ఏపీలో వేలు పెట్టిన కేసీఆర్‌..!

 

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు సర్వేల టైమ్‌ నడుస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఏపీ సీఎం చంద్రబాబుతోపాటు ప్రతిపక్ష నేతలు కూడా సర్వేలపై ఆధారపడుతున్నారు. మళ్లీ అధికారం తమదేనంటూ అటు ఏపీలో చంద్రబాబు, ఇటు తెలంగాణలో కేసీఆర్‌ చెబుతుంటే... కాదుకాదు ఈసారి తామే పవర్‌‌లోకి వస్తామని వైసీపీ, కాంగ్రెస్‌ చెబుతున్నాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీఆర్‌ఎస్‌కి 110 సీట్లు వస్తాయని కేసీఆర్‌ అనేకసార్లు చెప్పుకొచ్చారు. అయితే టీకాంగ్రెస్‌ కూడా తమకు 79 సీట్లు వస్తాయని సర్వేల్లో తేలిందని చెబుతోంది. ఇక ఏపీలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. మళ్లీ అధికారంలోకి వస్తామని చంద్రబాబు ధీమాగా ఉంటే, ఈసారి ఎలాగైనా పవర్‌లోకి రావాలని జగన్‌ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాదు 2019 ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ని కూడా రంగంలోకి దింపారు. అయితే ఏపీలో అధికారం తెలుగుదేశం, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీల మధ్య దోబూచులాడుతోందని తాజా సర్వేల్లో తేలింది. రెండు పార్టీల మధ్య ఓట్ల శాతం అతి స్వల్పంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఇటీవల వీడీపీ అసోసియేట్స్‌ జరిపిన సర్వేలో టీడీపీ, బీజేపీకి 47శాతం ఓట్లు వస్తాయని తేలితే... వైసీపీకి 40శాతం ఓట్లు మాత్రమే వస్తాయని చెప్పింది. అంతేకాదు టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేస్తే... మళ్లీ తెలుగుదేశానిదే అధికారమని వీడీపీ అసోసియేట్స్‌ అంచనా వేసింది. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌... ఏపీ రాజకీయాలపై తాజాగా చేసిన వ్యాఖ్యలు... టీడీపీకి షాకిచ్చేలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌‌లో వైసీపీకే ఎడ్జ్‌ ఉందన్న కామెంట్స్‌ సంచలనంగా మారాయి. మీడియాతో ఆఫ్‌ ది రికార్డ్ మాట్లాడిన కేసీఆర్‌... ఓ సర్వే మిత్రుడు తనకు ఈ విషయాలు చెప్పారన్నారు. వైసీపీకి 45శాతం, టీడీపీకి 43శాతం, అలాగే బీజేపీకి 2.6శాతం ఓట్లు వస్తాయని ఆ సర్వేలో తేలిందన్నారు.

 

అయితే ఎన్నికలకు ఇంకా దాదాపు రెండేళ్ల సమయం ఉండటంతో ఈలోపు ఏమైనా జరగొచ్చని అంటున్నారు. 2014 ఎన్నికల్లోనూ అదే జరిగిందని గుర్తు చేస్తున్నారు. అప్పటివరకూ వైసీపీకి అనుకూలంగా ఉన్న పరిస్థితులు... ఒక్కసారిగా మారిపోయాయని, ఇప్పుడు కూడా అలాగే జరుగుతుందని విశ్లేషిస్తున్నారు. అపర రాజకీయ చాణిక్యుడైన చంద్రబాబు... 2019 నాటికి పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకోవడం ఖాయమంటున్నారు.