కేసీఆర్‌కు గద్దర్, కోదండరామ్‌ల డ్యామేజ్ తప్పదా?

ఒకవైపు ఏపీ రాజకీయాలు నిత్యం హాట్ హాట్ గా నడుస్తున్నాయి. ఓ సారి పవన్, చంద్రబాబు ఫైట్, మరోసారి చంద్రబాబు, జగన్ మాటల యద్ధం, ఇవేవీ కాకపోతే, ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంపై పోరాటాలు… ఇలా రోజూ ఆసక్తికరంగానే సాగిపోతోంది ఆంధ్రా వ్యవహారం. కానీ, తెలంగాణలో కాస్త భిన్నమైన వాతావరణం వుంది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ సభలు, సమావేశాలు, ప్రెస్ మీట్లు ఎన్ని ఏర్పాటు చేసినా అధికార పక్షంపై దుమారం రేగేలా కామెంట్లు చేయలేకపోతోంది. టీ కాంగ్ అద్యక్షుడు ఉత్తమ్ సహా అందరూ కేసీఆర్ ని, ఆయన పథకాల్ని టార్గెట్ చేస్తున్పప్పటికీ మీడియాలో, జనంలో పెద్ద చర్చకు దారి తీయటం లేదు. దీనికి ప్రధానమైన కారణం… ఏపీలో వున్నట్టుగా చంద్రబాబు, జగన్, పవన్ వంటి వ్యక్తుల చుట్టూ తెలంగాణలో రాజకీయం లేదు! కేసీఆర్ తో సమానమైన ఛర్మిష్మా గల నేత కాంగ్రెస్ లో కనిపించటం లేదు. అలాగే, ఎవరు సీఎం క్యాండిడేటో తెలియని స్థితిలో … పూర్తిగా దిల్లీ అదుపు, ఆజ్ఞాల్లో టీ కాంగ్రెస్ పని చేయాలి. కానీ, కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు ప్రత్యక్ష నాయకత్వంలో ప్రాంతీయ పార్టీ అయిన తెరాస దూసుకుపోతోంది. ఇదే పోటీలో సమతుల్యం దెబ్బతినేలా చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, వైసీపీ రెండూ ప్రాంతీయ పార్టీలు కావటంతో పరిస్థితి నువ్వా, నేనా అన్నట్టు వుంటోంది.

 

 

ఇప్పుడు పరిస్థితి ఎలా వున్నా… కనీసం వచ్చే ఎన్నికల తరువాతైనా తెలంగాణలో అధికార మార్పు వుంటుందా? కాస్త రాజకీయ అవగాహన వున్న వారు ఎవరైనా తెలంగాణ కాంగ్రెస్ అంత ఈజీగా కేసీఆర్ ని గద్దె దించలేదని చెప్పేస్తారు. అందుకు తగిన కారణాలు కూడా వున్నాయి. కేసీఆర్ వైఫల్యాలు అడపాదడపా కాంగ్రెస్ నాయకులు మీడియా ముందు చెబుతోన్నా గట్టిగా జనంలోకి తీసుకెళ్లలేకపోతున్నారు. పైగా రైతులకి ముఖ్యమంత్రి ఎకారానికి ఇంతంటూ డబ్బులు ఇవ్వటం, బీమా కల్పించటం, కొన్ని వర్గాలకి గొర్రెలు, బర్రెలు వంటివి పంపిణీ చేయటం లాంటివి చేస్తూ కులాల వారీగా ఆకట్టుకుంటున్నారు. మైనార్టీల్ని కూడా మతపరమైన సంతుష్టీకరణ చేస్తూ పట్టిపెడుతున్నారు. కేసీఆర్ చాణక్యానికి టీ కాంగ్ వద్ద పెద్దగా ఎదురు సమాధానాలు లేవు. ఇక బీజేపీ లాంటి ఇతర ప్రతిపక్షల సంగతైతే మరీ దయనీయం. వారు కూడా ఎలాంటి ప్రతిఘటన చూపటం లేదు. ఈ సమయంలో జనంలో కొంత ఆసక్తి రేపుతున్న వారు ఇద్దరున్నారు! వారే… కోదండ రామ్, గద్దర్!

 

 

కోదండరామ్ ఇప్పటికే తెలంగాణ జన సమితి పెట్టేశారు. ఆ మద్య సభలు, సమావేశాలు, నిరసనలు చేసి అందరి దృష్టినీ ఆకర్షించారు. కేసీఆర్ కూడా ముందు జాగ్రత్తగా ఆయన ప్రయత్నాల్ని గట్టిగా ఎదుర్కొన్నారు. స్వయంగా కోదండరామ్ ని విమర్శించారు కూడా. ఇక ఇప్పుడు గద్దర్ రంగంలోకి దిగబోతున్నట్టు ప్రకటించారు. లెఫ్ట్ పార్టీలు ఏర్పాటు చేసిన బహుజన ఫ్రంట్ మీటింగ్ లో ఆయన ఓట్ల రాజకీయం వైపు తాను రాబోతున్నానని సంకేతాలిచ్చారు. ఇది ఒక విధంగా పెద్ద వార్తే! గద్దర్ లాంటి వ్యక్తులు కేసీఆర్ కు వ్యతిరేకంగా మాట్లాడితే ఓటర్లపై ఖచ్చితంగా ప్రభావం వుంటుంది. కానీ, ఎంత అనేదే పెద్ద ప్రశ్న. ఓట్ల రాజకీయాల్ని వ్యతిరేకించే నక్సల్ వాదిగా గద్దర్ ఇంత కాలం కొనసాగారు. కానీ, ఇప్పుడు ఆయనే ఓట్ల కోసం జనంలోకి వెళతానని అంటున్నారు. లాల్, నీల్ కలయిక అంటూ మాట్లాడారు. లెఫ్ట్ తో దళితులు కలవాలని ఆయన కోరుకుంటున్నారు. ఇదంతా కేసీఆర్ కు ఎంత వరకూ నష్టం చేయగలదు?

 

 

కోదండరామ్ అయినా, గద్దర్ అయినా నిజాయితీ విషయంలో మచ్చ లేని వారు. వాళ్లని జనం నమ్ముతారు. కానీ, మందు, బిర్యానీ, కులం, మతం ప్రధానంగా జరుగుతుంటాయి మన ఎన్నికలు. వాటిలో వీరికి మన ఓటర్లు ఎంత ప్రాముఖ్యత ఇస్తారో అనుమానమే! చాలా మంది ఓట్ల పోరాటంలో ఓడిపోయిన ఉద్యమకారుల విషయంలో ఇది గతంలో జరిగింది కూడా. లక్షలాది జనం తరలి వచ్చే ఉద్యమకారులకి ఓట్లు మాత్రం అంత తేలిగ్గా పడవు. అందుకు బోలెడు కారణాలు. ప్రధానమైంది ఎన్నికల సమయంలో జరిగే మనీ మ్యానేజ్మెంట్. ఆ విషయంలో గద్దర్ వ్యతిరేకిస్తున్న కేసీఆర్, మోదీ ఇద్దరూ సిద్ధహస్తులే! మరి ఇటువంటి సమయంలో కేసీఆర్ ని కట్టడి చేయాలని నిజంగా గద్దర్, కోదండరామ్ అనుకుంటే ఏం చేయాలి?

 

 

కోదండరామ్, గద్దర్లే వేరు వేరు వేదికల ద్వారా ఎన్నికలకి వెళుతున్నారు. ఇక ఎప్పుడూ టీఆర్ఎస్ కి వ్యతిరేకంగా వుండే కాంగ్రెస్, బీజేపీలు వుండనే వున్నాయి. ఇలా ప్రతిపక్షంలో ఎందరు ఎక్కువై ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిస్తే కేసీఆర్ కు అంత ఆనందం! ఆయనకు వచ్చే సీట్లు మరింతగా పెరుగుతాయి. ఇది తెలియనంత అమాయకులు కాదు గద్దర్, కోదండరామ్, కాబట్టి వారిద్దరూ టీఆర్ఎస్, బీజేపీలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ తో జతకట్టి ముందుకు సాగితేనే కొంతైనా ఫలితం రాబట్టగలిగే అవకాశం వుంటుంది. టీ కాంగ్రెస్ కూడా గద్దర్, కోదండరామ్ లాంటి వార్ని తమతో కలుపుకుని ముందుకు పోయే పరిపక్వత చూపాలి. అలాంటిదేం ఇంత వరకూ కనిపించలేదు. ఇదే పరిస్థితి కొనసాగితే… ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలటం ద్వారా … గద్దర్, కోదండరామ్ ల ప్రచారం అంతా కేసీఆర్ కు వరంగా మారే ప్రమాదముంది!