చివరికి కేసీఆర్ కూడా...

 

ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఈసడించుకుంటున్నారు.. దేశవ్యాప్తంగా జనం బీజేపీ చేస్తున్న రాజకీయాన్ని ఇదెక్కడి చోద్యమమ్మా అని నోళ్ళు నొక్కుకుంటూ చూస్తున్నారు. ప్రత్యేక హోదా విషయంలో గానీ, ఆంధ్రకు ఇవ్వాల్సిన నిధుల విషయంలోగానీ బీజేపీ వ్యవహరిస్తున్న ధోరణి విమర్శలకు గురవుతున్నాయి. ముఖ్యంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో బీజేపీ తీరు బీజేపీ మిత్ర పక్షాలకు కూడా నచ్చని పరిస్థితి. తన మిత్రపక్షం అధికారంలో వున్న రాష్ట్రంలో, అది కూడా తాను కూడా అధికారంలో భాగస్వామిగా వున్న రాష్ట్రంలో బీజేపీ వ్యవహరిస్తున్న తీరు పట్ల అంతటా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్లానింగ్ కమిషన్‌ని రద్దు చేసి నీతి ఆయోగ్ ఏర్పాటు చేశాం కాబట్టి, ఈ ప్రక్రియలో భాగంగా ప్రత్యేక హోదా ఇవ్వడం అనేది కుదరదు అని కేంద్రం చెబుతోంది. బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కాకముందే ఏపీకి ప్రత్యేక హోదా హామీ వుంది. అధికారం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ కూడా ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో అభ్యంతరం వ్యక్తం చేయడం లేదు. అలాంటప్పుడు నీతి ఆయోగ్ ఏర్పాటు చేయకముందే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే చట్టపరమైన ఇబ్బందులేవీ వుండేవి కావు. వేయాల్సిన అడ్డుకట్టలన్నీ వేసేసిన బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు ఆ అడ్డుకట్టలనే సాకుగా చూపిస్తూ ప్రత్యేక హోదా విషయంలో మొండిచెయ్యి చూపిస్తోంది.

 

ఇప్పుడు ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఒకటుంది. మొన్నటి వరకు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం తెలంగాణలో అధికారంలో వున్న టీఆర్ఎస్‌కి ఎంతమాత్రమూ ఇష్టం లేదు. ఏపీకి హోదా ఇస్తే అభివృద్ధిలో తెలంగాణను దాటిపోతుందన్న అనుమానం ఆ పార్టీకి వుంది. అందుకే ఏపీకి హోదా ఇస్తే తెలంగాణకు కూడా హోదా ఇవ్వాల్సిందేనని టీఆర్ఎస్ నాయకులు చెబుతూ వచ్చారు. వాళ్ళకు ఇస్తే మాకూ ఇవ్వాల్సిందేనని మొండి పట్టుదలతో వ్యవహరించారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. కేసీఆర్ కుమార్తె, పార్లమెంట్ సభ్యురాలు కవిత కూడా ఆమధ్య ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని, దానికి తమ మద్దతు కూడా వుంటుందని ప్రకటించారు. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలన్నట్టుగా మాట్లాడారు. ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ ఆడుతున్న దాగుడు మూతలను ఆయన విమర్శించారు. అందరూ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని అంటున్నారు... చివరికి కేసీఆర్ కూడా ఏపీకి ప్రత్యేక హోదాకి అనుకూలంగా మాట్లాడారు... అయినప్పటికీ ప్రధానమంత్రి మనసు కరగడం లేదు...!