తెలంగాణా ఏర్పాటుకి కేసీఆర్ బీజేపీని ఒప్పించగలరా

 

డిశంబర్ 5నుండి 20వరకు జరిగే పార్లమెంటు శీతాకాల సమావేశాలలోనే తెలంగాణా బిల్లు ప్రవేశ పెట్టేందుకు కాంగ్రెస్ అధిష్టానం తీవ్ర కసరత్తు చేస్తుండటంతో, కాంగ్రెస్ అధిష్టానం తనను పక్కనబెట్టినప్పటికీ కేసీఆర్ కూడా తనవంతు ప్రయత్నాలు చేసేందుకు వచ్చే నెల3న డిల్లీకి బయలుదేరబోతున్నారు.

 

ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి, ఏపీ ఎన్జీవోలు డిల్లీలో జాతీయ పార్టీలను కలిసి పార్లమెంటులో రాష్ట్ర విభజనకు వ్యతిరేఖంగా ఓటువేసి, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు సహకరించమని అభ్యర్దించిన నేపధ్యంలో, కేసీఆర్ కూడా వారినందరినీ కలిసి తెలంగాణా ఏర్పాటుకి మద్దతు కూడ గట్టే ప్రయత్నం చేస్తారు. అయితే ఒక్క బీజేపీ తప్ప దాదాపు ఇతర పార్టీలన్నీకూడా ఈవిషయంలో స్పష్టమయిన వైఖరితోనే ఉన్నాయి. గనుక, కేసీఆర్ బీజేపీ అగ్ర నేతలతో జరిపే సమావేశమే కీలకమని చెప్పవచ్చును.

 

2014 ఎన్నికల తరువాత కేంద్రంలో ప్రభుత్వం ఏర్పరచాలనే పట్టుదలతో ఉన్న బీజేపీ, కేసీఆర్ అభ్యర్ధనను మన్నించడం కష్టమే. ఎందుకంటే, ఆయన అభ్యర్ధనను మన్నించి ఒకవేళ బీజేపీ కాంగ్రెస్ పార్టీతో సహకరించి తెలంగాణా ఏర్పాటుకి దోహదపడితే, కేసీఆర్ తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసినా, పొత్తులు పెట్టుకొన్నా బీజేపీకి నష్టమే తప్ప ఎటువంటి లాభమూ ఉండబోదు. అదే కాంగ్రెస్ పార్టీ పార్లమెంటులో తెలంగాణా బిల్లు ఆమోదింపచేయలేక చేతులెత్తేసేట్లు చేయగలిగితే, తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీని పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే అవకాశాలుంటాయి,

 

ఒకవేళ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పరచగలిగితే అప్పుడు తెరాసకు బీజేపీయే దిక్కవుతుంది. అందువల్ల బీజేపీ కేసీఆర్ కి నచ్చజెప్పి పంపేసే అవకాశాలే ఎక్కువ. ఒకవేళ ఆ రెండు పార్టీ నేతలు ఈ సమావేశంలోనే ఎన్నికల తరువాత మద్దతు గురించి ఒక అవగాహనకి వచ్చినట్లయితే, కేసీఆర్ సమావేశం తరువాత బయటకు వచ్చి మీడియాతో “మా అభ్యర్ధనకు బీజేపీ నేతలు సానుకూలంగా స్పందించారు” అంటూ ఒక్క రొటీన్ డైలాగ్ పలకవచ్చును.