తెలంగాణలో షాడో సీఎం?... ఇబ్బంది పడుతోన్న సీనియర్‌ మంత్రులు..!

సాధారణంగా ముఖ్యమంత్రి బిజీగా ఉన్నప్పుడు ఆయన బాధ్యతలను సీనియర్‌ మోస్ట్‌ మంత్రులు నిర్వర్తిస్తారు. అయితే తెలంగాణలో ఇద్దరు ఉపముఖ్యమంత్రులున్నా... వారిలో మహమూద్‌ అలీకి పాలనానుభవం లేదు. ఇక కడియం శ్రీహరి అందరికీ ఆమోదయోగ్యంగా లేరు. దాంతో వారిద్దరూ సొంత శాఖలకే పరిమితమవుతున్నారు. అయితే కేసీఆర్‌ తర్వాత ఇటు ప్రభుత్వంలోనూ, అటు పార్టీలోనూ అంత ప్రాముఖ్యత, ప్రాధాన్యతున్న వ్యక్తులు ఇద్దరే ఇద్దరూ. వారిలో ఒకరు కేసీఆర్‌ మేనల్లుడు హరీష్‌రావు, మరొకరు కేసీఆర్‌ తనయుడు కేటీఆర్‌. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్‌... ఇటీవల ఏ పనినైనా కొడుకు కేటీఆర్‌కే అప్పగిస్తున్నట్లు చర్చ నడుస్తోంది. 

 

ఇటీవల కేసీఆర్‌ హాజరుకాలేని అతిము‌ఖ్యమైన కార్యక్రమాలకు కేటీఆర్‌నే పంపిస్తున్నారు. మొన్న బ్రాహ్మణ భవన్ శంకుస్థాపనకు కేటీఆరే ముఖ్య అతిధిగా హజరయ్యారు. జాతీయ, అంతర్జాతీయ కంపెనీల ప్రారంభోత్సవాలు, సదస్సుల్లోనూ ప్రభుత్వం తరపున కేటీఆరే పాల్గొంటున్నారు. అంతేకాదు... తన మంత్రిత్వశాఖ కాకున్నా ఢిల్లీలో జరిగే సమావేశాలకు సైతం అప్పుడప్పుడూ కేటీఆరే హజరవుతున్నారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన జీఎస్టీ కీలక భేటీకి ఆర్థికమంత్రి ఈటెల గైర్హాజరు కావడంతో ఆయనకు బదులు కేటీఆరే ఆ సమావేశానికి అటెండ్‌ అయ్యారు. దీని వెనుక ముఖ‌్యమంత్రి వ్యూహముందని, కేసీఆరే స్వయంగా.... కేటీఆర్‌ ప్రాధాన్యతను పెంచుకుంటూ పోతున్నారని గులాబీ గ్రూప్‌లో చర్చ జరుగుతోంది.

 

ప్రభుత్వంలోనూ, పార్టీలోనూ కేటీఆర్‌ పాత్రను మెల్లమెల్లగా పెంచుతున్న కేసీఆర్‌.... వివిధ పనులపై తన దగ్గరికొచ్చే మంత్రులు, ఉన్నతాధికారులను కేటీఆర్‌ దగ్గరికి పంపుతున్నారట. తాను బిజీగా ఉన్నానని, ఏమన్నా ఉంటే కేటీఆర్‌ను సంప్రదించాలని స్వయంగా కేసీఆరే... మంత్రులకు సూచిస్తున్నట్లు తెలుస్తోంది. దాంతో కేసీఆర్‌కు చెప్పాల్సినవన్నీ కేటీఆర్‌తో చర్చిస్తూ... తగిన సూచనలు సలహాలు ఇవ్వమని కోరుతున్నారట. అయితే కేటీఆర్‌ దగ్గరకు వెళ్లడం కొందరు సీనియర్‌ మంత్రులకు ఇబ్బందిగా మారిందని టాక్‌ వినిపిస్తోంది. అటు వయసులోనూ ఇటు పాలనలోనూ జూనియర్‌ అయిన కేటీఆర్‌ నుంచి సలహాలు తీసుకోవడానికి ఫీలవుతున్నారట. అయితే బాస్‌ కేసీఆరే ఆర్డర్‌ వేయడంతో చేసేదిలేక ఫాలో అయిపోతున్నారట. ఇలా మంత్రులంతా కేటీఆర్‌ దగ్గరకి క్యూ కడుతుండటంతో షాడో సీఎం అని పిలుస్తున్నారట.