ప్రధాని పదవిపై కన్నేసినట్టున్నాడుగా...

 

కేసీఆర్ స్ట్రాటజీ ఏంటో కాస్త రాజకీయానుభవం ఉన్న ఎవరికైన అర్గమవుతుంది. సెంటిమెంట్ ను ఉపయోగించుకోవడంలో ఆయన దిట్ట. అలాగే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారనడంలో ఎలాంటి సందేహం లేదు. తెలంగాణకు, తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుందన్న సెంటిమెంట్ ను ప్రజల్లో రగిల్చి... తెలంగాణ ఉద్యమం చేపట్టి.. ప్రజల మద్దతుతో ప్రత్యేక తెలంగాణను సాధించారు. ఇక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కూడా అయ్యారు. మరి ఇప్పుడు కేసీఆర్ కన్ను దేశ రాజకీయాలపై పడినట్టు ఉంది. ఎందుకంటే.. కేంద్ర ప్రభుత్వం తీరుపై మీడియా సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే అలానే అనిపిస్తుంది.

 

ఇక ఇన్ని రోజులు మోడీపై ఎలాంటి విమర్శలు గుప్పించని కేసీఆర్ ఏమైందో ఏమో కానీ కేంద్రాన్ని టార్గెట్ చేస్తూ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండు మూడు రోజుల నుండి మోడీ ప్రభుత్వం చేసిన ఘనకార్యం ఏం లేదని.. కాంగ్రెస్ కు బీజేపీకి పెద్ద తేడా లేదని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.  గ‌డ‌చిన 70 ఏళ్లుగా కాంగ్రెస్‌, లేదా భాజ‌పాలే ఎక్కువ కాలం దేశాన్ని పాలించాయ‌ని.. ఆ రెండు పార్టీల వల్ల దేశానికి ఒరిగింది ఏం లేదు.. ఏదో పధకాలకు పేరు మార్చడం తప్ప చేసింది ఏం లేదని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. బీజేపీ-కాంగ్రెస్ పార్టీ దొందూ దొందే... దేశ రాజకీయాల్లో మార్పు రావాల్సిన అవసరం ఉంది..  దేశానికి ప్రత్యామ్నాయ అవ‌స‌రం క‌నిపిస్తోంద‌న్నారు. అంతేకాదు... దాన్ని థ‌ర్డ్ ఫ్రెంట్ అంటారో మ‌రేదైనా పేరు పెడ‌తారో అనేది త‌రువాత సంగతి.. అలాంటి ప్ర‌త్యామ్నాయ కూట‌మి కోసం తాను ప‌నిచేస్తున్నాను అని కేసీఆర్ ప్ర‌క‌టించ‌డం విశేషం. దాని కోసం అవ‌స‌ర‌మైన వారితో మాట్లాడుతున్నాన‌నీ, దేశానికి త‌న సేవ‌లు అవ‌స‌రం ఉందంటే క‌చ్చితంగా సిద్ధంగా ఉన్నాన‌ని త‌న మ‌న‌సులో మాట బ‌య‌ట‌పెట్టేశారు కేసీఆర్‌. మార్పున‌కు నాయ‌క‌త్వం వ‌హించేందుకు సిద్ధంగా ఉన్నాన‌నీ, కొత్త‌గా రాబోయేది మూడో కూట‌మి కాద‌నీ.. అదే ప్ర‌థ‌మ ప్ర‌త్యామ్నాయం అన్నారు.


ఇదిలా ఉంటే కేసీఆర్ ఆలోచన బాగుందని... తన మద్దతు కేసీఆర్ కు ఉంటుందని జనసేన అధినేత పవన్ చెప్పేశారు. ఇంకా పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వయంగా తనకు ఫోన్ చేసిందని కూడా చెబుతున్నారు కేసీఆర్. ఇంకా పలు రాష్ట్రాల నుండి పలువురు ముఖ్యనేతలు ఫోన్లు చేశారని.. తమతో నడవడానికి సిద్దంగా ఉన్నామని చెప్పారని కేసీఆర్ చెబుతున్నారు. మరి చూడబోతే కేసీఆర్ కన్నుదేశ రాజకీయాలపై పడినట్టే తెలస్తోంది.జాతీయ రాజ‌కీయాలపై కేసీఆర్ లో ఆశ‌ పెరుగుతున్న‌ట్టుంది. ముఖ్యంగా ప్రధాని పదవికే కేసీఆర్ టార్గెట్ ఫిక్స్ చేసినట్టు కనిపిస్తోందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే అది మంచిదే కానీ... మూడో ప్ర‌త్యామ్నాయానికి నాయ‌క‌త్వం వ‌హించేస్తాన‌ని చెప్పడమే కాస్త అత్యాశగా ఉందని అంటున్నారు. నేరుగా చెప్ప‌క‌పోయినా ప్ర‌ధాని కావాల‌నే ఆశ‌ని కేసీఆర్ బ‌య‌ట‌పెట్టుకున్న‌ట్ట‌యింది. మరి చూద్దాం కేసీఆర్ కలలు నెరవేరుతాయో.. లేదో..?