మహేంద్ర రెడ్డికి కెసిఆర్ పది కోట్ల ఆఫర్

 

ఇటీవల తెరాస నుండి సస్పెండ్ అయిన రఘునందనరావు, పద్మాలయ స్టూడియోస్ యాజమాన్యం నుండి హరీష్ రావు రూ.80లక్షలు పిండుకొన్నాడని ఆరోపణలు చేశారు. అంతే కాక, ఆయన గత ఎన్నికలలో సిరిసిల్ల నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న తారక రామారావును ఓడించేందుకు స్వతంత్ర అభ్యర్ధిగా నిలబడిన మహేంద్ర రెడ్డికి ఏభై లక్షలు పంపారని ఆరోపించారు.

 

తెరాస అధినేత చంద్రశేఖర్ రావు మొదట మహేంద్ర రెడ్డికే పార్టీ టికెట్ ఇస్తానని హామీ ఇచ్చినప్పటికీ, ఆఖరి నిమిషంలో తన కొడుకు కె.తారకరామారావుకు ఇవ్వడంతో ఆగ్రహించిన మహేంద్ర రెడ్డి స్వంతత్ర అభ్యర్ధిగా రంగంలో దిగారు. హరీష్ రావ్ తనకు ఏభై లక్షలు పంపారని ఆరోపిస్తున్న రఘునందన రావు మాటలకి స్పందిస్తూ, “తానూ పోటీ నుండి తప్పుకుంటే తెరాస అధినేత చంద్రశేఖర్ రావు పది కోట్లు ఆఫర్ ఇచ్చారని’ మహేందర్ రెడ్డి స్పష్టం చేసారు. అంతే కాకుండా తనకు సికింద్రాబాద్ పార్లమెంటు నియోజక వర్గం టిక్కెట్ కూడా ఇస్తానని ప్రలోభపెట్టారని, కానీ తానూ పోటీ నుండి విరమించుకోలేదని ఆయన అన్నారు. ఆ పోటీలో చివరికి కె.తారకరామారావే గెలిచినా ఆయనకు కేవలం రెండు వందల ఓట్లలోపు మెజార్టీతో గండం గట్టెక్కడం, పోటీ ఎంత తీవ్రంగా సాగిందో తెలియజేస్తుంది.

 

రఘునందన్ రావు చేసిన ఆరోపణలు హరీష్ రావు, కేటీఆర్ ల మధ్య విభేదాలను బయటపెడితే, మహేంద్ర రెడ్డి చెప్పిన విషయం కేసీఆర్ ఎన్నికలలో గెలవడం కోసం డబ్బులు ఎంతగా విరజిమ్ముతున్నాడో తెలియజేప్తోంది. ఉద్యమపార్టీగా ఆవిర్భవించిన తెరాస చివరికి ఏదశకు చేరుకొందో ఈ రెండు సంఘటనలు తెలియజేస్తున్నాయి. రఘునందనరావు రేపటి ఎపిసోడ్ లో ఇంకెన్ని రహస్యాలు బయటపెడతాడో చూడాలి.