TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కేసీఆర్‌పై దండెత్తిన టీటీడీపీ నేతలు

Published on: Tue Dec 27, 2011 8:02AM

హైదరాబాద్‌ : కేసీఆర్‌పై టీటీడీపీ నేత,ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు ధ్వజమెత్తారు. తెలంగాణ ఉద్యమం పేరిట కేసీఆర్‌ వేల కోట్ల రూపాయలు కూడ బెట్టుకున్నారని ఆయన ఆరోపించారు.  పద్నాలుగు ప్రశ్నలు వేస్తూ ఆయన కెసిఆర్‌కు ఓ బహిరంగ లేఖ రాశారు. విద్యార్థులు శ్రీకాంతాచారి, యాదయ్యలపై కెసిఆర్ మనుషులే కిరోసిన్ పోసి వారికి నిప్పంటించారని ఆయన ఆరోపించారు. తెలంగాణలో జరిగిన ఆత్మహత్యలన్నింటికీ కేసీఆర్‌దే బాధ్యత అని చెప్పారు. సకల జనుల సమ్మె నెపంతో కేసీఆర్‌ కాసులు మూటగట్టుకున్నారని, విద్యార్థులు, ఉద్యోగులు మాత్రమే నష్టపోయారని మోత్కుపల్లి పేర్కొన్నారు.  సోనియాతో కేసీఆర్‌ కుమ్మక్కయ్యారని ఆయన అన్నారు. కేసీఆర్‌ విధానాలకు నిరసనగా గన్‌పార్క్‌ వద్ద ఈనెల 28,29 తేదీలలో నిరసన ప్రదర్శనలు చేపడుతామని ఆయన తెలిపారు.

కాగా మరో నేత  ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా  కెసిఆర్‌పై విరుచుకుపడ్డారు. ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రధానంగా తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్‌ను టార్గెట్ చేసారు.. కావాలనే కోదండరామ్ తమ పార్టీని టార్గెట్ చేసుకున్నారని ఆయన  వరంగల్లులో విమర్శించారు. తెలంగాణ జెఎసి నుంచి అందరూ బయటకు వస్తారని, తెరాస ఒక్కటే మిగులుతుందని ఆయన అన్నారు. తెలంగాణపై తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన వైఖరిని అప్పుడే చెప్పారని ఆయన అన్నారు.

మరో  నాయకుడు కడియం శ్రీహరి కూడా తెరాసపై విమర్శలు గుప్పించారు. తెలంగాణలో నారా చంద్రబాబు నాయుడిని అడ్డుకోవద్దని ఆయన తెలంగాణ జెఎసికి సూచించారు. చంద్రబాబును అడ్డుకుంటే తాము తగిన బుద్ధి చెప్తామని ఆయన అన్నారు. తెలగాణకు అనుకూలగా చంద్రబాబు 2008లోనే లేఖ ఇచ్చారని ఆయన అన్నారు. తెరాస, తెలుగుదేశం పార్టీల మధ్య వేడి రాజుకున్న నేపథ్యంలో చంద్రబాబు ఈ నెల 28వ తేదీన కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు.