దళిత ముఖ్యమంత్రికి పరిస్థితులు సూట్ అవ్వవట

 

ఇప్పుడప్పుడే తెలంగాణా రాదనే భావనతోనే తెదేపా, వైకాపాలు రాష్ట్ర విభజనకు అంగీకరిస్తూ లేఖలు ఇచ్చాయి. తెరాస అధ్యక్షుడు కేసీఆర్ కూడా అదేవిధంగా భావించి, తెలంగాణా ఇస్తే తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తానని, తెలంగాణా రాష్ట్రానికి దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని హామీ ఇస్తూ వచ్చారు. కానీ ఎవరూ ఊహించని విధంగా అకస్మాత్తుగా తెలంగాణా ఏర్పడిపోయింది. ఈ వ్యవహారంలో తెదేపా, వైకాపాలు ఎలాగో చావు తప్పి కన్ను లొట్టపోయి బయటపడ్డా, కేసీఆర్ మాత్రం ఇంకా బయటపడలేక పోతున్నారు. అప్పటికీ ఆయన కాంగ్రెస్ పార్టీతో ఏవో గిల్లి కజ్జాలు పెట్టుకొని, కుంటి సాకులు చెప్పి ఎలాగో కాంగ్రెస్ పార్టీతో విలీనం, పొత్తుల మాటను గట్టున పెట్టేయగలిగారు. కానీ, కనబడని ఆ దళిత ముఖ్యమంత్రి మాత్రం ఆయనను నీడలా వెన్నాడుతూ వేధించుకుతింటూనే ఉన్నాడు. అందుకే అతనిని కూడా వదిలించుకోవడానికి మాటల మాంత్రికుడు కేసీఆర్ సరి కొత్త మంత్రాలు పటించడం మొదలుపెట్టారిప్పుడు.

 

ఆనాడు దళిత ముఖ్యమంత్రి ప్రతిపాదన చేసినప్పటి పరిస్థితులు ఇప్పుడు ఎంతమాత్రం లేవని, అవకాశం దొరికితే తెలంగాణాను నమిలి మింగేద్దామని ‘ఆంధ్రా బూచాళ్ళు’ కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు ఇంకా చాలా మంది పొంచి ఉన్నారని, అందువలన తెలంగాణాను సాధించిన తనకే వారందరి నుండి దానిని కాపాడుకొనే భాద్యత కూడా దఖలు చేసుకోవలసి వస్తోందని తెలిపారు. కనుక ప్రస్తుత పరిస్థితుల్లో దళిత ముఖ్యమంత్రి ప్రతిపాదనను కూడా పక్కన పెట్టక తప్పడం లేదని అన్నారు. అంతే గాక రాగల రెండుమూడేళ్ళు కూడా తెలంగాణకు చాలా క్లిష్టమయినవని అందువలన తన కుటుంబ సభ్యులు అందరూ కూడా బాధ్యతలు తీసుకొని తెలంగాణాను కాపాడుకొంటారని కేసీఆర్ తన మనసులో మాటని కక్కేశారు. ఎన్నికలకు వెళ్ళే లోపుగానే తెరాస తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్ధి పేరు కూడా ప్రకటిస్తానని ఆయన మరో కొత్త హామీ ఇచ్చారు.

 

ఇప్పటికే తెరాస కార్యకర్తలు, నేతలందరూ కూడా కేసీఆరే ముఖ్యమంత్రి కావాలని గట్టిగా పట్టుబడుతున్నారు. వారు మరింత గట్టిగా అడిగినట్లయితే వారి మాటను కాదనలేని సహృదయుడు కేసీఆర్. ఆ విధిలేని పరిస్థితిలో మళ్ళీ ‘ఆ బక్కోడే’ ముఖ్యమంత్రి బాధ్యతలు కూడా స్వీకరించేందుకు అంగీకరించ్చన్న మాట!

 

అందువల్ల చంద్రబాబు బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రిని చేస్తానని ప్రకటించినా, బీజేపీ దళితుడిని చేస్తానన్నా, జగన్మోహన్ రెడ్డి మైనార్టీ వ్యక్తిని ముఖ్యమంత్రిని చేస్తానని ప్రకటించినా ఇక కేసీఆర్ కి ఎటువంటి ఇబ్బంది లేదు. ఆయన ఈసారి కొంచెం జాగ్రత్త పడుతూ తన కుటుంబ సభ్యులందరూ కూడా ‘బంగారి తెలంగాణా’ పునర్నిర్మాణంలో బాధ్యతలు (?) స్వీకరిస్తారని ముందే ప్రకటించేశారు. గనుక వారందరికీ కూడా లైన్ క్లియర్ అయిపోయినట్లే! రేపు వారందరూ తలో మంత్రి పదవీ పుచ్చుకొంటున్నపుడు వారెవరికీ ఎటువంటి సంజాయిషీలు ఇవ్వనవసరం లేదు కూడా. ఎందుకంటే వారందరూ పదవులు, అధికారంపై ఆరాటంతో కాక కేవలం ‘బంగారి తెలంగాణా’ను నిర్మించుకొనేందుకు మాత్రమె బాధ్యతలు చేపట్టబోతున్నారు. కల్వకుంట్ల వారు ఎంత త్యాగాశీలులో...