ప్రధానిని ఏం అనకూడదా..? రాజ్యాంగంలో రాసుందా..?


 

తెలంగాణ రాజకీయాల్లో కొత్త కొత్త మలుపులు చోటుచేసుకుంటున్నాయి. ఏ విషయాన్నైనా కుండబద్దలు కొట్టినట్టు చెప్పడంలో కేసీఆర్ ది అందె వేసిన చెయ్యి. తన మాటలతోనే అందరినీ తనవైపు తిప్పుకునేలా చేసే మాటల మాంత్రికుడు ఆయన. ప్రతిపక్ష పార్టీనేతలపై తమ కామెడీ సెటైర్లతో చురకలు అంటిస్తూనే నవ్వులు పుట్టించేస్తాడు. అలానే ఇటీవల ప్రధాని మోడీపై కూడా సంచనల వ్యాఖ్యలు చేసి బుక్కయ్యారు. కావాలనే అన్నారా..? లేక ఫ్లోలో అన్నారా...? తెలీదు కానీ... మోడీ గాడు అన్న పెద్ద పదం మాత్రం వాడేశారు. ఇక ఇదే అదనుగా బీజేపీ కేసీఆర్ పై తీవ్రంగా విరుచుపడ్డారు. అధికార అహంకారంతోనే కేసీఆర్ ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తిని ఇలా సంబోధించారని.. కేసీఆర్ నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదు.. జైలు పంపిస్తాం అని ఆవేశంతో ఊగిపోయారు.

 

మరి మాములుగానే కేసీఆర్ తమ డైలాగ్స్ తో కోపం తెప్పిస్తాడు. అలాంటిది తనను ఇన్ని మాటలు అంటుంటే కేసీఆర్ ఊరుకుంటాడా.. బీజేపీ నేతలకు కౌంటర్ ఇచ్చాడు. మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన.. మోడీ గారికే అని అన్నా.. మోడీ గాడు అని అనలేదు..నేను మోడీగాడు అన్నానని దుష్ర్పచారం చేస్తున్నారు.. నేను మాట్లాడిన దానికి కట్టుబడి ఉంటా.. నేను ప్రధానిని అగౌరవంగా మాట్లాడాననడం సరికాదు అని స్పష్టం చేశారు. నేను అలా అన్నానని.. బీజేపీ వాళ్లు ఊహించుకుంటే అది వాళ్ల ఖర్మ... అని అన్నారు. అంతేకాదు.. బీజేపీ నాయకులు ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి.. జైలు వెళతారా అని మాట్లాడుతున్నారు... ప్రధానికి ఎదురు మాట్లాడితే జైల్లో పెడతారా..?ప్రధానిని విమర్శించవద్దని రాజ్యాంగంలో ఏమన్నా రాసుందా అని ప్రశ్నించారు. అక్కడితో ఆగకుండా కొందరిని టచ్ చేస్తే భస్మం అయిపోతారు అని కూడా వార్నింగ్ ఇచ్చారు. మొత్తానికి కేసీఆర్ తాను అనలేదు అని అంటూనే.. అంటే తప్పేంటి అని కూడా అంటున్నారంటే..మరి కావాలనే అన్నారా..? ఫ్లోలో అన్నారా..? అది కేసీఆర్ కే తెలియాలి..