అందుకే కేసీఆర్ ఎదురుతిరిగాడా..?

 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నట్టుండి జాతీయ రాజకీయాలపై మాట్లాడటం... కాంగ్రెస్ ప్రభుత్వం.. బీజేపీ ప్రభుత్వం చేస్తున్న అన్యాయం గురించి మాట్లాడటం.... దక్షిణాది రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వాలు చిన్న చూపు చూపడం.. వంటి విషయాలపై మాట్లాడటం.. ఇప్పుడు దేశ రాజకీయాల్లో చర్చాంశనీయంగా మారాయి. దేశంలో థర్డ్ ఫ్రంట్ అవసరం ఉందని... దేశానికి త‌న సేవ‌లు అవ‌స‌రం ఉందంటే క‌చ్చితంగా సిద్ధంగా ఉన్నాన‌ని.. మార్పున‌కు నాయ‌క‌త్వం వ‌హించేందుకు సిద్ధంగా ఉన్నాన‌నీ సంచలన వ్యాఖ్యలే చేశారు. అయితే ఉన్నట్టుండి కేసీఆర్ ఇలా మాట్లాడటానికి కారణం ఏంటబ్బా అంటే ఇప్పుడు ఓ కొత్త విషయం బయటకు వచ్చింది. ఇంతకీ కేసీఆర్ అలా మాట్లాడటానికి కారణం ఏంటనుకుంటున్నారా...? హర్ట్ అవ్వడమే అంట. కేసీఆర్ హర్ట్ అయినందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

 

ఇంతకీ కేసీఆర్ ఏ విషయంలో హర్ట్ అయ్యాడనుకుంటున్నారా..? అసలు సంగతేంటంటే.. మొన్నఆమధ్య కేసీఆర్ ఢిల్లీ వెళ్లినప్పుడు ముస్లిం రేజర్వేషన్ల బిల్లు గురించి ప్రధానితో మాట్లాడటానికి మోడీ అప్పాయింట్మెంట్ కోరారట. కానీ ప్రధాని కనీసం టైం కూడా ఇవ్వకపోవడం కేసీఆర్ అవమానంగా భావించారట. ఆ కోపంతోనే... ఈ మధ్య జరిగిన ఓ మీటింగ్ లో రిజర్వేషన్ల గురించి మాట్లాడుతూ... కేంద్రంపై, మోడీపై విమర్శలు గుప్పించారు. ఇక అదే ఫ్లోలో మోడీ గాడు అని కూడా నోరుజారారు. అంతే బీజేపీ నేతలు కేసీఆర్ పై  ఓ రేంజ్ లో మండిపడ్డారు. ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తిని పట్టుకొని ఇలా మాట్లాడటం సరికాదని.. అంతేకాదు కొంతమంది అయితే ఏకంగా జైలులో పెట్టాలి అన్న వ్యాఖ్యలు చేశారు. ఇదిగో ఇవే మాటలకు కేసీఆర్ ఈగో హర్ట్ అయిందట. దీనితోడు హైదరాబాద్ లో ఒక ప్రారంభానికి హాజరు కావాల్సిన కేంద్ర రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ కేటీఆర్ ను ఇరుకునపెట్టడం, ప్రారంభానికి రాను అని బెదిరించడం కూడా కేసీఆర్ ను ఈగోను హర్ట్ చేసిందట. అందుకే కేంద్రంపై యుద్దానికి దిగారు కేసీఆర్. ఏకంగా ప్రధాని పదవికే పోటు పెట్టడానికి రెడీ అయ్యారు. అందుకే థర్డ్ ఫ్రంట్ ను తెరపైకి తీసుకొచ్చారు. అంతేకాదు కేసీఆర్ కు ఇప్పటికే చాలామంది మద్దతు కూడా లభించింది. ఇంకా మద్దత్తు కూడగట్టే పనిలో ఉన్నారట. దీనిలో భాగంగానే లోక్‌సభలో టీడీపీ ఎంపీలకు టీఆర్‌ఎస్ ఎంపీలు మద్దతుగా నిలిచారు. విభజన హామీలను అమలు చేయాలని టీడీపీ ఎంపీలు గళమెత్తుతుంటే.. టీఆర్ఎస్ ఎంపీలు గొంతు కలిపారు. విభజన హామీలను అమలు చేయాలని టీఆర్‌ఎస్ ఎంపీలు డిమాండ్ చేశారు. మొత్తానికి కేసీఆర్ బాగానే హర్ట్ అయినట్టు ఉన్నారు. అందుకే ఏకంగా జాతీయ రాజకీయాలనే టార్గెట్ చేశారు. మరి కేసీఆర్ కేంద్రానికి ఎదురుతిరిగారు.. విజయం సాధిస్తారా..? లేదా..? అన్నది చూడాలి.