పాపం కావూరి!

 

కేంద్రమంత్రి కావూరి దిమాగ్ రాజకీయంగా ఖరాబైనట్టు కనిపిస్తోంది. నాలుగు దశాబ్దాల పాటు రాష్ట్ర రాజకీయాల్లో ఓటమే ఎరుగని వ్యక్తిగా ఒక వెలుగు వెలిగిన కావూరి రాజకీయ జీవితం ప్రస్తుతం అత్యంత కనాకష్టంగా తయారైంది. కావూరి పోటీ చేస్తే చాలు గెలవటం ఖాయం అనే స్థితి నుంచి తాను పోటీ చేస్తే ఓడిపోవడం ఖాయమన్న మానసిక స్థితికి కావూరి చేరుకున్నారంటే పాపం…ఆయన పరిస్థితిని చూసి ఎవరికైనా జాలి కలుగుతుంది. అయితే కావూరి ఎంతమాత్రం జాలిపడటానికి అర్హుడు కాదన్నది సీమాంధ్రుల ఏకాభిప్రాయం. కేంద్రమంత్రి పదవి వచ్చేంత వరకూ సమైక్యవాదిగా కనిపించిన కావూరి కేంద్రమంత్రి అవగానే సమైక్యవాదాన్ని అటకెక్కించేసి పక్కా కాంగ్రెస్ విధేయుడు అయిపోయారు. రాష్ట్ర విభజన పాపాన్ని ఒక్క పిడికెడు కాకుండా నాలుగైదు పిడికిళ్ళు తన అకౌంట్‌లో వేసుకున్నారు. రాష్ట్ర విభజనకు ఏ దశలోనూ వ్యతిరేకత తెలుపకుండా మంత్రి పదవే పరమావధిగా భావించిన కావూరి ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగిపోయాక తీరిగ్గా విచారిస్తున్నారు.

 

ఏలూరు పార్లమెంట్ స్థానం నుంచి తనకు గెలిచే సీన్ లేదని అర్థమైపోయిన ఆయన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి జంప్ జిలానీ అయిపోయే ప్రయత్నాలు మొదలెట్టారు. ఆరిపోయే దీపంలా వున్న మంత్రి పదవిని వదులుకోవడానికి కూడా రెడీ అయిపోయారు. పదవి లేకపోతే పచ్చి మంచినీళ్ళు కూడా గొంతులోంచి దిగని కావూరి సార్ మొన్నటి వరకూ తెలుగుదేశం పార్టీ నుంచి తనకు ఆహ్వానం వస్తుందేమోనని ఎదురుచూశారు. సీమాంధ్రలో తెలుగుదేశానికి వున్న అభిమాన్ని అడ్డు పెట్టుకుని మరోసారి పార్లమెంట్‌కి వెళ్ళాలని భావించారు. అయితే అటు నుంచి పట్టించుకునేవాళ్ళు లేకపోవడంతో ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలని అనుకున్నారు. అయితే అయ్యగారికి అంత ధైర్యం లేక ఇప్పడు బీజేపీతో రాయబారాలు నడుపుతున్నారు. కానీ అటు నుంచి కూడా కావూరికి ఇంతవరకు గ్రీన్ సిగ్నల్ రాలేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కావూరి ఏ పార్టీ నుంచి పోటీ చేసినా, ఇండిపెండెంట్‌గా పోటీ చేసినా ఓడిపోవడం ఖాయమన్నది తేలిపోయింది. అలాంటి కుంటి గుర్రాన్ని రేసులో నిలపడానికి ఏ పార్టీ ఇష్టపడటం లేదు. రాజకీయంగా తనకు వచ్చిన దురవస్థని చూసుకుని కావూరి మనశ్శాంతి లేకుండా వున్నారు. రాజకీయంగా దిమాగ్ ఖరాబ్ చేసుకుంటున్నారు.