత ధైర్యంగా నటించినా ఏదో ఒక సందర్భంలో మన భయం బయటపడుతుంది. ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ పరిస్థితి కూడా అలానే ఉందనే అభిప్రాయం కూటమి పార్టీల నుంచి వ్యక్తమవుతోంది. అసెంబ్లీ రద్దు సమయం నుంచి తమ పార్టీ వంద సీట్లు గెలుచుకొని తిరిగి అధికారంలోకి వస్తుందంటూ టీఆర్ఎస్ చెప్తూ వచ్చింది. ముఖ్యంగా కేసీఆర్, కేటీఆర్.. వంద సీట్లు పైనే గెలుస్తామని బల్లగుద్ది మరీ చెప్పారు. ఆ సమయంలో దాదాపు అందరూ.. టీఆర్ఎస్ వంద సీట్లు గెలవడం కష్టం కానీ.. అధికారంలోకి రావడం మాత్రం ఖాయమనే అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే ఎప్పుడైతే కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ పార్టీలు మహాకూటమిగా ఏర్పడ్డాయో ఒక్కసారిగా అంచనాలు తారుమారయ్యాయి. వార్ వన్ సైడ్ కాదు.. టీఆర్ఎస్ కు మహాకూటమితో నువ్వా నేనా అన్నట్టు పోరు తప్పేలా లేదనే అభిప్రాయం వ్యక్తమైంది. కొన్ని సర్వేలు అయితే మహాకూటమిదే పైచేయి అని తేల్చాయి. దీనికితోడు ప్రచారానికి వెళ్తున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులకు నిరసన సెగలు. దీంతో ప్రజల్లో క్రమక్రమంగా మహాకూటమి కూడా అధికారంలోకి రావొచ్చనే అభిప్రాయం మొదలైంది. అంతేకాదు ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే కేసీఆర్, కేటీఆర్ లకు ఓటమి భయం పట్టుకుందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

ఎన్నికల వేడి మొదలైన తరువాత కేటీఆర్ ఒక మాట పదేపదే చెప్తున్నారు. అదే 'టీఆర్ఎస్ ఒంటరిగా అధికారంలోకి రాకపోతే.. రాజకీయ సన్యాసం తీసుకుంటా, అమెరికా వెళ్ళిపోతా'. కేటీఆర్ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ శ్రేణులు అది ఆయనకి గెలుపుపై ఉన్న ధీమా అని సమర్ధించుకుంటున్నా.. కూటమి నేతలు మాత్రం విమర్శలు గుప్పిస్తున్నారు. కేటీఆర్ కి ఓటమి భయం పట్టుకుంది కాబట్టే ఓడిపోతే రాజకీయాలు వదిలేస్తా, అమెరికా వెళ్ళిపోతా అంటున్నాడు అంటూ విమర్శించారు. మరికొందరైతే గెలిచినా, ఓడిపోయినా ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేసే నాయకులు కావాలి కానీ.. ఓడిపోతే వదిలేసి విదేశాలు పోయే నాయకులు ఎందుకంటూ ఘాటుగా విమర్శిస్తున్నారు. ఇప్పుడు ఇలాంటి విమర్శల వర్షమే కేసీఆర్ మీద కూడా మొదలైంది.

కేసీఆర్ మొన్నటి వరకు వంద సీట్లు గెలుస్తాం, మళ్ళీ తమదే అధికారమని ధీమా వ్యక్తం చేస్తూ.. కూటమి నేతల మీద విమర్శల వర్షం కురిపించారు. అయితే తాజాగా కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు మాత్రం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. 'వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఓడిపోతే.. నాకొచ్చే నష్టం పెద్దగా ఏమీ లేదు. గెలిపిస్తే గట్టిగా పని చేస్త. లేకుంటే ఇంటికాడ రెస్ట్‌ తీసుకుంటా. వ్యవసాయం చేసుకుంటా' అని కేసీఆర్ అన్నారు. దీంతో కేటీఆర్ లాగే కేసీఆర్ కి కూడా ఓటమి భయం పట్టుకుందంటూ విమర్శలు మొదలయ్యాయి. కూటమి గెలుస్తుందని అర్ధమయ్యే కేసీఆర్.. ఓడిపొతే ఇంటికాడ రెస్ట్ తీసుకుంటా అంటున్నారు అంటూ కూటమి నేతలు విమర్శిస్తున్నారు. ఇలా ఓడిపోతే అమెరికా పోయేవాళ్లు, రెస్ట్ తీసుకునేవాళ్లు తెలంగాణకు అవసరమా అంటూ గట్టిగానే విమర్శలు వినిపిస్తున్నాయి.

అసెంబ్లీ రద్దు సమయంలో వంద సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేసి విపక్షాలకు భయం పుట్టించిన కేటీఆర్, కేసీఆర్.. ఇప్పుడు 'ఓడిపోతే అమెరికా వెళ్ళిపోతా, ఓడిపోతే ఇంట్లో రెస్ట్ తీసుకుంటా' అంటూ విపక్షాలకు అస్త్రాలు అందించారు. మరి టీఆర్ఎస్ శ్రేణులు చెప్తున్నట్టు వారు కాన్ఫిడెన్స్ తో ఆ మాటలు అన్నారో లేక కూటమి నేతలు చెప్తున్నట్టు ఓటమి భయంతో ఆ మాటలు అన్నారో తెలియాలంటే డిసెంబర్ 11 వరకు వేచి చూడాల్సిందే. చూద్దాం ఏం జరుగుతుందో.