TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మసకబారిన కావూరి ప్రతిష్ఠ

Published on: Thu Apr 12, 2012 3:41PM

ఏలూరు పార్లమెంటు సభ్యులు కావూరి సాంబశివరావు కాంట్రాక్ట్ పనుల్లో వందల కోట్లలో అక్రమాలకూ పాల్పడినట్టు ఇటీవల వచ్చిన వార్తలతో ఆయన ప్రతిష్ఠ మసకబారినట్టు భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ పార్లమెంటు సభ్యులలో ఒకరిగా పేరు తెచ్చుకున్న కావూరి ప్రాథమికంగా వాణిజ్యవేత్త. కృష్ణాజిల్లా గుడివాడకు చెందిన సీనియర్ పార్లమెంటేరియన్ మాగంటి అంకినీడు చౌదరి అల్లుడైన కావూరి వారసత్వంగా తొలుత కృష్ణాజిల్లా మచిలీపట్నం లోక్ సభ స్థానం నుంచి 1984లో గెలుపొందారు. ఆ తర్వాత 1989లో జరిగిన ఎన్నికల్లో కూడా ఇక్కడ నుంచే రెండోసారి విజయం సాధించారు. తర్వాత వరుసగా 1991లో, 1996లలో ఓడిపోయారు. 1998లో మరల మచిలీపట్నం నుంచి విజయం సాధించారు. 1999లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ తర్వాత 2004, 2009 సంవత్సరాలలో పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసి ఎంపిగా కొనసాగుతున్నారు.

కేంద్రంలో అర్జున్ సింగ్ కు అత్యంత సన్నిహితునిగా పేరుగాంచిన కావూరి తన సీనియారితే నేపథ్యంలో కేంద్రంలో మంత్రిపదవి వస్తుందని అనేక పర్యాయాలు ఎదురు చూశారు. కావూరి దాదాపు మూడు దశాబ్దాలుగా రాజకీయాలలో వున్నప్పటికీ తన కాంట్రాక్ట్ వాణిజ్య కార్యక్రమాలను యథావిధిగా కొనసాగిస్తూనే వున్నప్పటికీ ఎటువంటి ఆరోపణలకు గురికాలేదు. తాజాగా రోడ్డుపనుల్లో భారీగా నిధులు దారి మళ్ళినట్టు వార్తలు రావడం వెనుక ఏమైనా కారణాలు వున్నాయా? అనే అంశంపై ప్రజలు చర్చించుకుంటున్నారు. సమైక్య ఆంధ్రనాయకులలో కావూరి కీలకంగా వున్నారు. అదే విధంగా తనకు సీనియారిటీ వున్నప్పటికీ మంత్రిపదవి లభించడం లేదనే నిరాశ వుంది. ఇటువంటి స్థితిలో ఆయనపై తాజాగా వచ్చిన ఆరోపణలతో కేంద్రంలో మంత్రిపదవి ఆశించే అవకాశం లేకుండా పోవడమే కాకుండా, సమైక్యవాడిగా కేంద్రంతో పటిష్టంగా వాదించే అవకాశం లేకుండా పోయిందని పరిశీలకులు భావిస్తున్నారు.