తెలంగాణ ప్రభుత్వంపై చైనా సీరియస్... గొప్పలే.. విషయం లేదు..

 

పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్న సామెత వినే ఉంటారు. ఇప్పుడు ఈ సామెత తెలంగాణ ప్రభుత్వానికి సరిగ్గా సూటవుతుందని చెప్పొచ్చు. ఎంతసేపు మేము అది చేశాం.. ఇది చేశాం.. మా కంటే తోపులు ఎవ్వరూ లేరని చెప్పుకునే తెలంగాణ ప్రభుత్వానికి ఓ ఎదురుదెబ్బ తగిలింది. అది కూడా ఏదో సొంత రాష్ట్రం నుండో.. లేక పక్క రాష్ట్ర నుండో కాదు.. ఏకంగా పక్క దేశమే తెలంగాణ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు సంగతేంటంటే... ఉమ్మడిగా ఉన్న రాష్ట్రం రెండుగా విడిపోయిన తరువాత..తెలంగాణలో కేసీఆర్, కేటీఆర్.. ఏపీలో చంద్రబాబు, లోకేశ్ విదేశీ పెట్టుబడులు రాష్ట్రంలోకి తెప్పిచడానికి తెగ ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఏ ప్రాంతాలు అనుకూలంగా ఉంటాయో ఆ ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టడానికి విదేశాలు మొగ్గుచూపుతున్నాయి.

 

ఈ నేపథ్యంలోనే తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు చైనా ముందుకొచ్చింది. దీనిలోభాగంగానే....  చైనా నుంచి పారిశ్రామికవేత్తలు.. పెట్టుబడిదారులు.. ఉన్నతస్థాయి ప్రతినిధుల బృందం మూడు రోజులు పర్యటించేందుకు హైదరాబాద్ కు వచ్చారు. బంజారాహిల్స్ లోని రాడిసన్ బ్లూ హోటల్లో చైనా పారిశ్రామికవేత్తలతో వ్యాపార సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ.. ఐటీ.. పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ రావాల్సి ఉంది. రాత్రి ఏడు గంటలకు కార్యక్రమం స్టార్ట్ కావాల్సి ఉన్నా.. 8 గంటల వరకూ వెయిట్ చేయాల్సి వచ్చింది. అయినా రాకపోవటంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు లేకుండానే సమావేశాన్ని పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో  చైనా బృందంలో పర్యావరణం.. సహజ విద్యుత్తు.. మౌలిక సదుపాయాలు.. మౌలిక వసతులు.. గృహ నిర్మాణం.. ఐటీ సేవలు.. పరిశ్రమలకు చెందిన 82 మంది పారిశ్రామికవేత్తలు.. పెట్టుబడిదారులు పాల్గొన్నారు.

 

దీంతో తెలంగాణ ప్రభుత్వంపై చైనా బృందం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంతమంది చైనా బృందం ఒక రాష్ట్రానికి రావడం ఇదే తొలిసారని.. వేరే ఏ దేశానికి వెళ్లినా తమకు ఘన స్వాగతం లభించేదని.. ఇక్కడ ప్రభుత్వం తీరు అసంతృప్తిగా ఉంది... తమను ఉద్దేశ పూర్వకంగా అవమానించినట్లుగా ఆ బృందం చెబుతోంది. అంతేకాదు...తమ పర్యటనను మధ్యలోనే ఆపేసుకొని తిరిగి వెళ్లిపోయేందుకు సిద్ధమవుతున్నారు. మరి మా రాష్ట్రంలో అపారమైన అవకాశాలు ఉన్నాయని.. అక్కడ గొప్పలు చెప్పుకొని.. తీరా ఇక్కడికి వచ్చిన తరువాత ఇలా వ్యవహరించడం చూసి తెలంగాణ ప్రభుత్వానికి గొప్పలు చెప్పుకోవడం తప్ప.. విషయం లేదని అంటున్నారు. మరి దీనిపై కేసీఆర్ గారు ఎలా స్పందిస్తారో చూద్దాం...