షా వలసల అస్త్రం… కేసీఆర్ ఆకర్ష్ దివ్యాస్త్రం!

తెలంగాణ రాజకీయం వలసల సెగలతో సలసల కాగిపోనుందా? అవుననే అంటున్నారు రాజకీయ పండితులు! ఎందుకూ అంటే… 2014 ఎన్నికల ముందు వరకూ సమైక్య రాష్ట్రంలో కాంగ్రస్, టీడీపీలే ప్రధాన పార్టీలు. తరువాత వచ్చిన వైసీపీ బలమైన శక్తిగా ఎదిగింది. కాని, ఆ పార్టీ కూడా పూర్తి స్థాయిలో అసెంబ్లీ ఎన్నికల్ని తొలిసారి ఎదుర్కొంది 2014లోనే! అప్పుడు టీడీపీతో పోటీపడి ఆంధ్రాలో ప్రతిపక్ష స్థానానికి పరిమితమైంది. ఇటు తెలంగాణలో మాత్రం కాంగ్రెస్, టీడీపీ, బీజేపి లాంటి సీనియర్ పార్టీల కంటే టీఆర్ఎస్ టీ సెంటిమెంట్ తో బలంగా దూసుకుపోయింది. ప్రత్యేక రాష్ట్రపు తొలి గులాబీ సర్కార్ ఏర్పాటు చేసింది! కాని, కేసీఆర్ సీఎం అయ్యాక వలసల విషయంలో కొత్త ఊపు తీసుకొచ్చారు!

 

ఒక దశలో టీఆర్ఎస్ అస్థిత్వాన్నే ప్రశ్నించేలా ఎమ్మెల్యేల్ని చీల్చి వైఎస్ రాజకీయం చేశారు. సరిగ్గా అదే ఆయుధం ఉపయోగించి కేసీఆర్ తెలంగాణ ఏర్పడ్డాక టీ కాంగ్, టీ టీడీపీలకు చుక్కలు చూపించారు! వారానికో ఎమ్మేల్నో, సీనియర్ నేతనో గులాబీ వనంలోకి లాక్కుంటూ తెలుగు దేశానికి, కాంగ్రెస్ కి మనః శాంతి లేకుండా చేశారు. చివరకు, టీ టీడీపీ తెలంగాణలో నామ మాత్రంగా మిగిలిపోయింది. కాంగ్రెస్ కు చావు తప్పి కన్ను లొట్టపోయింది!

 

తెలంగాణలో కేసీఆర్ తన మిషన్ ఆకర్ష్ మొదటి దశ జరిపినప్పుడు చెక్కుచెదరకుండా వుండగలిగింది బీజేపి మాత్రమే! ఆ పార్టీ నుంచి ఆయన ఎమ్మెల్యేల్ని లాక్కోవలని ప్రయత్నించారో లేదో గాని… వున్న ఐదుగురు మాత్రం కాషాయదళంలోనే కంటిన్యూ అవుతున్నారు. కాని, తాజాగా అమిత్ షా టీ టూర్ చేసి వెళ్లటంతో బీజేపి అన్ని పార్టీల వారికి వెల్ కమ్ చెప్పే ప్లాన్ లో వుందని వార్తలోచ్చాయి. ఇంకా ఎవరూ కండువాలు కప్పుకోలేదు కాని… కాంగ్రెస్, టీఆర్ఎస్ లకు ఎంతో కొంత టెన్షన్ అయితే ప్రారంభమైంది. అధికారంలో వున్న కార్ ను వదిలి పెద్దగా నాయకులు వెళ్లరనే భావించినా దిల్లీలో అధికారంలో వున్న  బీజేపి అసంతృప్తుల్ని ప్రభావితం చేసే అవకాశం లేకపోలేదు. అందుకే, కేసీఆర్ ఇక రెండో దఫా ఆకర్ష్ కి రెడీ అవుతున్నారని మీడియాలో టాక్!

 

బీజేపి వారు టీఆర్ఎస్ , కాంగ్రెస్ నాయకులకి, అలాగే కాంగ్రెస్ వారు టీఆర్ఎస్ లోని అసంతృప్తులకి గాలం వేసేలోపే గులాబీ బాస్ ఇంకో సారి వలసల దండయాత్ర చేయనున్నారట. ఆదిలాబాద్ లోని టీ టీడీపీ సీనియర్ నాయకుడు, గిరిజన నేత రమేష్ రాథోడ్ వికెట్ త్వరలోనే పడనుందంటున్నారు. ఆయన సైకిల్ దిగి కార్ ఎక్కేస్తారట. రానున్న నెలల్లో ఇలా ఇంకా చాలా మందే టీడీపీ, కాంగ్రెస్ నుంచి గులాబీ వైపు వెళ్లవచ్చట! ఈ వలసల వల్ల వచ్చే ఎన్నికల్లో విజయావకాశాలు ఎలా వుండబోతున్నాయో మనకు తెలియదుగాని… కేసీఆర్ కి, టీఆర్ఎస్ కి బీజేపి గండం మత్రం 2019ఎన్నిలైపోయేదాకా కొనసాగే సూచనలే కనిపిస్తున్నాయి. ఎందుకంటే, అమిత్ షా కూడా కేసీఆర్ ప్రయోగిస్తున్న వలసల అస్త్రాన్నే తెలంగాణ రాజకీయాలపై ప్రయోగించనున్నారు! కాబట్టి ఐపీఎల్ ఆటగాళ్ల వేలం తరహాలో హాడావిడి తప్పదు…