TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కేసీఆర్ కు మోడీ కండీషన్.. అందుకే పంపలేదా...!

Published on: Mon Apr 16, 2018 3:44PM

 

ఏపీ ప్రత్యేక హోదా పోరాటంలో టీఆర్ఎస్, అన్నాడీఎంకే పార్టీలు ఆడిన రాజకీయ డ్రామా అందరూ గమనించారు. ఒక పక్క ఏపీకి ప్రత్యేక హోదా కావాలంటూ ఏపీ ఎంపీలందరూ పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టి.. కేంద్రానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం కూడా పెట్టారు. కానీ అవిశ్వాస తీర్మానం మాత్రం చర్చకు రాలేదు. ఈ అవిశ్వాస తీర్మానం చర్చకు రాకపోవడంలో టీఆర్ఎస్, అన్నాడీఎంకే పార్టీలు కీలక పాత్ర పోషించాయనుకోండి. రిజర్వేషన్ల శాతాన్ని పెంచాలని ఓ పక్క టీఆర్ఎస్ ఎంపీలు... కావేరి బోర్డు యాజమన్యం ఏర్పాటుపై అన్నాడీఎం నేతలు నిరసన చేస్తూ డ్రామాలాడి ఆఖరికి ఏపీ ప్రత్యేక హోదా అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా చేశాయి. అయితే ఆపార్టీల వెనుక బీజేపీ ఉందని... కేంద్ర ప్రభుత్వమే వారిచేత ఇలా చేయించిందన్న వార్తలు కూడా వచ్చాయి.

 

ఇక ఆతరువాత ఇటీవల దక్షిణ రాష్ట్రాలు ఏర్పాటు చేసిన సమావేశానికి ఈ రెండు పార్టీలు రానని చెప్పడంతో ఈ వార్తలు నిజమే అని అభిప్రాయపడ్డారు.  కేంద్రప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తుందని... కేరళలో దక్షిణాది రాష్ట్రాల ఆర్థికమంత్రుల సమావేశం ఏర్పాటు చేసింది. కానీ ఈ సమావేశానికి ఈ రెండు రాష్ట్రాల అర్ధిక మంత్రులు మాత్రం మేం రావట్లేదని చెప్పారు. అంతేకాదు.. ఇటువంటి సమావేశాలు దేశసమగ్రతకు విఘాతం కలిగిస్తాయని అందుకే తాము పాల్గొనమని కేసీఆర్ ప్రకటించారు. అయితే కేసీఆర్ బయటకు అలా చెప్పినా... అసలు నిజం మాత్రం వేరే ఉందన్న వార్తలు ఇప్పుడు తాజాగా బయటకు వచ్చాయి. అదేంటంటే... తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే రైతు పెట్టుబడి సాయం చెక్కులకు గాను నగదు అందుబాటులో ఉంచడానికి గాను కేంద్రం ఈ షరతు పెట్టిందట. దాంతో కేసీఆర్ ఆ సమావేశానికి వెళ్లకూడదని నిర్ణయించుకున్నారట. ఆ తర్వాత రిజర్వు బ్యాంక్ తెలంగాణ బ్యాంకులకు రెండువేల కోట్ల రూపాయల నగదును మంజూరు చేసిందట. మొత్తానికి టీఆర్ఎస్ వెనుక అసలు నిజం ఏంటో తెలిసిపోయింది. మరి ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెబుతారో చూడాలి. ఈసారి దక్షిణాది రాష్ట్రాల ఆర్థికమంత్రుల తరువాతి సమావేశం ఆంధ్రప్రదేశ్ లో జరగబోతుంది. ఈ సమావేశానికైనా వస్తారా.. లేక..? దీనికి డుమ్మా కొడతారా..? చూద్దాం ఏం జరుగుతుందో...